iDreamPost
android-app
ios-app

శ్రీసిటీ నుంచి ఆక్సిజన్‌

  • Published Jan 29, 2022 | 5:17 AM Updated Updated Jan 29, 2022 | 5:17 AM
శ్రీసిటీ నుంచి ఆక్సిజన్‌

కరోనా థర్డ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్‌ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో నోవా ఎయిర్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ యూనిట్‌ ఉత్పత్తికి సిద్ధమయ్యింది. గురువారం దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. రికార్డు స్థాయిలో నిర్మాణం ప్రారంభించిన 12 నెలల్లోనే ఈ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసింది.

వేగంగా పనులు పూర్తి..

ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాయువుల తయారీ కంపెనీ నోవా ఎయిర్‌ టెక్నాలజీ.. ఒకపక్క కోవిడ్‌ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించి 2021 నవంబర్‌కి పూర్తిచేసింది. ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. రోజుకు 250 టన్నుల మెడికల్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ ఆక్సిజన్, లిక్విడ్‌ నైట్రోజన్, లిక్విడ్‌ ఆర్గాన్‌ను ఉత్పత్తి చేసేవిధంగా ఈ యూనిట్‌ను రూ.106 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్‌ ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది.

పీఏజీతో ఒప్పందం..

హాంకాంగ్‌కు చెందిన అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పీఏజీ నోవా ఎయిర్‌ టెక్నాలజీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వాయువులను ఉత్పత్తి చేస్తోంది. పీఏజీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.3,37,500 కోట్లకుపైగా ఉండగా, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.22,500 కోట్ల విలువైన పారిశ్రామిక వాయువుల వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది.  

Also Read : ఏపీలో 2.0 : కొత్త పోర్టల్ – సేవ‌లు మ‌రింత స‌రళీక‌ర‌ణం