iDreamPost
iDreamPost
రాజకీయాలు చేసేటోళ్లు దండిగా ఉంటారు. కానీ రాజకీయాలకు వన్నె తెచ్చోటోళ్లు కొందరే ఉంటారు. సిద్ధాంతాలకు కట్టుబడి బతికేటోళ్లు.. మార్పు కోసం పరితపించేటోళ్లు అతి తక్కువ మంది ఉంటారు.. అలాంటి నాయకుల్లో అగ్రగణ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి. ఏపీలో ఉనికే లేని పార్టీ కోసం పని చేసినా.. కక్షలు, పగలతో కొట్టుమిట్టాడుతున్న రాయలసీమలో శాంతి కోసం ప్రయత్నించినా.. కరువు సీమలో నీటి చెమ్మ కోసం నడక సాగించినా.. అది ఆయనకే చెల్లింది. రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఉన్నంతంగా బతికి.. 85 ఏళ్ల వయసులో స్వర్గానికి వెళ్లిపోయారాయన. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సర్పంచ్ నుంచి మొదలై..
చిలకం రామచంద్రా రెడ్డి సొంతూరు చిత్తూరు జిల్లా విజయపురం మండలం మంగళం గ్రామం. కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన.. 1959లో మంగళం సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తర్వాత పుత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో స్వయం సేవకుల పనితీరుకు ఆకర్షితులై జనసంఘ్ లో చేరారు. నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా 1978లో పోటీ చేసి ఓడిపోయారు. జనతా పార్టీలో చీలక తర్వాత బీజేపీలో చేరారు. 1981లో పిచ్చాటూరు సమితి అధ్యక్షుడిగా గెలిచారు.
1984లో చిత్తూరు జిల్లాకు తొలి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లాలో బీజేపీకి పునాదులు వేశారు. 1988లో రాష్ట్ర ఉపాధ్యక్షుడయ్యారు. 1998-99లో ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులై రెండు పర్యాయాలు కొనసాగారు. చిలకం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 6 లక్షలుగా వున్న పార్టీ సభ్యత్వాన్ని 17.5 లక్షలకు చేర్చి రికార్డు సృష్టించారు. జాతీయ స్థాయిలో పార్టీలో పలు పదవుల్లో కొనసాగారు. తర్వాత వయోభారంతో క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. చెన్నైలో ఉంటున్నారు.
శాంతి కోసం, నీటి కోసం.. పాదయాత్ర
ఓ వైపు కరువు.. మరోవైపు కక్షలతో రాయలసీమ అల్లాడుతున్న సమయం అది. అలాంటి పరిస్థితుల్లోనే గొంతెండిన సీమకు సాగునీరు, తాగునీటి కోసం పాదయాత్రకు చిలకం రామచంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. రాయలసీమలో శాంతి నెలకొల్పడం కోసం, ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు నడుంబిగించారు. 1994లో రాయలసీమలో ‘నీటి కోసం.. శాంతి కోసం’ అనే నినాదంతో వెయ్యి కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం.. సీమలో ప్రాజెక్టుల అత్యవసరాన్ని ఎత్తి చూపింది. ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. అలా కరవు పీడిత ప్రాంతాల్లో బక్కచిక్కిన రైతుల జీవితాల్లో రామచంద్రారెడ్డి ఆశలు రేపారు.
ఈ పాదయాత్రలోనే.. రాయలసీమలో తుపాకుల లైసెన్సులు రద్దు చేయాలని నాటి ప్రభుత్వాన్ని చిలకం రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో తన సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురైనా పట్టించుకోలేదు. సొంత సామాజిక వర్గం కంటే సామాన్యులే ముఖ్యమని ఉద్యమం కొనసాగించారాయన. ఫ్యాక్షన్ అంతానికి తన శక్తిమేర కృషి చేశారు. సాగు నీటి వసతి కల్పిస్తే సీమలో ఫ్యాక్షనిజం అంతరిస్తుందని అప్పుడే నమ్మారు. నాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
ఆయన నడక సీమకే పరిమితం కాలేదు. 2002లో తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు గోదావరి జలాలు మళ్ళించాలనే డిమాండ్‌తో సస్యశ్యామల యాత్ర చేపట్టారు. 2006లో రాయలసీమ రథయాత్రలో పాల్గొన్నారు. 2008లో సాగునీరు-తాగునీరు కోసం ప్రాజెక్టుల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో పాదయాత్ర సాగించారు. ఇలా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అందరితో పెద్దమనిషి అనిపించుకున్న మంచి మనిషి రామచంద్రారెడ్డి.