– 300 చ.అ. ఇల్లు రూపాయికే సొంతం
బ్యాంకు రుణం లేదు… వడ్డీలూ ఉండవు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కూడా చెల్లించాల్సిన పని లేదు. ఒకవేళ ఎవరైనా రూ.500 చెల్లించి తమ పేరు మీద ఇల్లు రిజిస్ట్రేషన్ చేపించుకున్నా ఆ మొత్తం వెనక్కి ఇచ్చేస్తారు. కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించి 300 ఎస్‌ఎఫ్‌టీ ఇంటిని సొంతం చేసుకునే అపూర్వ అవకాశాన్ని సీఎం జగన్ పట్టణ పేదలకు కల్పించారు.
రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీ టిడ్కో) 88 మున్సిపాలిటీల పరిధిలో జీ + 3 విధానంలో గృహ సముదాయాలు నిర్మించింది. వాటిల్లో 300 ఎస్‌ఎఫ్‌టీ ఇళ్ల యూనిట్ ధర రూ.2.65 లక్షలుగా నిర్ణయించింది. అలా 1,43,600 యూనిట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500 చొప్పున చెల్లించాలని పేర్కొంది. ఇక ఇళ్ల ధర రూ.2.65 లక్షలు బ్యాంకు రుణంగా ఇప్పిస్తామని, లబ్ధిదారులు ఏళ్ల తరబడి ప్రతి నెలా వడ్డీ చెల్లించాలని తెలిపింది.
రూపాయికే ఇంటిని ఇచ్చేద్దాం..
300 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లలో నివసించేందుకు సిద్ధపడ్డ నిరుపేదలపై రూ.2.65 లక్షల చొప్పున రుణభారం మోపితే ఎన్నాళ్లకు తీర్చగలరనే ఉద్దేశంతో ఆ లబ్ధిదారులకు ఇళ్లను కేవలం ఒక్క రూపాయికే ఇవ్వాలని సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకు రుణం, వడ్డీలూ, రిజిస్ట్రేషన్ ఫీజు ఇలా ఏవీ ఉండవు. కేవలం ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు ఇంటిని సొంతం చేసుకోవచ్చు. దీని వల్ల 1,43,600 మందికి రూ.3,812.58 కోట్ల మేర ప్రయోజనం కలగనుంది.
మూడేళ్ల పాటు ప్రాజెక్టు ..
– టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం రూ. 2,500 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.
– ఈ ప్రాజెక్టును మూడేళ్లలో చేపట్టనున్నారు.
ఆప్షన్ ప్రక్రియ ప్రారంభం
టిడ్కో కింద 300 చదరపు అడుగుల ఇల్లు పొందనున్న లబ్ధిదారుల దగ్గరకు వలంటీర్లు ప్రభుత్వ లెటర్ తీసుకువెళనున్నారు. మీకు చంద్రబాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని అడుగుతారు. ఏది కావాలో తేల్చుకోమని చెబుతారు. ఈ ప్రక్రియ కొన్ని జిల్లాల్లో ఇప్పటికే చేపట్టారు.
ఇదీ బాబు స్కీమ్..
– లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి. ఆ తర్వాతే ఇంటిపై హక్కులు చేతికి వస్తాయి. అప్పుడే ఆ ఇంటి పట్టా లబ్ధిదారులకు అందుతుంది.
జగన్ స్కీమ్ ఇలా..
300 చ.అ. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తారు. ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. ఆ తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తారు.
అధికారం చేపట్టి రెండేళ్లు కూడా గడవక ముందే సంక్షేమ పథకాల్లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే పేదలకు 35 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశారు. అగ్రవర్ణ పేదలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్ల పాటు అందజేసే పథకాన్ని ప్రారంభించారు. తాజాగా రూపాయికే ఇల్లు.. పేదవారి బాధలు తీర్చి, వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న జగన్ పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.