కరోనా విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించింది. ఈ విషయం అంతర్జాతీయంగానూ గుర్తింపు పొందింది. స్వయంగా సీఎం జగన్ తాను తొలుత కరోనా గురించి అసలు వాస్తవాన్ని బయటపెట్టారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో సహజీవనం తప్పదని చాటిచెప్పారు. అదే సమయంలో అది పెద్ద సమస్య కాదని, సాధారణ జ్వరం మాదిరిగా వచ్చి పోతుందని, కొద్ది మందికి మాత్రమే సమస్య అవుతుందని ఆయన స్పష్టం చేశారు. సరిగ్గా జగన్ ఏం చెప్పారో అదే జరిగింది. ప్రారంభంలో జగన్ ని ట్రోల్ చేసేందుకు యత్నించిన వారు కూడా ఆ తర్వాత వాస్తవాన్ని అంగీకరించక తప్పని స్థితి ఏర్పడింది.
సరిగ్గా అలాంటి అనుభవమే ఏలూరు ఉదంతంలో మరోసారి తేటతెల్లమయ్యింది. జగన్ పాలనా సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఏలూరులో అంతుచిక్కని సమస్య వెలుగులోకి రాగానే దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరిగింది. సామాన్యులు కొందరు హఠాత్తుగా కిందపడిపోవడం, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వారిని మరింత కలవరపరిచేలా కొందరి వ్యవహారం సాగింది. టీడీపీ నాయకుడు నారా లోకేష్ వంటి వారు ఆలూలేదు చూలు లేదు అన్నట్టుగా జగన్ ప్రభుత్వ వైఫల్యమని విమర్శిస్తే, టీడీపీ నేతలు కొందరు మరో అడుగు ముందుకేసి జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్ర నాథ్ రెడ్డి మీద విమర్శలకు పూనుకున్నారు. ఆయనకు సంబంధం లేకపోయినా క్లోరిన్ సరఫరాలో లోపాలున్నట్టు కథలు అల్లి ప్రచారం చేశారు.
ప్రభుత్వం మాత్రం ప్రారంభం నుంచి ఓవైపు అవసరమైన చర్యలు తీసుకుంటూనే, రెండో వైపు నిబ్బరంగా సాగింది. అవసరమైన పరీక్షలకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది. ప్రభావిత ప్రాంతాలన్నింటా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. అదనంగా ఆంబులెన్సులు తరలించింది. అవసరమనుకున్న ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. ఓవైపు ప్రజల్లో అపోహలు తొలగించే ప్రయత్నం, రెండో వైపు ఆరోగ్య అవసరాలు తీర్చే ఏర్పాట్లు చేసింది. కొన్ని మీడియా చానెళ్లలో ఏలూరులో ఏదో జరిగిపోతోందనే అర్థసత్యాల ప్రచారం సాగుతున్నప్పటికీ సర్కారు చొరవ కారణంగా ఏలూరు వాసులు అంతా సాధారణం అన్నట్టుగానే వ్యవహరించారు. బాధితులు కొన్ని గంటల వ్యవధిలోనే కోలుకుని, మళ్లీ డిశ్ఛార్జ్ అవుతున్న తరుణంలో వారికి మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ప్రాధాన్యతనిచ్చింది.
తొలుత ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్వయంగా 24 గం.ల పాట సమన్వయం చేస్తూ సాగగా, ఆ తర్వాత సీఎం జోక్యం చేసుకున్నారు. ఏలూరులో పర్యటించి కేవలం తూతూమంత్రంగా కాకుండా బాధితులకు భరోసా కల్పించేలా వారితో సుమారు గంట సమయం గడిపారు. దాంతో ఏలూరుకి ఏదో అయిపోయిందని కంగారు పడుతున్న ప్రజలందరికీ ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎటువంటి కలవరం అవసరం లేదని ఆయన తన వ్యవహారశైలిద్వారా చాటారు. చివరకు కేంద్ర ప్రభుత్వ బృందాలు, రాష్ట్రం నుంచి వెళ్ళిన వివిధ శాంపిళ్ల రిపోర్టులు వస్తున్న క్రమంలో లెడ్, నికిల్ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి మూలాలు కూడా నిర్ధారణ అయితే సమస్య పునరావృతం కాకుండా చూసేందుకు సన్నద్ధమవుతోంది.
మొత్తంగా హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలని , ఇతర హంగామా కోసం విపక్షాలు చేసిన రాజకీయాలను పట్టించుకోకుండా ప్రజల సంక్షేమం, ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. మరణాలు లేకుండా గట్టెక్కాలనే లక్ష్యంతో చేసిన యత్నాలు చాలా వరకూ ఫలించడంతో వైద్య సిబ్బంది కూడా ఊపిరిపీల్చుకుంటున్నారు. ప్రభుత్వం ప్రచారం కన్నా ఫలితాలకు ప్రాధాన్యతనిస్తే ప్రజలకు దక్కే ఊరట ఎలా ఉంటుందో ఏలూరు అనుభవం మరోసారి చాటింది. తాను గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటూ ప్రచారం చేసుకునే నాయకులకు భిన్నంగా తన మార్క్ పాలనతో ప్రజలకు అండగా నిలుస్తున్న తీరు ఆదర్శవంతంగా మారుతోంది.