iDreamPost
iDreamPost
అప్పుడెప్పుడో ఏళ్ళ క్రితం షూటింగ్ మొదలుపెట్టి కొంతభాగం తీసి ఆపేసిన నర్తనశాల 17 నిమిషాల ఫుటేజీని ఎల్లుండి బాలకృష్ణ ప్రత్యేకంగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. దీని మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. మన మధ్య లేని సౌందర్య, శ్రీహరిలను కొత్త పాత్రల్లో చూడబోతుండటమే కారణం. దానికి తోడు బాలయ్య కూడా అర్జునుడిగా చాలా బాగా కనిపిస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరీ ఓవర్ గా ఊహించుకోకుంటే డీసెంట్ గానే నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదేదో బాగానే ఉంది కానీ తాజాగా ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా ఇలాంటి డిమాండ్ లు మొదలయ్యాయి. ముఖ్యంగా చిరంజీవి, కమల్ హాసన్ ఫ్యాన్స్ తమకూ ఇలాంటి కానుకలు ఇవ్వాలని కోరుకుంటున్నారు.
గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ సంగీతంలో అబు బాగ్దాద్ గజదొంగ సినిమాను అట్టహాసంగా మొదలుపెట్టి కొంత షూట్ అయ్యాక ఆపేశారు. ఎంత తీశారో అందులో ఏం ఎపిసోడ్స్ ఉన్నాయో ఎన్నడూ చెప్పలేదు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొస్తే బాగానే ఉంటుంది. అలాగే రౌడీ అల్లుడు రిలీజ్ టైంలో విడుదల చేయని మరొక పాట ఉంది. అదీ వెలుగు చూడలేదు. జగదేకేవీరుడు అతిలోకసుందరి కన్నా ముందు చిరంజీవి, శ్రీదేవి జంటగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వజ్రాల దొంగ మొదలుపెట్టి ఇలాగే ఆపేశారు. దానికి కూడా కొన్ని సీన్లు, ఓ పాట చిత్రీకరణ జరిపారు. ఇవన్నీ నెగటివ్ రూపంలో అందుబాటులో ఉన్నాయో లేదో తెలియదు కానీ బయటికి తీసుకొస్తే మాత్రం అభిమానులకు మంచి పండగే.
ఇక కమల్ హాసన్ సంగతికొస్తే వందల కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసుకుని ఎలిజిబెత్ రాణిని తీసుకొచ్చి మరీ ఓపెనింగ్ చేయించిన మరుదనాయగం కూడా అచ్చం ఇదే తరహాలో పూర్తయినంత వరకు ల్యాబులోనే ఉంది. ఇది జరిగి ఇరవై ఏళ్ళు అవుతోంది. ఇకపై కొనసాగుతుందన్న నమ్మకమూ లేదు. కొందరు ఆర్టిస్టులు కాలం కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఇలా స్పెషల్ డిజిటల్ రిలీజ్ కు నోచుకుంటే బాగుంటుంది. ఎప్పటికైనా దీన్ని తీసే తీరుతానని కమల్ చాలాసార్లు చెప్పారు కానీ కార్యరూపం దాల్చే సూచనలు కనుచూపు మేరలో లేవు. అందుకే ఇది కూడా ఏదైనా ఓటిటికి ఇస్తే బెటరనే వాళ్ళు ఎక్కువయ్యారు. ఇందులో ఓ పాటను ఇళయరాజా ఇదివరకే యుట్యూబ్లో ఆడియో రూపంలో విడుదల చేశారు. మరి చిరు, కమల్ అభిమానులు కోరికను ఆ హీరోలు మన్నించగలరా