iDreamPost
android-app
ios-app

రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గొద్దు : అధికారుల‌కు జ‌గ‌న్ స్వేచ్ఛ

రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గొద్దు : అధికారుల‌కు జ‌గ‌న్ స్వేచ్ఛ

అక్ర‌మార్కుల ఆట‌క‌ట్టి.. అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ప్ర‌జ‌ల‌కు అస‌లైన సేవ‌లందించేందుకు చాలా మంది అధికారులు ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ వారికి అడుగ‌డుగునా రాజ‌కీయ నాయ‌కులు అడ్డు త‌గులుతూ ఉంటారు. త‌మ వాళ్ల‌కు జోలికెళ్లొద్దంటూ వారిపై ఒత్తిళ్లు తెస్తుంటారు. దీంతో ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న ఉన్నా కొంత మంది అధికారులు రాజ‌కీయాల కార‌ణంగా అక్ర‌మార్కుల‌ను చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం ఆ ప‌రిస్థితులు లేవు. ఎవ‌రి మీద రాజ‌కీయ ఒత్తిళ్లు లేవు. వైఎస్ఆర్ సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక అధికారులు త‌మ విధుల‌ను ధైర్యంగా నిర్వ‌హిస్తున్నారు. అందుకు కార‌ణం ముఖ్య‌మంత్రి వైఎస్. జ‌గ‌న్.

స్ప‌ష్ట‌మైన ఆదేశాలు..

ఇసుక‌, మ‌ద్యం, ఇత‌ర అంశాలు ఏమైనా స‌రే.. అక్ర‌మాల క‌ట్ట‌డికి ఎవ‌రు అడ్డుప‌డినా ఉపేక్షించొద్ద‌ని, చివ‌ర‌కు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ‌రైనా స‌రే ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌ద్ద‌ని సీఎం జ‌గ‌న్ గ‌తంలోనే అధికారుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌త్యేకంగా స్పెష‌ల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి ప్ర‌త్యేక టీం ను కూడా ఏర్పాటు చేశారు. ఆ టీం ఎక్క‌డా ఒత్తిళ్ల‌కు లొంగ‌కుండా ప‌ని చేస్తూ ఉత్త‌మ ఫ‌లితాల‌ను చూపుతోంది. ఇప్పుడు తాజాగా ఇసుక, మద్యం అక్రమాలతో పాటు అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని మ‌రో్ సారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న సీఎం, వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్‌ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్‌ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

మీ వెనుక సీఎం ఉన్నారు..

“మీరు ఎవ‌రికీ భ‌య‌ప‌కండి.. మీ క‌ర్త‌వ్యాల‌ను త్రిక‌ర‌ణ‌శుద్ధితో నిర్వ‌ర్తించండి.. మీ వెనుక సీఎం ఉన్నారంటూ” జ‌గ‌న్ అధికారుల‌కు పూర్తి భ‌రోసా ఇస్తున్నారు. ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావు. క్రితంసారి కొన్ని విషయాలు ప్రస్తావించాను. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని పత్రికల్లో చదివాను. వాటికి సంబంధించి సీఐ, ఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్‌ వరకు స్పష్టమైన మెసేజ్‌ వెళ్లాలి. లేదంటే మంచి ఫలితాలు రావు. ఆ దిశలో సిబ్బందిని బాగా సెన్సిటైజ్‌ చేశారు. ఎస్పీలకు అభినందనలు.” అంటూ జ‌గ‌న్ వారిని ప్రోత్స‌హించారు.