iDreamPost
iDreamPost
ఓవైపు జాతీయ మీడియాలో హోరెత్తుతోంది. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఏకంగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి మీదే తీవ్ర ఆరోపణలు రావడంతో కలకలం రేపుతోంది. అదే సమయంలో తెలుగు మీడియాలోని ఓ వర్గానికి ఇది గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టుగా తయారయ్యింది. చివరకు అధికారికంగా ప్రభుత్వ మీడియా సమావేశాన్ని కూడా కవర్ చేయకుండా మౌనం పాటిస్తోంది. రాజ్ దీప్ సర్దేశాయ్ నుంచి ప్రశాంత్ భూషణ్ వరకూ ఇది కీలక పరిణామంగా చెబుతున్నారు. ది వైర్ నుంచి బెంచ్ మార్క్ వరకూ కథనాలు ప్రచురించాయి. ది హిందూ నుంచి ఇండియన్ ఎక్స్ ప్రెస్ వరకూ కథనాలు ఇచ్చాయి. ఇండియా టుడే నుంచి న్యూస్ ఎక్స్ వరకూ ప్యానల్ డిస్కషన్స్ కూడా నడిపాయి. అయినా తెలుగు మీడియాలో బాబు బ్యాచ్ కి కనువిప్పు కలగడం లేదు.
జగన్ రాసిన ఒక్క లేఖ ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తోంది. న్యాయవ్యవస్థలో సంచలనంగా మారింది. రాజకీయాంగానూ హీటు రాజేస్తోంది. చివరకు ప్రభుత్వం తమకు ప్రకటనలు ఇవ్వడం లేదని నానా యాగీ చేసే మీడియాలోనే ప్రభుత్వ ప్రెస్ మీట్ కి సింగిల్ కాలమ్ చోటు కూడా దక్కలేదు. దాంతో ఏపీలో మీడియా వ్యవహారం బాహటంగా బయటపడింది. ఎవరి ప్రయోజనాల కోసం పచ్చ బ్యాచ్ పనిచేస్తుందన్నది ప్రస్ఫుటం అయ్యింది. చివరకు రెండు రోజులు పాటు తీవ్ర ప్రయత్నాలు చేసిన తర్వాత ఆంధ్రజ్యోతికి ఇది న్యాయవ్యవస్థ ను బెదిరించే యత్నంలా కనిపించింది. ఆ పత్రిక రాతల ప్రకారం చూసినా జగన్ లేఖ తప్పులేదు గానీ ప్రెస్ మీట్ పెట్టి పది మందికీ చెప్పడమే తప్పు అన్నట్టుగా ఉంది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కలిగిన ప్రభుత్వం తాను చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలి. అందులో తప్పొప్పులు అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ దానికి విరుద్ధంగా జగన్ సీజేకి రాసిన లేఖను బయటపెట్టడం తప్పు అంటూ ఆంధ్రజ్యోతి పెడర్థాలు తీసే ప్రయత్నానికి పూనుకుంది.
వైఎస్ జగన్ సుదీర్ఘకాలంగా మీడియాతో యుద్ధం చేస్తూనే ఉన్నారు. తన ప్రస్థానం ప్రారంభంలోనే ఈనాడు, ఆంధ్రజ్యోతిని ఆయన ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆ రెండు మీడియా సంస్థలకు తోడుగా టీవీ5 కూడా చేరింది. దాంతో వారిని ఢీకొట్టేందుకు జగన్ ఎన్నడూ వెనకాడలేదు. జగన్ మీద ఎంతగా బురదజల్లినా వెనక్కి తగ్గలేదు. అనేకమంది సీనియర్లను సైతం తమ కథనాలతో దారికి తెచ్చుకోగలిగిన ఆయా మీడియా సంస్థలకు జగన్ తీరు మింగుడుపడడం లేదు. అందుకు తగ్గట్టుగానే రానురాను జగన్ వ్యతిరేక రాతలు, కూతలు తీవ్రం చేస్తూనే వచ్చారు.
చివరకు తాజాగా ఏపీ ప్రజల తరుపున ప్రభుత్వం సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు వెల్లడించింది. అమరావతి అంశంలో జరిగిన భూభాగోతంతో పాటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న తీర్పుల వెనుక అసలు కుట్రదారులంటూ కొందరిపై ఆరోపణలు చేసింది. అందులో సుప్రీంకోర్ట్ జడ్జి ఎన్ వీ రమణ, టీడీపీ అదినేత చంద్రబాబు ఉండడంతో దేశమందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ది హిందూ, ఇండియన్ ఎక్స్ ప్రెస్, డీసీ వంటి ఇంగ్లీష్ పత్రికలతో పాటుగా ప్రజాశక్తి వంటి సిద్ధాంత పత్రికలు కూడా కవరేజ్ ఇచ్చాయి. వ్యవస్థలు గీత దాటుతున్న తీరుపై నిగ్గుతేల్చాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. కానీ సీఎం రాసిన లేఖ గానీ, ప్రభుత్వ సలహాదారు ప్రెస్ మీట్ గానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వారికి వార్తగా కనిపించలేదు. కనీసం చిన్న మాట కూడా దానికి సంబంధించి ప్రస్తావించడానికి సైతం ఆయా సంస్థలు సిద్ధం కాలేదు
తద్వారా తెలుగుమీడియాలో ప్రభుత్వ వాదనను వినిపించేందుకు ఓ వర్గం మీడియా సిద్ధంగా లేదనే విషయం బాహాటంగా బయటపడింది. ఇన్నాళ్లుగా తాము నిజాయితీపరులమంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన పచ్చమీడియా బ్యాచ్ అసలు రంగు అడ్డంగా బయటపడింది. దాంతో ప్రజలు ఇప్పుడు మీడియా స్వేఛ్ఛ అంటూ కొండంత రాగం తీసే ఆయా పత్రికల యజమానులపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంతకక్షపూరితంగా ప్రభుత్వ వ్యవహారాలను కూడా కథనంగా ఇవ్వడానికి నిరాకరిస్తున్న వారి తీరుని తూర్పారబడుతున్నారు.