iDreamPost
iDreamPost
పంజాబ్ కాంగ్రెసులో చోటు చేసుకున్న పరిణామాలు , ముఖ్యమంత్రి మార్పు ప్రభావం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్,ఛత్తీస్‌ఘడ్‌లపై పడింది. ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న విభేదాలు పంజాబ్ మార్పుల నేపథ్యంలో మళ్లీ ఊపందుకున్నాయి. ఆ రెండు రాష్ట్రాల సీఎంలను మార్చాలని డిమాండ్ చేస్తూ అసమ్మతి నేతలు ఢిల్లీకి చేరుకొని లాబీయింగ్ చేస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ను తొలగించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం, చత్తీస్గఢ్ సీఎం భూపేష్ భాగేల్ ను తప్పించి తనకు అవకాశం ఇవ్వాలని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టి.ఎస్. సింగ్ దేవ్ కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటికప్పుడు వారిని చల్లబర్చి.. కాలయాపన చేస్తూ వస్తోంది.పంజాబ్‌లో హఠాత్తుగా సీఎంను మార్చడం ఆ రెండు రాష్ట్రాల్లోని అసమ్మతి వర్గాల ఆశలకు ఊపిరి పోసింది.
ఢిల్లీలో పైలట్ వర్గం
పంజాబ్ పరిణామాల స్ఫూర్తితో రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గం మళ్లీ తన కార్యకలాపాలు ప్రారంభించింది. సచిన్ పైలట్ రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అజయ్ మాకెన్ లతో భేటీ అయ్యారు. మరోవైపు ఆయన వర్గ ఎమ్మెల్యేలు రాహుల్, ప్రియాంకల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. 2018 ఎన్నికల్లో సచిన్ పైలట్ కృషి వల్లే రాజస్థాన్ లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని ఆయన వర్గీయులు, కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
ఆ మేరకు అప్పట్లోనే పైలట్ సీఎం అవుతారని ఆశించారు. కానీ వయసు, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని అశోక్ గెహ్లాట్ ను అధిష్టానం సీఎం చేసింది. సచిన్ కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచే అసమ్మతి మొదలైంది. దాంతో పైలట్ పదవికి రాజీనామా చేశారు. గత ఏడాది పైలట్ వర్గానికి చెందిన 18 మందికి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ నోటీసులు ఇవ్వడం, వారిపై వేటు వేయాలని స్పీకరుకు సిఫార్సు చేయగా సచిన్ హైకోర్టును ఆశ్రయించారు.
Also Read : నాగాలాండ్ లో అంతా అధికార పక్షమే.. ప్రభుత్వంతో చేతులు కలిపిన ప్రతిపక్షం
దాంతో దివంగత అహ్మద్ పటేల్ ద్వారా రాజీ చర్చలు జరిపి అప్పటికి సర్దుబాటు చేసింది. కానీ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తామని అప్పుడే ఇచ్చిన హామీని ఇప్పటికీ అమలు చేయలేదని సచిన్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ మార్పుల నేపథ్యంలో సీఎం గెహ్లాట్ ను తప్పించి సచిన్ ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే గెహ్లాట్ 70 ఏళ్ల వయోభారం, అనారోగ్యంతో ఉన్నారని, కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమయ్యారని వారు గుర్తు చేస్తున్నారు.
భాగేల్ ను తప్పించాల్సిందే
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌లో కూడా సీఎం మార్పు డిమాండ్ ఊపందుకుంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెసులో సీఎం పదవి విషయంలో తీవ్ర పోటీ ఏర్పడింది. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న భూపేష్ భాగేల్, సీఎల్ఫీ నేతగా ఉన్న టి.ఎస్.సింగ్ దేవ్ ఈ పదవికి పోటీ పడ్డారు. కానీ అధిష్టానం భూపేష్ కు అవకాశం ఇచ్చింది. అప్పట్లోనే ఇద్దరు నేతలకు చెరో రెండున్నారేళ్లు సీఎం పదవి చేపట్టేలా రాహుల్ సమక్షం రాజీ సూత్రాన్ని ఆమోదించారని సింగ్ దేవ్ వర్గీయులు చెబుతున్నారు.
మొన్న జూన్ లో రెండున్నరేళ్లు పూర్తి కావడంతో భాగేల్ ను తప్పించి సింగ్ దేవ్ కు అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆయన వర్గీయులు ఢిల్లీకి సైతం వెళ్లి తమ డిమాండ్ వినిపించారు. ఆ వివాదం పెండింగులో ఉండగానే పంజాబ్ పరిణామాలు మారడం.. సింగ్ దేవ్ వర్గంలో కొత్త ఉత్సాహం నింపాయి. స్వయంగా సింగ్ దేవ్ సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. రాహుల్ తో భేటీకి ఎదురు చూస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత అవకాశం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని ఆయన్ను కోరనున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిపై “#Me Too” మచ్చ!