iDreamPost
android-app
ios-app

సంతోష్ బాబు అమర్ రహే – దద్దరిల్లిన సూర్యాపేట

సంతోష్ బాబు అమర్ రహే – దద్దరిల్లిన సూర్యాపేట

అమ‌ర్ ర‌హే సంతోష్ బాబు..భార‌త్ మాతాకీ జై..నినాదాల‌తో సూర్యాపేట ప‌ట్ట‌ణం మారుమ్రోగింది . చైనా సైనికులు చేసిన దాడిలో సరిహద్దులో వీర‌మ‌ర‌ణం పొందిన సంతోష్ ను క‌డ‌సారి చూసేందుకు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు, ప్రజా ప్రతినిధులు త‌ర‌లివ‌చ్చారు.

ఈరోజు ఉద‌యం కల్నల్ సంతోష్ బాబు అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. ఈ సందర్భంగా సూర్యాపేటకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుడిని చూడటానికి ప్రజలు పోటెత్తారు. దీంతో సూర్యాపేట ప‌ట్ట‌ణంలో ఆయ‌న నివాసం కిక్కిరిసిపోయింది. సంతోష్‌బాబు అమర్‌ రహే అంటూ బంధువులు, స్థానికులు పెద్దఎత్తున నివాదాలు చేశారు. స్థానికులు జాతీయ జెండాలు చేతబూని సంఘీభావం ప్రకటించారు.

కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు 50 మందిని మాత్రమే పాల్గొనాలని కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలకు అనుమతి ఇచ్చారు.దాంతో కొందరు కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులు ఆధ్వర్యంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆర్మీ అధికారుల డ్రిల్ అనంత‌రం అంతిమ‌యాత్ర ప్రారంభ‌మైంది. ముందు వ‌రుస‌లో ఆర్మీ అధికారులు ఉండ‌గా వెనుక స్థానిక ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భార‌త్ మాతాకీ జైఅమ‌ర్ ర‌హే..సంతోష్ బాబు నినాదాల‌తో మారుమోగింది. అంతిమ‌యాత్ర నిర్వ‌హిస్తున్న వాహ‌నంపై పెద్ద ఎత్తున్న పూలు చ‌ల్లుతూ జోహార్ అంటూ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

గురువారం ఉదయం సంతోష్‌బాబు భౌతికకాయానికి పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్‌బాబు పార్థివహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కొద్దిసేపట్లో కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి. దేశం ఒక వీరుడుని కోల్పోయింద‌ని సంతోష్ బాబుకు క‌న్నీటి వీడ్కోలు ప‌లికారు. సూర్యాపేట నుంచి కేసారం వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.