iDreamPost
iDreamPost
లోక నాయకుడు కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు, విభిన్న కథలు భారతీయ సినీ పరిశ్రమలో ఇంకెవరు చేయలేదన్నది వాస్తవం. చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని బాషల స్టార్లు కమల్ ని విపరీతంగా ఇష్టపడతారు. అందుకే తన ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికంటే విభిన్నంగా ఉంటుంది. ఎన్నో భారీ చిత్రాలలో భాగస్వామ్యం పంచుకుని చరిత్రలో ఒక భాగమైన కమల్ స్వప్నం ఒకటి కాలగర్భంలో కలిసిపోవడం నిజంగా బాధ కలిగించేదే. 1997లో మరుదనాయగం పేరుతో ఈ విలక్షణ నటుడు ఒక భారీ ప్రాజెక్ట్ తలపెట్టారు. అక్టోబర్ 16న చెన్నై ఫిలిం సిటీలో జరిగిన ఓపెనింగ్ కి బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ రావడం అప్పట్లో ప్రపంచ మీడియాని సైతం నివ్వెరపోయేలా చేసింది.
ఆ సందర్భంగా ఆమెకు చూపించేందుకు కమల్ పది నిమిషాల పాటు సాగే ఒక ట్రైలర్ ని కమల్ హాసన్ షూట్ చేయించాడు. దానికైన ఖర్చు అక్షరాలా 1 కోటి 50 లక్షల రూపాయలు. అందులో నాజర్, ఓంపురి లాంటి జాతీయ నటులు పాల్గొనగా కొన్ని యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఇంకొన్ని సీన్లను జోడించి ప్రత్యేకంగా బ్రిటిష్ రాణి కోసం ఇది చూపించారు. హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్న ఆ విజువల్స్ చూసి ఎలిజిబెత్ తో పాటు ఆవిడతో ఉన్న ఇతర సభ్యులు షాక్ తిన్నారు. భారతీయ సినిమా ఇంతగా ఎదిగిందని ఊహించలేదని ప్రశంసించారు. అప్పటికి 275 సంవత్సరాల క్రితం జరిగిన నిజ సంఘటనలను ఆధారంగా చేసుకుని మరుదనాయగం కథను కమల్ రాసుకున్నారు. దీనికి ఎంతో రీసెర్చ్ చేశారు.
మొదట ఈస్ట్ ఇండియా కంపెనీలో సేనానిగా ఉన్న మరుదనాయగం ఆ తర్వాత స్వతంత్ర పోరాటం కోసం ఎలాంటి త్యాగాలు చేశారనే సబ్జెక్టు తో ఇది ప్లాన్ చేసుకున్నారు కమల్. ఆ టైంలోనే సుమారు 100 కోట్లతో దీన్ని ప్లాన్ చేశారని టాక్ వచ్చింది.దీనికి కొన్ని ట్రాక్స్ కంపోజ్ చేసిన ఇళయరాజా సంగీతం గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకునే వారు. అయితే బడ్జెట్ సమస్యల కారణంగా మరుదనాయగం తర్వాత ఆగిపోయింది. ఇప్పటిదాకా మళ్ళీ కొనసాగించనేలేదు. పెట్టుబడుల కోసం కమల్ ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి అది కలగానే మిగిలిపోయింది. అప్పటిదాకా షూట్ చేసిన నెగటివ్, ఆ ట్రైలర్ తాలూకు ఫుటేజ్ నైనా విడుదల చేయమని అభిమానులు కోరినా కమల్ స్పందించలేదు. ఒక వర్సటైల్ యాక్టర్ యొక్క గొప్ప స్వప్నం నిజం కాకుండానే తెరమరుగైంది. కమల్ ని ఇప్పుడు దీని గురించి పలకరించినా ఉద్వేగానికి లోనవుతారు.