iDreamPost
iDreamPost
హీరోల క్యారెక్టరైజేషన్ ఆధారంగా సినిమా టైటిల్ నిర్ణయించడం సర్వసాధారణం. అందులోనూ స్టార్ హీరోలకు ఇలాంటి పేర్లు పెడితేనే ఓ అభిమానులకు కిక్కు. క్రేజ్, బిజినెస్ పరంగానూ ఇది చాలా సహాయపడుతుంది. కానీ టైటిల్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా సబ్జెక్టు వీక్ గా ఉంటే ఫలితం తేడాగా వచ్చేస్తుంది. 1985లో విడుదలైన ‘పులి’ అందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 1983లో ‘ఖైదీ’ తన స్టార్ డంని ఒకేసారి వంద మెట్లు ఎక్కించేసిన చిరంజీవికి ఆపై ప్రతి చిత్రానికి అంచనాలను మ్యాచ్ చేయడం పెద్ద సవాల్ గా మారింది. అది ఎంతగా ప్రభావం చూపించిందంటే బాపు తీసిన క్లీన్ ఎంటర్ టైనర్ ‘మంత్రి గారి వియ్యంకుడు’ యావరేజ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది. ఆ తరువాత సంఘర్షణ, గుండాలు మంచి ఫలితాలు అందుకోగా హీరో, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు నిరాశపరిచాయి.
1984లో ‘ఛాలెంజ్’ సక్సెస్ చిరుకి కొత్త ఎనర్జీని ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టింది. నాగ్, అగ్నిగుండం, చిరంజీవి మళ్లీ దెబ్బేయగా ‘దొంగ’ హిట్టు కొట్టి ‘జ్వాల’ పర్వాలేదు అనిపించుకుంది. అప్పుడు వచ్చిందే పులి. రాజ్ భరత్ దర్శకత్వంలో ఆనం గోపాల్ రెడ్డి నిర్మాతగా భారీ బడ్జెట్ తో రూపొందింది. రాజ్ భరత్ అప్పటికే చిరంజీవితో ‘యమకింకరుడు’ చేశారు. అప్పట్లోనే అల్ట్రా స్టైలిష్ ఎంటర్ టైనర్ గా దీనికి మంచి పేరు వచ్చింది. అందుకే మరోసారి అతనికి ఛాన్స్ ఇచ్చాడు మెగాస్టార్. స్పెషల్ బ్రాంచ్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ క్రాంతి చెల్లెకి విలన్ల వల్ల కళ్ళు పోతాయి. అంతేకాదు ఆమెకు కాబోయే భర్త హత్యకు గురవుతాడు. దీని వెనుక మాఫియా లీడర్ జెకె ఉన్నాడని గుర్తించిన క్రాంతి వాళ్ళ భరతం పట్టేందుకు రెడీ అవుతాడు. కానీ తనే సజీవంగా సమాధి అయ్యే ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటాడు. చివరికి తన ప్రతీకారాన్ని తీర్చుకోవడమే పులి ఫైనల్ క్లైమాక్స్.
పులి టైటిల్ అందులోనూ క్రేజీ కాంబినేషన్ కావడంతో దీని మీద విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఎంత హాలీవుడ్ స్టైల్ లో తీసినా మాస్ ఆడియన్స్ కోరుకున్న ఎమోషన్ ని రిజిస్టర్ చేయడంలో రాజ్ భరత్ తడబడ్డాడు. దీంతో ఫ్లాప్ తప్పలేదు. రావు గోపాల్ రావు ఫ్రెంచ్ గెడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తాడు. పులిలో చిరంజీవి ఇంట్రో సీన్ మాత్రం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్కిచ్చింది. అయితే డ్రామా పాళ్ళు సరిగా కుదరకపోవడంతో పులికి పరాజయం తప్పలేదు. రాజేంద్రప్రసాద్ ఇందులో చిన్న క్యామియో చేశారు. నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర తారాగణం. రాధ హీరోయిన్ గా నటించింది. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. సత్యానంద్ రచన చేశారు. కాకతాళీయంగా చాలా ఏళ్ళ తర్వాత ఇదే టైటిల్ తో వచ్చిన పవన్ కళ్యాణ్ పులి కూడా ఇదే రిజల్ట్ అందుకుంది. మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఈ టైటిల్ అచ్చిరాకపోవడం విచిత్రం. అయితే స్వర్గీయ ఎన్టీఆర్ కు బొబ్బిలిపులి రూపంలో ఆల్ టైం హిట్ దక్కడం గమనార్హం.