పట్టుపట్టరాదు పట్టువిడువరాదనే మాట సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వారిని ఉద్దేశించే అంటుంటారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ పట్టువిడవడం లేదు. హోదా సాధనే తమ ధ్యేయమని ఎన్నికలకు ముందు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్.. అది వస్తేనే ఏపీ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ రావడంతో.. డిమాండ్ చేసి సాధించుకునే అవకాశం లేకుండా పోయిందని 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ వెళ్లిన సందర్భంగా నిర్మొహమాటంగా చెప్పారు. అయితే హోదా ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇచ్చిన మాట మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోదీ వద్ద ప్రత్యేక హోదా విషయాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాల పట్ల తనకున్న శ్రద్ధను చాటిచెబుతున్నారు.
భేషరతు హామీ ఇచ్చారు..
ఈ రోజు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం వైఎస్‌జగన్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక హోదా, రాష్ట్ర సమస్యలు, నిధులు అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదా ఇస్తామని నాడు పార్లమెంట్‌లో భేషరతుగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా వల్లనే సాధ్యమని గుర్తు చేశారు. హోదా ఉంటేనే పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకెళ్లగలమని పేర్కొన్నారు. మంచిపనితీరు ఉన్న పరిశ్రమలకు పోత్రాహకాలు ఇస్తున్నామని, కేంద్రం నిర్ధేశించిన సంస్కరణలను అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ మోదీకి వివరించారు.
పోలవరం అంచనాలు ఆమోదించండి..
రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిధుల అంశం కూడా సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీ దృష్టికి మరోసారి తీసుకెళ్లారు. పోలవరం నిర్మాణ ఖర్చులో సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని కోరారు. పోలవరం ఆవశ్యకతను ప్రధానికి మరోసారి వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు టెండర్లు పిలిచామని తెలిపారు. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు, గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు 10 వేలకు పైగా విలేజ్ క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానికి తెలిపారు. ప్రతిపాదనలను పంపిన 13 వైద్య కాలేజీలకు అనుమతులను మంజూరు చేయాలని విన్నవించారు.
వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి..
వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగుమందులు రైతులకు అందించాలని వివరించారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్, ప్రాసెసింగ్ లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రైతులు తమ పంటను సరైన ధరకు అమ్ముకునేలా తగిన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Read Also : నిమ్మగడ్డ ఆలోచన కు హైకోర్టు బ్రేక్