ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి కలవబోతున్నారు. నేరుగా గన్నవరం విమానాశ్రయానికి వెళ్ళనున్న మెగాస్టార్ చిరంజీవి అక్కడి నుంచి తాడేపల్లిలో వైఎస్ జగన్ అధికారిక నివాసానికి వెళ్లి భేటీ కాబోతున్నారు. ఇది ఒక లంచ్ మీటింగ్ అని తెలుస్తోంది.. ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను సవరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద సినీ పరిశ్రమ నుంచి చాలా విజ్ఞప్తులు వస్తున్న సంగతి తెలిసిందే.. ముందు నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద సానుకూలంగా స్పందించాలని పలుసార్లు బహిరంగవేదిక మీద చిరంజీవి కోరారు. అలాగే టికెట్ రేట్ల వ్యవహారం గురించి పలువురు సినీ పరిశ్రమకు చెందినవారు కూడా జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీడియా ముఖంగా విజ్ఞప్తులు చేస్తున్నారు.
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో అమరావతి సెక్రటేరియట్ లో భేటీ అయి తన సలహాలు సూచనలు కూడా అందించారు. ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి ముఖ్యమంత్రిని కలవనుండటం ఆసక్తికరంగా మారింది. నిజానికి కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి తాను సినీ ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరించలేను అని కామెంట్ చేశారు. అయితే సినిమా పరిశ్రమకు అవసరమైనప్పుడు మాత్రం తన భుజం అందిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్ల వ్యవహారంతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న మరిన్ని సమస్యలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తీసుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీలో సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం మీద సానుకూలంగా స్పందించవలసిందిగా చిరంజీవి కోరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సినిమా టికెట్ రేేట్ల వ్యవహారం మీద ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికీ పలు దఫాలు భేటీలు కూడా నిర్వహించింది. త్వరలోనే ఈ టికెట్ రేట్ల అంశం మీద వైఎస్ జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తాజా భేటీ నేపథ్యంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి ఈ మొత్తం అంశం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.