వరుస ఓటములతో చిత్తయిన పార్టీని అధినేతలు పట్టించుకోక పోవడంపై చిత్తూరు జిల్లా టీడీపీ తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు గానీ, లోకేష్ గానీ.. చివరికి పార్టీ జిల్లా నేతలు కూడా నిరాశ నిస్పృహల్లో ఉన్న పార్టీలో పాత ఉత్సాహం పాదు గోల్పేందుకు ప్రయత్నించక పోవడాన్ని సోషల్ మీడియా ద్వారా ఎండగడుతున్నారు. అయినా నేతలు స్పందించకపోవడంతో చివరికి విసిగిపోయి మీరు పట్టించుకోకపోతే మాదారి మేం చూసుకోవాల్సి ఉంటుందని వార్నింగులు కూడా ఇస్తున్నారు.
వరుసగా ఘోర పరాజయాలు
చిత్తూరు జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచీ ఎన్నడూ లేనివిధంగా గత రెండున్నరేళ్లుగా ఆ పార్టీకి అతి దారుణ పరాభవాలు ఎదురవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొదలైన ఈ పరాజయ యాత్ర నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో సంపూర్ణం అయ్యింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఒక్క చంద్రబాబు తప్ప.. మిగతా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పాగా వేసింది. ఈ ఏడాది వరుసగా జరిగిన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 90 శాతం పైగా అధికార పార్టీ ఖాతాలో చేరడంతో టీడీపీ కుదేలు అయ్యింది. స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోనూ అధికార పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఫలితాలు చంద్రబాబుకు మింగుడుపడలేదు. జిల్లా టీడీపీ శ్రేణులు కూడా ఫలితాలను జీర్ణించుకోలేక పోతున్నారు. నాయకులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు.
పట్టించుకోని చంద్రబాబు, లోకేష్
సొంత జిల్లాలో పార్టీ పరాజయ భారంతో కుంగిపోయినా అధినేత చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీని చక్కదిద్దేందుకు ప్రయత్నించకపోవడం కార్యకర్తలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండుసార్లు, పంచాయతీ ఎన్నికల తర్వాత ఒకసారి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు. కార్యకర్తలు చెప్పిన సమస్యలు, లోపాలను విన్నారు. ఆ పర్యటనలోనే జూనియర్ ఎన్టీఆర్ కు బాధ్యతలు అప్పగించాలని ప్లకార్డులతో పలువురు డిమాండ్ చేయడంతో.. అసహనంతో పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ రాలేదు సరికదా.. కార్యకర్తలు చెప్పిన సమస్యల పరిష్కారానికీ ప్రయత్నించిన దాఖలాల్లేవు. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ అసలు జిల్లావైపే చూడటం లేదు.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆ తర్వాత మళ్లీ రాలేదు. ఇక జిల్లాలో చూస్తే చాలామంది నేతలు పార్టీలు మారిపోగా.. ఉన్నవారు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి లాంటివారు కూడా కొంతకాలంగా క్రియాశీలంగా లేరు. ఈ పరిస్థితులు టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పార్టీని పట్టించుకోమని, లోపాలు సరిదిద్దమని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోని నాయకత్వ తీరుతో విసిగిపోయిన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. నాయకుల నిష్క్రియపరత్వాన్ని ఎండగడుతున్నారు. ఇప్పటికైనా పార్టీని పట్టించుకోకపోతే తమ దారి తాము చేసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నారు.