“మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను.. మాట ఇచ్చాక అడుగు ముందుకే” దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి పాటించే నియమం ఇది. ఆయన వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ వేసిన ప్రతీ అడుగులోనూ అది కనిపిస్తుంది. గతం సంగతి అలా ఉంచితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేనిఫెస్టో లోని హామీలను నెరవేర్చడంలోనే కాదు, సమయం, సందర్భాను సారం.. రాష్ట్ర ప్రయోజనాల, అవసరాల కోసం ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇటీవల విశాఖపట్టణం వెళ్లిన సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ వినతిని కేంద్రం పట్టించుకోకపోతే అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపుతానని హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన మంత్రి వర్గ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడమే కాకుండా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, కేంద్రానికి పంపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూనే, ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాల్ని కూడా మోదీకి రాసిన లేఖలో జగన్ వివరించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ఉద్యమాన్ని కొందరు తమ స్వలాభం కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో కార్మికులకు మద్దుతు పలుకుతోంది. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంటూ ఉద్యమం ఉధృతంలో తన వంతు ప్రాత పోషిస్తున్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎంపీ విజయసాయిరెడ్డి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టగా.. ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది. మరోవైపు ఇతర వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కూడా ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా, తాజాగా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో కార్మికులకు ప్రభుత్వం తమవైపు ఉందన్న నమ్మకం మరింత బలపడింది.