iDreamPost
iDreamPost
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా విధులు నిర్వహించిన జర్నలిస్టులను కోవిడ్ వారియర్ జాబితాలో చేర్చాలనే డిమాండ్ వినిపించింది. పలు జర్నలిస్టు సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించాయి. కానీ పెద్దగా ఫలితాలు రాలేదు. ఎట్టకేలకు ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం కొంత చొరవ ప్రదర్శించింది. కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. తద్వారా బాధిత జర్నలిస్టుల మీద ఆధారపడిన వారికి తోడుగా నిలుస్తామని జగన్ ప్రభుత్వం చెప్పినట్టయ్యింది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సుమారు 1200 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. వారిలో 80 శాతం మంది కోలుకోగా 15 శాతం మంది ఆస్పత్రుల పాలయ్యారు. రాష్ట్రంలోని వివిద జిల్లాలకు చెందిన 39 మంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. అందులో అత్యధికంగా నెల్లూరు జిల్లాకు చెందిన వారే. ఈ మృతులను ఆదుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ఎట్టకేలకు స్పందిస్తూ సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ ఘటనల్లోమృతి చెందిన జర్నలిస్టులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కరోనా మృతుల విషయంలో కూడా ఉదారంగా ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తీరు పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం కొన్ని వార్డులు కేటాయించారు. ఆయా జిల్లాల యంత్రాంగం చొరవతో కొంత మెరుగైన ఆరోగ్యం అందించే ప్రయత్నం జరుగుతోంది. దానికి తోడుగా జర్నలిస్టు కుటుంబాలకు తోడుగా ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని అన్ని జర్నలిస్టు సంఘాల నేతలు అంటున్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్ వంటి వారి చొరవతో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు పౌర సంబంధాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.