iDreamPost
iDreamPost
నిన్న న్యూ ఇయర్ సందర్భంగా నితిన్ రంగ్ దే టీమ్ కొత్త విడుదల తేదీని ప్రకటించింది. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అఫీషియల్ గా చెప్పేసింది. నిజానికి నెలల క్రితమే సంక్రాంతికి తమ సినిమా వస్తుందని చెప్పింది రంగ్ దేనే. ఆ తర్వాత మిగిలినవాళ్లు ఒక్కొక్కరుగా అనౌన్స్ మెంట్లు చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నితిన్ బృందం ఏకంగా రెండు నెలలకు పైగా రిలీజ్ ని వాయిదా వేసేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఇప్పటికే మంచి పబ్లిసిటీ కూడా వచ్చేసింది.
అయితే ఇలా చేయడం వెనుక చాలా తెలివైన ఎత్తుగడ కనిపిస్తోంది. థియేటర్లకు ఇంకా 50 శాతం అక్యుపెన్సీ అనుమతులు కొనసాగుతున్నాయి. ఇంకో నెల దాకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఫిబ్రవరిలో అప్పటి వైరస్ స్టేటస్ ని బట్టి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అలాంటప్పుడు ఇంత విపరీతమైన పోటీలో సంక్రాంతి బరిలో దిగితే లేనిపోని రిస్క్ తో పాటు కలెక్షన్లను పంచుకోవాల్సి వస్తుంది. అందుకే ఇంకొంత కాలం ఆగితే బెటరనే అభిప్రాయం అందరిలోనూ కలగడంతో పోస్ట్ పోన్ చేసేశారు. వచ్చే నెల కూడా ఎలా ఉంటుందో ఊహకందడం లేదు కాబట్టి ఇంత కన్నా వేరే ఆప్షన్ లేదు.
భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్ ఆశలన్నీ దీని మీద ఉన్నాయి. వరుణ్ తేజ్ తో దర్శకుడు వెంకీ అట్లూరి తొలిప్రేమను మెప్పించిన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులతో హిట్ అనిపించుకుంది. అఖిల్ మిస్టర్ మజ్నుని హ్యాండిల్ చేయడంలో తడబడినప్పటికీ రంగ్ దేతో దాన్ని రికవర్ చేస్తాడని అభిమానుల అంచనా. ఇప్పుడు రంగ్ దే దారిలో మరికొన్ని సినిమాలు కూడా వెళ్లే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కెజిఎఫ్ నిర్మాతలు తమ మరో సినిమా యువరత్న రిలీజ్ ను ఏప్రిల్ 1 లాక్ చేశారు. వంద శాతం సీట్లకు పర్మిషన్లు వస్తే తప్ప తమ పెట్టుబడులకు ఢోకా ఉండదనుకునే నిర్మాతలు మాత్రం లేట్ అయినా పర్లేదు అనే తరహాలో నిర్ణయాలు తీసుకుంటున్నారు