వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అసలు ఎన్ని హామీలు ఉన్నాయి.. అనే అంశంపై ఇప్పటి వరకూ స్పష్టత లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలకు క్రమ సంఖ్య వేయలేదు. మేనిఫెస్టోను బైబిల్‌గా, ఖురాన్‌గా, భగవద్గీతగా భావించే సీఎం వైఎస్ జగన్ అందులో పేర్కొన్న ప్రతి హామీని తప్పక అమలు చేస్తానని ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చారు. అంతేకాదు మేనిఫెస్టోను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.
ఈ రోజు తన ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మేనిఫెస్టోలోని హామీలు, తాను అమలు చేసిన హామీలపై ఓ క్లారిటీ ఇచ్చారు. మేనిఫెస్టోలోని అంశాలలో 90 శాతం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నామని సీఎం వైఎస్ జగన్ ఇటీవల మన పాలన – మీ సూచనలో పేర్కొన్నారు. సీఎం ప్రకటనపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి. అయితే ఆయా విమర్శలకు సీఎం జగన్ ఈ రోజు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అసలు తన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఉన్నాయి..? ఎన్ని అమలు చేశాం..? అనే వివరాలను వెల్లడించారు.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో మొత్తం 129 హామీలు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. ఐదేళ్ల కాలంలో అమలు చేస్తామన్న తన ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి ఏడాదిలోనే 77 హామీలను అమలు చేశామని చెప్పారు. మరో 36 హామీల అమలు కోసం ఇప్పటికే ప్రారంభాల తేదీలతో క్యాలెండర్ కూడా విడుదల చేశామని తెలిపారు. 77 అమలు చేసిన హామీలతోపాటు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన మరో 36 హామీలను కలిపితే.. మొత్తం 113 హామీలు అవుతాయి. మొత్తం 129 హామీల్లో 113 హామీలు మినహాయిస్తే.. ఇక మరో 16 హామీలు అమలు చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా త్వరలో అమలు చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
ఇచ్చిన హామీలు 129 అయితే.. చెప్పని హామీలు కూడా అమలు చేసిన ఘనత తమదని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రజా అవసరాలు, ఇబ్బందులు, కష్టనష్టాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల మేనిఫెస్టోలో లేని 40 అంశాలను అమలు చేశామని సీఎం జగన్ తెలిపారు. అంటే ఇచ్చిన హామీలతోపాటు.. అందులో దాదాపు మూడో వంతు హామీలు చెప్పకపోయినా ప్రజా అవసరాల దృష్ట్యా అమలు చేసినట్లవుతుంది.
చిత్తశుద్ధి, నిజాయతీ, నిబద్ధతతో పని చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. తాను ఈ అంశాలు చెప్పడమే కాదని. ఏ హమీ అమలు చేశాము..? ఏది చేయలేదు..? అనేది ప్రజలే నిర్ణయించేలా త్వరలో వాలంటీర్ల ద్వారా మేనిఫెస్టోను పంపిస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోతోపాటు ఇచ్చే బుక్‌లెట్‌లో ప్రజలే టిక్ కొట్టాలని ఆయన సూచించారు.