వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకుని సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ.. విపక్షాలను దెబ్బ కొట్టేందుకు ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది. బ్యాలెట్ పోరులో ప్రత్యర్థులను మరోసారి మట్టికరిపించి, మొత్తం 403 సీట్లలో 350 సీట్లు తమ ఖాతాలో వేసుకునేందుకు కాషాయపార్టీ కసరత్తులు ప్రారంభించింది.
ఎన్నికల వ్యూహాల్లో భాగంగా సీఎం యోగి.. కేబినెట్‌ను విస్తరించారు. కులసమీకరణలు, ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా కేబినెట్ విస్తరణలో ఏడుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జితిన్ ప్రసాదకు మంత్రి పదవి దక్కింది. యూపీలో కీలకమైన బ్రాహ్మణ ఓట్ల కోసమే సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : వచ్చే నెలలో బ్రేకప్ ఖాయమా, యూపీ ఎన్నికల వరకూ ఆగుతారా
కొత్త మంత్రులలో బరేలీ ఎమ్మెల్యే గంగ్వార్, ఆగ్రా ఎమ్మెల్సీ ధరమ్‌వీర్ ప్రజాపతి, ఘాజిపూర్ ఎమ్యెల్యే సంగీత బింద్‌లు ఓబీసీ సామాజికవర్గానికి చెందిన వారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి హస్తినపూర్ ఎమ్మెల్యే దినేష్ ఖటిక్, బలరామ్ పూర్ ఎమ్మెల్యే పట్లురామ్ లకు మంత్రివర్గంలో చోటు దక్కగా.. ఎస్టీ కేటగిరి నుంచి సంజీవ్ కుమార్ యోగి కేబినెట్‌లో జాయిన్ అయ్యారు.
కేబినెట్ విస్తరణతో మంత్రుల సంఖ్య 60కి చేరింది. యూపీ అసెంబ్లీలో మొత్తం సీట్లు 403 కాగా 2017లో బీజేపీ 312 సీట్లు గెలుచుకోవగా దాని మిత్రపక్షాలు 13 సీట్లు గెలుచుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 350 సీట్లు గెలవాలని వ్యూహాలు పన్నుతోంది. అందులో భాగంగా అన్ని వర్గాల వారిని తమ వైపు తిప్పుకునేందుకు కేబినెట్ విస్తరణ చేపట్టింది.
ఎలక్షన్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో సీఎం యోగీ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. బీజేపీ పాలనలో యూపీ సాధించిన ప్రగతితో పాటు శాంతిభద్రతలు అదుపులో ఉన్న విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
Also Read : మమతా ఇటలీ పర్యటనపై వివాదం ఏమిటి..?