నిమ్మల రామానాయుడు… ఒకప్పుడు టిడిపిలో అసలు ఎవరికీ తెలియని పేరు. దశాబ్దం క్రితం వరకు కూడా ఈ వ్యక్తి తెదేపాలోని సాధారణ కార్యకర్తకు సైతం తెలియదు. అవసరానికి వాడుకోవడం.. ఆర్థికంగా బలంగా లేకపోతే పక్కకు తొలగించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య కావడంతో అప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ బాధ్యతలు చూస్తూ టిడిపిలో అందరికీ సుపరిచితుడైన… మంచి వ్యక్తిగా డాక్టర్ గారు అని ఎంతో గౌరవంగా పిలిచే డాక్టర్ బాబ్జికు 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత టికెట్ ఇవ్వకుండా మొండిచెయ్యి చూపారు. వ్యాపారిగా ఉన్న నిమ్మల రామానాయుడుని ఎక్కడినుంచో తీసుకొచ్చి మరీ టికెట్ ఇప్పించారు. దీనికి నిమ్మల భారీగా పార్టీ ఫండ్ ఇచ్చారని ఆయన అనుచర వర్గమే చెబుతారు. దీంతో పార్టీ కోసం ఎప్పటినుంచో కష్టపడిన, అందరికీ తెలిసిన వ్యక్తి నిజాయితీపరుడైన బాబ్జి కు టికెట్ ఇవ్వకుండా నిరాకరించడంతో 2014లో డాక్టర్ బాబ్జి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 38 వేల ఓట్లను సాధించారు. దీని తర్వాత డాక్టర్ బాబ్జి అధికారంలో లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీలోనే జాయిన్ అయ్యారు. దీంతో ఆయన నిజాయితీను గుర్తించిన జగన్ ఆయనకు 2019లో పాలకొల్లు టికెట్ ఇచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన రామానాయుడు ఇప్పుడు ఏకంగా జిల్లాలో ముఖ్య వ్యక్తిగా… టిడిపిని మొత్తం తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటం, పార్టీ ఫండ్ పరంగా సహాయం చేస్తూ అధినేతకు దగ్గరవడం టిడిపి పశ్చిమగోదావరి జిల్లా నేతలకు నచ్చడం లేదు. పార్టీ కష్టకాలంలోనూ, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన సీనియర్లంతా ఈయన అతిని జాగ్రత్తగా గమనిస్తూ ఆయనతో మాట్లాడడం మానేశారు.
ప్రతిదీ తానే అనేలా!!
నిమ్మల రామానాయుడు 2014 ఎన్నికల్లో పాలకొల్లు నుంచి గెలిచినప్పటికీ పార్టీలోని జిల్లా నేతలతో ఆయనకు అంత మంచి సంబంధాలు ఏమీ లేవు. ముఖ్యంగా డెల్టాలో కీలకంగా వ్యవహరించే పార్టీ సీనియర్ నాయకురాలు పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మితో ఆయన అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు గెలుపు తర్వాత ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. టీడీపీలో తనకు తిరుగులేదన్న కోణంలో, పార్టీ అంటే తానే అన్నట్లుగా వ్యవహరిస్తూ సీనియర్లను సైతం అసలు పట్టించుకోకుండా ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారు. టిడిపి కార్యాలయానికి నిమ్మల రామానాయుడు వచ్చింది లేదు. పార్టీ లైను పార్టీ సహచరులను కనీసం గౌరవించకుండా సొంత నిర్ణయాలు తిసుకోవడం ఇప్పుడు టిడిపి పశ్చిమగోదావరి జిల్లా నేతలకు చిర్రేత్తుకు వచ్చేలా చేస్తుంది. పక్క నియోజకవర్గమైన నర్సాపురం, భీమవరం, ఉండి నియోజకవర్గాల నాయకులతో నిమ్మల రామానాయుడు ఎప్పుడు మాట్లాడింది లేదు వారిని కలుపు వెళ్ళింది లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చంద్రబాబుతో లోకేష్తో మాట్లాడుకుంటాం అన్న కోణంలోనే ఆయన పార్టీ లో కొత్త రాజకీయం చేస్తున్నారని టిడిపి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఏదయినా ఒక్కడిగానే!
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి నిమ్మల రామానాయుడు ఒక్కడిగానే చేసుకుంటున్నారు. నిరసనలు ఇతర కార్యక్రమాల సమయంలో సైతం పార్టీ సీనియర్లకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆయన సొంతంగా కార్యక్రమాలు నిర్వహించడం సైతం ఇప్పుడు జిల్లా టిడిపిలో చర్చనీయాంశమవుతోంది. ఇలా అయితే పార్టీలో ఐక్యత దెబ్బతిని కొత్త రాజకీయాలు కొత్త వ్యక్తుల చుట్టూ తిరిగే అవకాశం ఉందని ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అధినేత చంద్రబాబు సైతం నిమ్మల తీవ్ర మీద ఫిర్యాదు చేశారు. దీనిపై గతంలో ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన కలవపూడి శివ, భీమవరం నుంచి గతంలో గెలిచిన పులపర్తి రామాంజనేయులు సైతం ఆయన తీరు ఏమీ బాగా లేదని ఇలా అయితే పార్టీకి ఎంతో నష్టం అని అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారు. అయితే నిమ్మల రామానాయుడు ఆర్థికంగా కాస్త బలంగా ఉండటంతో పార్టీకి పనికి వస్తారు అనే కోణంలో చంద్రబాబు సైతం ఆయనను ఏమీ అనలేక పోతున్నారు. నిమ్మల రామానాయుడుకు లోకేష్ అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో పార్టీ పశ్చిమగోదావరి జిల్లా నేతలు ఇప్పుడు నిమ్మల రామానాయుడు సహాయనిరాకరణ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.