iDreamPost
iDreamPost
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ వ్యవహార శైలిపై ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కూడా దారితీసింది. అయితే తాజాగా (ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ లా) న్యూస్ కథనం ప్రకారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, జగన్ రాసిన లేఖలోని అంశాలపై వివరణ ఇవ్వల్సిందిగా జస్టిస్ రమణను కోరినట్టు తెలుస్తుంది.
నాడు సీఎం జగన్ రాసిన లేఖలో సూటిగా జస్టిస్ ఎన్ వీ రమణ మీద తీవ్ర ఆరోపణలున్నాయి. దానికి ఆధారాలు కూడా సమర్పించారు. తొలుత జస్టిస్ ఎన్ వీ రమణ తన కుమార్తెలను డిపెండెంట్స్ గా చూపించి, ఆ తర్వాత ఎలా మార్చారనే అంశాన్ని జగన్ ప్రస్తావించారు. ఆ సమయంలోనే దమ్మాలపాటితో కలిసి ఏపీ రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసిన భూముల రికార్డులను సమర్పించారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడం రాజ్యాంగం ప్రకారం అవసరమని పేర్కొన్నారు. దానికోసం చేస్తున్న ప్రయత్నాలను ఏపీ హైకోర్టులో కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అందుకు కారణం జస్టిస్ రమణ ఒత్తిడితో రోస్టర్ విధానం ప్రభావితం కావడమేనని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సంక్షోభం సృష్టించే యత్నం సాగుతోందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. వాటికి అనుబంధంగా పలు ఆధారాలు, రికార్డులు, తీర్పు పత్రాలను సీఎం నేరుగా సీజేకి అందించారు.
అయితే ఈ వ్యవహారంపై సీఎం జగన్ కోరిన విధంగా విచారణ ప్రారంభించడానికి ముందు, సిజెఐ బాబ్డే తన సహచరులలో కొంతమందితో సుప్రీంకోర్టులో చర్చించి వారు ఇచ్చిన నివేదిక ప్రకారం జస్టిస్ రమణ పై వచ్చిన ఆరోపణలలో లోతైన పరీక్ష జరగాలన్న నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. జస్టిస్ రమణతోపాటు నిన్నటివరకు ఆంద్రప్రదేశ్ హై కోర్టుకు చీఫ్ జస్టిస్ గా వ్యవహరించి సిక్కిం కు ట్రాన్స్ఫర్ అయిన జే కే మహేశ్వరిని కూడా వివరణ కోరినట్టు తెలుస్తుంది, అలాగే వీరితో పాటు ఏపీ సీఏం జగన్ ను కూడా లేఖ ద్వారా కాకుండా అఫిడవిట్ రూపంలో ఫిర్యాదు సమర్పించాలని కోరినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంపై సీఎం జగన్ సీజేఐ కు రాసిన లేఖపై ఈ విధమైన స్పందన రావడం
చూస్తే ఇక పై జస్టిస్ రమణ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.