మాములుగా ఏదైనా భాషలో హిట్ మూవీ నచ్చితే అది మనకూ సూట్ అవుతుందని భావిస్తే స్టార్ హీరోలు వాటిని రీమేక్ చేసుకోవడం ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ కంటిన్యూగా వాటినే చేసిన దాఖలాలు తక్కువ. అయితే మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరసగా రీమేకులనే ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇప్పుడీ టాపిక్ ప్రస్తావనకు తేవడానికి కారణం ఉంది. ఇప్పుడు కమిట్ అయినవి కాకుండా చిరు 2015లో వచ్చిన మరో అజిత్ సినిమా ఎన్నై అరిందాల్ ను కూడా రీమేక్ చేయడానికి ఆసక్తి చూపడమే కాదు బ్యాక్ గ్రౌండ్ లో దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టమని తన టీమ్ కి చెప్పారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
ఆచార్య స్ట్రెయిట్ సబ్జెక్టు కాబట్టి దాన్ని మినహాయిస్తే తర్వాత లైన్ లో ఉన్న లూసిఫర్ మలయాళం నుంచి, వేదాళం తమిళ్ నుంచి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒకటి ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. మరొకటి వేసవిలోగా స్టార్ట్ చేసేస్తారు. ఇవి కాకుండా ఇప్పుడు ఎన్నై అరిందాల్ కూడా వరస క్రమంలో నిలబడింది. ఇది కూడా ఆ టైంలోనే ఎంతవాడు గాని పేరుతో తెలుగులో డబ్ చేస్తే బాగానే ఆడింది. మరి చిరు దీని మీద ఎందుకు మనసు పడుతున్నారనేది అంతు చిక్కని విషయం. ఇది కలుపుకుంటే నాలుగు చిరంజీవి సినిమాల్లో మూడు రీమేకులే అవుతాయి. కం బ్యాక్ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 కూడా రీమేక్ అన్న సంగతి మరువకూడదు
ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న వకీల్ సాబ్, చేయబోతున్న బిల్లా రంగా(ప్రచారంలో ఉన్న టైటిల్) రెండూ రీమేక్సే. ముందు ఇవి విడుదలయ్యాకే క్రిష్ సినిమా ఉంటుంది. ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలవి స్ట్రెయిట్ కథలే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా ఎంత కథల కొరత ఉన్నా మరీ ఇలా ఇన్నేసి సినిమాలు పక్కభాషల నుంచి అరువు తెచ్చుకోవాలా అనే కామెంట్స్ లేకపోలేదు. రిస్క్ కు భయపడి ఇక్కడి రచయితలను నమ్మకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. చిరు, పవన్ లు గతంలో చాలా రీమేకులు చేసినప్పటికీ ఇలా కంటిన్యూ గా చేయడం మాత్రం ఇదే ఫస్ట్