iDreamPost
android-app
ios-app

చైనా బ్యాడ్మింటన్ లెజెండ్ లిన్ డాన్ సంచలన ప్రకటన

చైనా బ్యాడ్మింటన్ లెజెండ్ లిన్ డాన్ సంచలన ప్రకటన

చైనా బ్యాడ్మింటన్ దిగ్గజం,రెండు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లిన్ డాన్ సంచలన ప్రకటన చేశారు.కరోనా ఎఫెక్ట్ తో 37 ఏళ్ల చైనా స్టార్ షట్లర్ లిన్ డాన్ శనివారం తన కెరీర్‌కు సంబంధించి సోషల్ మీడియా ద్వారా సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు.

ఇక విషయానికొస్తే టోక్యో ఒలింపిక్స్ ఆడి మూడవ ఒలింపిక్స్ స్వర్ణం సాధిస్తానని గతంలో ప్రకటించిన లిన్ డాన్ అకస్మాత్తుగా రిటైర్డ్ అవుతున్నట్లు ప్రకటించాడు.తన శరీరం గతంలో వలె ఆటకు సహకరించటం లేదని తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనాలని తాను నిర్ణయించుకున్నానని,కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలన్ని వాయిదా పడటం తన కలని అసంభవం చేసిందని లిన్ డాన్ బాధపడ్డాడు.

లిన్ డాన్ తన రిటైర్‌మెంట్ గురించి ట్విట్టర్‌లో ప్రకటిస్తూ “నేను ఇష్టపడే క్రీడా కోసం ప్రతిదీ త్యాగం చేశాను.నా సంతోషాలు మరియు కష్టాలలో కుటుంబం,కోచ్‌లు,జట్టు సభ్యులు, అభిమానులు నాకు అండగా నిలిచారు.వారికి నా ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు.

కాగా తన శారీరక ఫిట్‌నెస్ మరో ఏడాది వరకు కాపాడుకోవడం కష్టమని భావించిన లిన్ డాన్ శనివారం రిటైర్డ్ అయ్యారని తెలుస్తోంది.ఆయన రిటైర్మెంట్ ప్రకటనతో వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో లెజెండ్ షట్లర్ ఆటను చూసే అవకాశం లేకుండా పోయింది.

2008 బీజింగ్,2012 లండన్ ఒలింపిక్స్ క్రీడలలో బంగారు పతకాలు లిన్ డాన్ సాధించారు. పలు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలలో తన అద్భుత ఆటతో చైనాకు ఎన్నో పతకాలను ఆయన అందించారు.లెజెండ్ షట్లర్ డాన్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలో ప్రధానమైన తొమ్మిది టైటిళ్లను గెలుచుకున్నారు.ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ లిన్ డాన్ కావడం విశేషం.ఇప్పటి వరకు ఆయన రికార్డు స్థాయిలో 666 సింగల్స్‌ మ్యాచ్‌లలో విజయం సాధించి,కేవలం 128 మ్యాచ్‌లలో ఓడిపోయారు.వర్డల్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఐదుసార్లు టైటిల్‌ విజేతగా నిలవడం ఒక లిన్ డాన్‌కి మాత్రమే సాధ్యమయింది.చాలా కాలం ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచిన ఆయనకు ‘సూపర్ డాన్’ అనే బిరుదు ఉంది.

ఇక తన ప్రత్యర్థి అయిన మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్డ్ అయిన ఏడాది తర్వాత లిన్ డాన్ బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు పలికాడు.దశాబ్దానికి పైగా లీ చోంగ్ వీ,లిన్ డాన్‌లు బ్యాడ్మింటన్ క్రీడలో అగ్రశ్రేణి ప్లేయర్లుగా వెలుగొందారు.