iDreamPost
android-app
ios-app

క్షేత్ర‌స్థాయికి దూసుకెళ్ల‌డంలో కేసీఆర్ రూటే.. సెప‌రేటు..!

క్షేత్ర‌స్థాయికి దూసుకెళ్ల‌డంలో కేసీఆర్ రూటే.. సెప‌రేటు..!

ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుది విభిన్న శైలి. మీడియా స‌మావేశాల్లోనైనా.. పార్టీ మీటింగుల్లోనైనా ఆయ‌న మాట‌ల‌కు ఎవ‌రైనా ఫిదా కావాల్సిందే. ఏ అంశం పైనైనా పూర్తి అవ‌గాహ‌న‌తోనే రంగంలోకి దిగుతారు. క్లాజులు.. స‌బ్ క్లాజులు.. అన్నింటి వివ‌రాలూ పూర్తిగా తెలుసుకున్నాకే చ‌ర్చ‌కు సిద్దం అవుతారు. ప‌క్క‌నే ఉండే వారితోనే కాదు.. మారుమూల గ్రామాల్లో ఉండే వారిని కూడా ఒక్కో సారి ప‌ల‌క‌రించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు. ఎంత బిజీగా ఉన్నా అప్పుడ‌ప్పుడు మిత్రుల‌కు కూడా ఫోన్ చేసి మాట్లాడ‌తారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆరేళ్ల కాలంలోఎంద‌రో స‌ర్పంచ్ ల‌కు, ఎంపీటీసీల‌కు, రైతుల‌కు స్వ‌యంగా ఫోన్ చేశారు. ప్ర‌భుత్వ‌ ప‌థ‌కాలు అందుతున్న తీరును, స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

ఫేస్ బుక్ లో రైతు పెట్టిన పోస్టుకు సైతం…

క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల‌పై కూడా సీఎం కేసీఆర్ దృష్టి పెడ‌తార‌న‌డానికి చిన్న ఉదాహ‌ర‌ణ‌గా ఓ సంఘ‌ట‌న‌ను చెప్పుకోవ‌చ్చు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన యువరైతు శరత్.. గ‌తంలో ఓ పోస్టును ఫేస్‌బుక్‌లో పెట్టారు. తన 7 ఎకరాల భూమిని వీఆర్వో కరుణాకర్‌ ఇతరులకు పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. 11 నెలలుగా పోరాడుతున్నా.. సమస్య అలాగే ఉందని గోడు వెల్లబోసుకున్నాడు. అన‌తి కాలంలోనే ఆ పోస్టు వైరల్‌గా మారింది. సీఎం కేసీఆర్ దృష్టికి వచ్చింది. వెంట‌నే కేసీఆర్ ఆ యువ‌రైతుకు స్వ‌యంగా ఫోన్ చేశాడు. సమస్య గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయం జ‌ర‌గ‌డ‌మే కాదు.. ఏకంగా సీఎం ఫోన్ చేసి మాట్లాడ‌డంతో మారుమూల ప్రాంతంలో ఉండే ఆ యువ‌రైతు ఆనందానికి హ‌ద్దుల్లేవ్.

అలాంటివెన్నో ముచ్చ‌ట్లు…

కేసీఆర్ ఫోన్ ముచ్చ‌ట్లు ఒక‌టి, రెండూ కావు. అలాంటి సంఘ‌ట‌న‌లెన్నో తెలంగాణ‌లో జ‌రిగాయి. ముఖ్యమంత్రి ఫోన్‌ లైన్ లోకి వ‌చ్చి రాజన్నసిరిసిల్ల జిల్లా రైతులను కూడా అలాగే అశ్చర్యానికి గురి చేశారు. ఓసారి బోయినిపల్లి మాజీ జెడ్పీటీసీ లచ్చిరెడ్డి, వెంకట్రావుపేట మాజీ సర్పంచ్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్‌చేసి మధ్యమానేరు ప్రాజెక్టు పనితీరును ప్రస్తావించారు. అలాగే, వరదకాలువ ద్వారా జగిత్యాల జిల్లా కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో పొలాలకు సాగునీరందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా ఫోన్‌చేసి ఆరా తీయడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. మర్కుక్ గ్రామ సర్పంచ్ భాస్కర్ కు కూడా సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ప్రారంభోత్సవం రోజున భోజ‌న ఏర్పాట్ల‌పై కూడా ఆయ‌న‌తో చ‌ర్చించ‌డం ఆస‌క్తిగా మారింది.

ఆ స‌మ‌యంలో కూడా…

క‌రోనాకు భ‌య‌ప‌డి సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు పారిపోయార‌ని ప్ర‌తిప‌క్షాలు కొద్ది రోజుల క్రితం తీవ్ర దుమారం రేపాయి. అయితే.. ఆ స‌మ‌యంలో కూడా ఆయ‌న ఓ గ్రామ మాజీ స‌ర్పంచ్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ నెల 9న జ‌గిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వెంకట్రావుపెట్ మాజీ సర్పంచ్ శ్రీపాల్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎస్సార్ఎస్పీ పునర్జీవ పథకంతో కొనసాగుతున్న నీటి తరలింపుపై ఆరా తీశారు. వరద కాలువకు నీటి తరలింపు విజయవంతం అయిందన్న సీఎం కేసీఆర్ కథలపూర్, మేడిపల్లి, మాల్యాల మండలాల్లో నెలకొన్న సాగునీటి సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు కేసీఆర్. త్వరలోనే రైతు సమన్వయ సమితి నాయకులతో పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి.. అన్న‌ట్లే ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు రాగానే స‌మావేశం ఏర్పాటు చేశారు.

తాజాగా మ‌రోసారి..

శుక్ర‌వారం కూడా జగదేవ్‌పూర్‌ మండలంలోని కొత్తపేట, ఇటిక్యాల గ్రామాల సర్పంచ్‌లతో సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. ఆయా గ్రామాల్లో దశాబ్దాల నుంచి ఉన్న భూ సమస్యలను పలుమార్లు రైతులు సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పరిష్కారం కాలేదు. దీంతో స్వయంగా సీఎం కేసీఆర్‌ రెండు గ్రామాల సర్పంచ్‌లకు ఫోన్‌ చేసి మాట్లాడారు. భూ సమస్యను పరిష్కరించి రెండు మూడు రోజుల్లో రైతులకు రైతు బంధు చెక్కులు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో కుదరకపోతే పది రోజుల్లో వచ్చి పట్టా పాస్‌ పుస్తకాలను స్వయంగా పంపిణీ చేస్తానని చెప్పినట్లు సర్పంచ్‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా కొత్తపేట సర్పంచ్‌ వెంకట్రామిరెడ్డి సార్‌ మీరు మా ఊరికి తప్పకుండా రావాలి అని కోరిన‌ప్పుడు నేను శనివారం లేదా ఆదివారమైనా, సోమవారమైనా వస్తాను. శనివారం కలెక్టర్‌ను పంపిస్తాను అంటూ కేసీఆర్ స‌మాధానం ఇచ్చారు. ఇలా ప్ర‌జ‌ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చ‌డంలో, ఆక‌ట్టుకోవ‌డంలో కేసీఆర్ విభిన్న తీరును క‌న‌బ‌రుస్తారు.