iDreamPost
android-app
ios-app

దేశంలో సినిమా హాల్స్ ఒకే రోజు పున:ప్రారంభం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Published May 23, 2020 | 10:54 AM Updated Updated May 23, 2020 | 10:54 AM
దేశంలో సినిమా హాల్స్ ఒకే రోజు పున:ప్రారంభం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల రెండు నెలలుగా ఆగిపోయిన సినిమా కార్యక్రమాలు త్వరలోనే తిగిగి ప్రారంభంకానున్నాయి. ఈమేరకు గత రెండు రోజులుగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. తొలిత తెలంగాణ సినిమా టోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ ప్రముఖులతో చర్చించారు. ఆ తరువాత రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చర్చించారు. కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా శనివారం టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కోవిడ్-19 వల్ల సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సినిమా రంగ ప్రముఖులతో ఈ సందర్భంగా చర్చించారు.

నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, డైరెక్టర్ తేజ , జెమిని కిరణ్, త్రిపురనేని వరప్రసాద్, దాము కానూరి, వివేక్ కూచిభొట్ల ,అనిల్ శుక్ల, అభిషేక్ అగర్వాల్, శరత్, ప్రశాంత్, రవి పలువురు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సినిమా ప్రముఖులు కేంద్ర మంత్రి దృష్టికి వివిధ అంశాలను తీసుకెళ్లారు. షూటింగులకు అనుమతి, థియేటర్ల పున:ప్రారంభం, క్యాప్టివ్ పవర్, పైరసీ, ఓటిటిలో సినిమా రిలీజ్, రీజనల్ జిఎస్టీ, టిడిఎస్, సినిమా కార్మికుల ప్రత్యేక ప్యాకేజీ పలు అంశాలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సినిమా ప్రముఖుల విజ్ఞాపనలపై స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి…షూటింగ్ కోసం త్వరలోనే అనుమతి లభిస్తుందని, దేశవ్యాప్తంగా థియేటర్లు ఒకే రోజు ఓపెనింగ్ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అలానే సినిమా పైరసీ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రాంతీయ భాషా సినిమాలు పెంపొందేలా నిర్మాణం జరిగేలా రీజినల్ జీఎస్టీ మీద కూడా ఆలోచన చేస్తామని‌ చెప్పారు. సినిమా పరిశ్రమ వరకు క్యాప్టివ్ పవర్ కోసం విద్యుత్ శాఖ మంత్రితో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ సహా దేశంలో ఎక్కడైనా సినిమా షూటింగ్ లు, స్టూడియోల నిర్మాణం కోసం తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సహాయం చేస్తానని కిషన్ రెడ్డి అన్నారు. త్వరలోనే తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమ ప్రతినిధులు వస్తే ప్రత్యేక మీటింగ్ పెట్టి సినిమా సమస్యలపై చర్చిద్దామని మంత్రి తెలిపారు.