iDreamPost
android-app
ios-app

వివాదాలొద్దు.. రైతే ముద్దు.. జల వివాదంపై కుండబద్ధలు కొట్టిన జగన్‌

వివాదాలొద్దు.. రైతే ముద్దు.. జల వివాదంపై కుండబద్ధలు కొట్టిన జగన్‌

తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య మొదలైన కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందించారు. రాయలసీమలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ జగన్‌.. జల వివాదంపై మాట్లాడారు. నీటి వాడకంపై తెలంగాణ తీరును, ఆ రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై సీఎం జగన్‌ మండిపడ్డారు. ఏ రాష్ట్రంతోనూ తాము వివాదాలు కోరుకోవడంలేదని, సత్సంబంధాలే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రాల రాజకీయాల్లో తాను వేలు పెట్టలేదని, భవిష్యత్‌లోనూ పెట్టబోనని తేల్చి చెప్పారు. ఏ రాష్ట్రమైనా రైతులే ముఖ్మమని, వారికి మేలు జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు. కానీ నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు.

పంపకాలు గుర్తు చేసిన జగన్‌..

కృష్ణా జలాలు ఇరు రాష్ట్రాల మధ్య సమాన పంపిణీ ఉండాలనే కొత్త డిమాండ్‌ను తెలంగాణ తెరపైకి తీసుకొచ్చిన సమయంలో.. అసలు లెక్కను సీఎం జగన్‌ వివరించారు. ‘‘ దశాబ్ధాలుగా ఆంధ్రప్రదేశ్‌ కలసి ఉన్నప్పుడు.. కృష్ణా జలాలు ఏ ప్రాంతానికి ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ విడిపోయిన తర్వాత 2015 జూన్‌ 19వ తేదీన కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకున్నాయి. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367, తెలంగాణకు 299 టీఎంసీలు వెరసి మొత్తం 811 టీఎంసీలు అని చెప్పి రాసుకున్నారు. ముగ్గురూ సంతకాలు చేశారు’’ అని వైఎస్‌ జగన్‌ గుర్తు చేశారు.

Also Read : ఆ గుర్తింపు… వైఎస్ కుటుంబానికే ద‌క్కింది..!

మీకులాగే మేము మా వాటా వాడుకుంటే తప్పేంటి..?

తమ వాటా నీటిని వాడుకోవడంలో జరుగుతున్న ఇబ్బంది ఏమిటో వైఎస్‌ జగన్‌ వివరించారు. రాయలసీమకు కేటాయించిన 144 టీఎంసీలు పూర్తిగా వాడుకునే పరిస్థితి ప్రతి ఏడాది ఉండడం లేదని వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ శ్రీశైలం నీటి మట్టం 885 అడుగులు, 881 అడుగులకు నీరు చేరితే తప్పా.. పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి సామర్థ్యం మేరకు నీరు తోడే పరిస్థితి లేదు. గడచిన రెండేళ్లు మినహాయిస్తే.. గత 20 ఏళ్లలో మొత్తం 20 నుంచి 25 రోజుల మాత్రమే 881 అడుగులపైన నీళ్లు ఉన్నాయి. పాలమూరు– రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి సహా అన్ని తెలంగాణ ప్రాజెక్టులు 800 అడుగుల లోపే ఉన్నాయి. 796 అడుగుల వద్దే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. ఇలాంటప్పుడు.. మీరు 800 అడుగుల్లోపు మీకు కేటాయించిన నీరు వాడుకుంటే తప్పులేనప్పుడు.. మేము కూడా 800 అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్‌ పెట్టి మాకు కేటాయించిన నీరు వాడుకుంటే తప్పు ఏముంది..?’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా..?

కృష్ణా జలాల వివాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయాలని చూస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైఎస్‌ జగన్‌ ఏకిపెట్టారు. చంద్రబాబు చేసిన తప్పులను ఎత్తి చూపి నోరు మూయించే ప్రయత్నం చేశారు. ‘‘ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. కేసీఆర్‌.. పాలమూరు, దిండి కట్టారు. కేసీఆర్‌ ఆ ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు ఏం గాడిదలు కాస్తున్నారు..? అని వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.

వివాదాలు వద్దు.. సత్సంబంధాలే కావాలి..

పొరుగు రాష్ట్రాలతో తాము వివాదాలు కోరుకోవడం లేదని, సత్సంబంధాలు కావాలని ఆశిస్తున్నట్లు వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ‘‘ రైతు ఎక్కడైనా రైతే. అందరూ బాగుండాలి. రైతుకు న్యాయం జరగాలి. కానీ నీళ్ల పేరుతో రాజకీయాలు జరుగుతున్నాయి. జగన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదు. సత్సంబంధాలు కావాలని కోరుకుంటున్నాం. ప్రజలు బాగుండాలి. అది జరగాలంటే పాలకులు మధ్య సత్సంబంధాలు ఉండాలి. అందుకే జగన్‌.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో వేలు పెట్టలేదు. రాబోయే రోజుల్లో కూడా వేలు పెట్టడు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉండాలన్నదే నా లక్ష్యం..’’ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ కృష్ణా జలాల వివాదానికి ముగింపు పలికేలా మాట్లాడారు.

Also Read : మా రైతుల ప్ర‌యోజ‌నాల‌కు న‌ష్టం క‌లుగుతోంది : ప్రధానికి జగన్ మరో లేఖ..