iDreamPost
iDreamPost
భర్త ప్రాణాల కోసం సాక్షాత్తు యమధర్మరాజు వెంటపడి.. యమలోకం వరకు వెళ్లి విడిపించుకొచ్చిన సతీ సావిత్రి కథ మనలో చాలామందికి తెలిసిందే. అది నిజమో కాదో గానీ.. ఛత్తీస్గఢ్ లో ఒక మహిళ అంతటి సాహసమే చేసింది. మావోయిస్టుల చెరలో ఉన్న తన భర్తను విడిపించుకునేందుకు అడవి బాట పట్టింది. కొందరు జర్నలిస్టులు, సామాజికవేత్తల సహకారంతో అనుకున్నది సాధించింది. ఆమె తపన, ఆరాటం చూసి కదిలిపోయిన మావోయిస్టులు వారం తర్వాత ఆమె భర్త అజయ్ ని విడిచిపెట్టారు.
రెండేళ్ల బిడ్డను చంకనెత్తుకొని..
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అజయ్ రోషన్ లక్రా చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్వై) విభాగంలో సబ్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఈ నెల 11న అటెండర్ లక్ష్మణ్ పర్తిగిరితో కలిసి మానాకెల్-ఘడ్ గోర్ణ రోడ్డు నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో మావోయిస్టులు కన్హయగూడ వద్ద వారిద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. మరుసటి రోజు అటెండర్ లక్ష్మణ్ ను విడిచిపెట్టి.. అజయ్ ని మాత్రం తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ విషయం తెలిసి ఇంజినీర్ భార్య ఆర్పిత తీవ్ర ఆందోళనకు గురైంది. ఒకవైపు ప్రభుత్వం అతన్ని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నా.. తన వంతు ప్రయత్నం మొదలు పెట్టింది. రెండేళ్ల కుమారుడిని ఎత్తుకుని అడవుల్లోకి వెళ్లింది. కొందరు జర్నలిస్టుల సహకారంతో అటవీ గ్రామాల్లో అన్వేషణ సాగించింది. భర్త కోసం ఆమె పడుతున్న ఆరాటం, అన్వేషణ మావోయిస్టుల దృష్టికి వెళ్లింది. అదే సమయంలో జర్నలిస్టులు, పలువురు సామాజికవేత్తలు ఆమెకు మద్దతుగా ఇంజినీరును విడిచిపెట్టమని మావోలకు విజ్ఞప్తి చేశారు. దాంతో కరిగిపోయిన మావోయిస్టులు అర్పితను తమ వద్దకు రప్పించుకున్నారు. గుర్తు తెలియని అటవీ ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించిన అనంతరం అజయ్ ని విడుదల చేశారు. స్థానిక గ్రామస్తుల సహకారంతో వారు బీజాపూర్ చేరుకున్నారు.
కాంట్రాక్టర్ అనుకొని..
మావోయిస్టుల చెర నుంచి విడుదలైన అజయ్ లక్రా మాట్లాడుతూ వారు తనను రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టరుగా భావించారని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలను మావోయిస్టులు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. ఆ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ అన్న భావంతోనే లక్రాను కిడ్నాప్ చేశారు. తాను ప్రభుత్వ ఉద్యోగినని ఎంత చెప్పినా మొదట వారు నమ్మలేదని.. కొందరు జర్నలిస్టుల నుంచి ఆధారాలు తెప్పించుకుని పరిశీలించిన తర్వాతే నమ్మారని లక్రా చెప్పారు. వారి వద్ద ఉన్న వారం రోజులు తనను గౌరవంగానే చూశారని.. అయితే ఒకచోట ఉంచకుండా.. అనేక ప్రాంతాలకు తిప్పారని ఆయన వెల్లడించారు. భర్త విడుదల కోసం వారం పాటు పరితపించిన ఆర్పిత మాట్లాడుతూ తన భర్త క్షేమంగా తిరిగి వస్తారన్న ఆశ ఉన్నా.. రోజులు గడుస్తున్నా కొద్దీ భయం పెరిగిందని అన్నారు. భర్త కోసం ఆమె చూపిన తెగువను అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read : BJP, UP Elections – యూపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్