iDreamPost
android-app
ios-app

పోలవరం: జగన్ చేసి చూపిస్తున్నాడు

  • Published Jul 19, 2021 | 2:36 PM Updated Updated Jul 19, 2021 | 2:36 PM
పోలవరం: జగన్ చేసి చూపిస్తున్నాడు

పోలవరం ప్రాజెక్టు. ఎన్నో దశాబ్దాల కల. అందరో ముఖ్యమంత్రుల హామీ. కానీ మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలోనే ప్రాజెక్టు నిర్మాణ పనులకు పునాది పడింది. కాలువలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు దానిని కొనసాగించడంలో కొంత తాత్సార్యం చేశాయి. చివరకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ హోదా దక్కిన ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందని అంతా ఆశించారు. దానికి అనుగుణంగా నిధులు వస్తాయని భావించారు. కానీ చంద్రబాబు తన సొంతప్రయోజనాల కోసం..ఇంకా చెప్పాలంటే పీఎం నరేంద్రమోడీ అన్నట్టుగా పోలవరం ప్రాజెక్ట్ ని ఓ ఏటీఎంలా మార్చేశారు. దాంతో పోలవరం ప్రచారానికే తప్ప పనులు ముందుకు సాగని స్థితి ఏర్పడింది.

చంద్రబాబు హయంలో ఐదేళ్ళ కాలంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం ఏకంగా ఓ 30 సార్లు సందర్శించారు. వెళ్లిన ప్రతీ సారి నానా హంగామా. పెద్ద ప్రచారం. భారీ హడావిడి. ఓ సుదీర్ఘ సమీక్ష. కానీ ఫలితం మాత్రం కనిపించేంది కాదు. చివరకు సోమవారం పోలవరం అంటూ మార్చేసి చేసిన ప్రచార ఆడంబరం కూడా అక్కరకు రాలేదు. వెళ్ళిన ప్రతీ సమయంలోనూ ఓ శిలాఫలకం, చివరకు సొంత కుటుంబంతో కలిసి చేసిన గ్యాలరీ వాక్ కూడా చంద్రబాబు సొంత డబ్బా అన్నట్టుగా కనిపించాయి. ప్రాజెక్టు సందర్శన అంటూ బస్సులతో ప్రజలను తీసుకెళ్ళి ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం జయమూ..జయమూ చంద్రన్న అంటూ పాటలకే పరిమితం అయ్యింది. పనులు సాగకపోవడంతో చంద్రబాబు చెప్పిన మాటలన్నీ నీటిమూటలయ్యాయి.

రాసిపెట్టుకోండి..2018నాటికే పోలవరం నుంచి నీళ్లిస్తాం..2019లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా నాటి నీటిపారుదల మంత్రి నోటిపారుదల చెల్లలేదు. మాటలకు, పనులకు పొంతనలేని స్థితి ఏర్పడింది. పునరావాస పరిహారం నుంచి ప్రాజెక్టు పనుల వరకూ అన్నీ పెండింగులే. కాఫర్ డ్యామ్ నిర్మాణం కూడా పూర్తి చేయలేని స్థితి. స్పిల్ వే పునాదులకే పరిమితం అయ్యింది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుని నెత్తిన పెట్టుకుని కనీసం నిధులు తీసుకురావాలన్న ఆలోచన కూడా లేకుండా చంద్రబాబు చేసిన తప్పిదానికి ఫలితంగా ఇది కనిపిస్తోంది. ఇక పరిహారం పేరుతో టీడీపీ నేతలే పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడడంతో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులే అవినీతిలో బయటపడే పరిస్థితి వచ్చింది.

Also Read : పని తీరుకు పట్టం.. నవీన్ నిశ్చల్‌కు ఆగ్రోస్ చైర్మన్ పదవి

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ నిత్యం సమీక్షలంటూ హడావిడి లేదు. శిలాఫలకాలు వేసుకుని సోకు చేయాలన్న ఆలోచన లేదు. పర్యటనల పేరుతో ప్రజాధనం వృధా అంతకన్నా లేదు. కానీ పనులు మాత్రం జరుగుతున్నాయి. రివర్స్ టెండరింగులో పనులు దక్కించుకున్న మేఘ కంపెనీ చొరవ కూడా తోడ్పడింది. స్పిల్ వే నిర్మాణం పూర్తికావడంతో ఇప్పుడు ప్రాజెక్టుకి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం పోలవరం వద్ద పరిస్థితి చూస్తుంటే కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన తర్వాత నిండిన గోదావరి జలంతో కళకళలాడుతూ కనిపిస్తోంది. రాబోయే ఒకటి రెండేళ్లలోనే పోలవరం నుంచి ఫలితాలు ప్రజలకు అందే అవకాశం ఉంది. అయితే పునరావాసం విషయంలో కేంద్రం కొంత చొరవ చూపితే సమస్య వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్న ప్రాజెక్టు ప్రజలకు ప్రయోజనం అందించే దిశగా మళ్లించడానికి మార్గం సుగమం అవుతోంది.

ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచాలని కేంద్రంతో ఓ వైపు రాయబారాలు, మరోవైపు పనులు పూర్తయ్యేలా పగలూ రాత్రి తేడా లేకుండా ప్రయత్నాలు మాత్రమే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రచారంలో లేవు. పెద్దగా ప్రజలకు తెలియకపోవచ్చు. కానీ ఫలితాలు మాత్రం అనివార్యం. ప్రాజెక్టు తాజా రూపం చూస్తుంటేనే దానికో నిదర్శనం. అంటే చంద్రబాబు మాటలు చెబితే..జగన్ పనులు చేస్తున్నారనే వాదనకు నిలువెత్తు తార్కాణంగా పోలవరం కనబడుతోంది.

పోలవరం ప్రాజెక్టులో ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పరిస్థితిపై సీఎం తాజా సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2022 జూన్ నాటికి టన్నెల్ తో పాటుగా కెనాల్స్ సిద్ధం కావాలని ఆదేశించారు. రాబోయే రెండేళ్లలో పోలవరం పనులు పూర్తికావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ అమలు విషయంపై దృష్టి పెట్టాలన్నారు. గడిచిన కొంతకాలంగా కేంద్రం నుంచి నిధులు బకాయిలున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి రూ. 2100 కోట్లను ఖర్చు చేసి పనులు పూర్తి చేసినట్టు సీఎం తెలిపారు.

Also Read : హోదాపై పార్లమెంటులో వైఎస్సార్సీపీ గర్జన