iDreamPost
iDreamPost
ఒకే కుటుంబంలో ఉన్న వారికి వివిద రాజకీయ అభిప్రాయాలు ఉండకూదనే రూలేమీ లేదు. కానీ ఒకే గూటిని వచ్చిన వారు ప్రతీ అంశం మీద భిన్నంగా స్పందిస్తుండడం ఆసక్తికరమే. అందులోనూ అన్నయ్య ఆసరాతో అటు సినీ, ఇటు రాజకీయ ఆరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ వంటి వారికి పక్కలో బల్లెంలానే ఉంటుంది. దాదాపుగా ఇద్దరికీ ఉన్న ఫాలోవర్స్ ఒక్కరే. కానీ చెరో దారిలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండడం, ఆయా అభిమానులకు తలనొప్పిగా మారుతోంది. ప్రజాభిప్రాయానికి దగ్గరగా ఉంటున్న చిరంజీవికి వారంతా చేరువయ్యేందుకు దోహదపడుతోంది. అది పవన్ కళ్యాణ్ కి పెద్ద చిక్కునే తెచ్చిపెడుతుంది.
ప్రస్తుతం చిరంజీవి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ పొలిటిక్స్ వైపు వెళ్లే ఆలోచన లేదని చెబుతున్నారు. కానీ పవన్ మాత్రం నేరుగా రాజకీయాల్లో ఉన్నారు. సొంత పార్టీని నడుపుతున్నారు. కానీ రాజకీయ స్థిరత్వం లేకుండా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. విశాఖలోనే డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ప్రైవేటీకరణ చేస్తుంటే తానే పోరాడి ఆపేశానని జనసేనానిని చెప్పుకున్నారు. కానీ తీరా విశాఖ మహానగరానికి ఊపిరిపోసిన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరిస్తుంటే అది మాత్రం దేశం కోసమే చేశారంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అంటే డ్రెడ్జింగ్ కార్పోరేషన్ అమ్మకూడదు..కానీ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనే రెండు మాటలు పవన్ నుంచే రావడం గమనార్హం.
అదే సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలకు దిక్సూచిగా చిరంజీవి వర్ణించిన తీరు ఆసక్తికరం. పవన్ కి పూర్తి విరుద్ధంగా చిరంజీవి స్పందించారు. విశాఖ ఉక్కు పరిరరక్షణ ప్రయత్నాలకు ఆయన తోడ్పాటు ఉంటుందనే సంకేతాలు ఇచ్చేశారు. బీజేపీతో జతగట్టి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తలేని స్థితిలో పవన్ ఉంటే చిరంజీవి మాత్రం నికరంగా ప్రజాభిప్రాయాన్ని ప్రస్ఫుటించేలా స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. చివరకు పవన్ అభిమానుల్లో కూడా అన్నయ్య తీరు పట్ల ఆదరణ పెరిగేందుకు దోహదపడుతుంది. పవన్ మీద సందేహాలు పెంచుతోంది. ప్రజా నేతగా ఎదగడానికి అదో అడ్డంకి అవుతుంది.
గతంలో మూడు రాజధానుల అంశంలో కూడా చిరంజీవి అదే రీతిలో స్పందించారు. జగన్ నిర్ణయాన్ని వెనువెంటనే స్వాగతించారు. రాష్ట్రాభివృద్ధికి పాలనా వికేంద్రీకరణ దోహదం చేస్తుందని వర్ణించారు. పవన్ మాత్రం అందుకు విరుద్ధంగా అమరావతిని కాపాడాలంటూ హంగామా చేశారు . టీడీపీ అధినేత చెప్పిన మాటను వల్లించే యత్నం చేశారు. తద్వారా రాష్ట్రమంతా పవన్ అభిమానులు చిరంజీవి అభిప్రాయాన్ని స్వాగతించగా, పవన్ తీరుని సమర్థించలేక సతమతం అయ్యారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా జనసేన క్యాడర్ కి చిరంజీవి ప్రకటన పెద్ద శిరోభారం అవుతోంది. కార్యకర్తలకు సర్థిచెప్పలేని స్థితి ఏర్పడుతోంది. నష్టాలను సాకుగా చూపించి ప్రైవేటీరణ తగదని చిరంజీవి స్పష్టంగా చెబుతున్న తరుణంలో నీళ్లు నములుతున్న పవన్ వైఖరి కారణంగా ప్రజల్లో మరింత పలుచనయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే జనసేన విధానాల మీద సందేహాలతో ఉన్న జనాలకు తాజా వైఖరి మరింత అనుమానాలు పెంచేందుకు దారితీస్తుందని చెప్పవచ్చు. ఏపీలో బలపడాలనే ఆశతో ఉన్న పవన్ కి ప్రజలు మరింత దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.