ఎగువ మందపల్లెలో ఇరవై ముప్పై ఇళ్లను, పదుల సంఖ్యలో మనషులను, వందలాది పశువులను తనలో కలిపేసుకుని తదుపరి నువ్వేనంటూ దిగువ మందపల్లె వైపుగా సాగింది ఉగ్ర చెయ్యేరు విధ్వంసం.
రెండు పల్లెల మధ్య కోతకు సిద్ధంగా ఉన్న వరి మాగానిని మొత్తం వేర్లతో సహా పెకిలించి ఒకప్పుడు ఇక్కడ పొలాలుండేటియి అనేంతగా గెట్లె గెనాలను సదరం చేసింది. అప్పటికే అధికారుల తాలూకు హెచ్చరికలతో పులపత్తూరు, ఎగువ మందపల్లెలో జరిగిన విధ్వంసంతో కొంతలో కొంత అప్రమత్తమయ్యి ప్రాణాలను అరచేతపట్టుకుని ట్రాక్టర్లల్లో, బండ్లల్లో, ఏది చిక్కితే దాంట్లో ఊరి బయటికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ఊరి జనాలు.
ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా ఉవ్వెత్తున వచ్చి పడుతున్న వరద తాలూకు చెయ్యేటి మృత్యు హోరు చెవుల్లో మోతమోగిస్తూ గుండెల్లో గుబులు పుట్టించి ఈ జలగండం నుంచి బతికి బట్టగలుగుతామనే ఏ మూలనో ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా తనలో కలిపేసుకుంటోంది.
Read Also: చెయ్యేటి వరద#1
తొలుత పడమరి దిక్కున్న పొలాల్లోంచి ఊళ్లోకి ప్రవేశించిన వరద నీరు మెలిమెల్లిగా నలుదిక్కుల నుంచి ఆక్రమించుకుంటూ మోకాళ్ల ఎత్తు వరకూ వచ్చి చూస్తుండగానే పైపైకి రాసాగాయి. అప్పటివరకూ వీలైనంత మేర ఆస్థి నష్టం కలగకుండా జాగ్రత్తపడిన వాళ్లు, పశువులను బతికించుకోవాలని ఆరాటపడే వాళ్ల ఆశలు ఆ నీటి ఉధృతిలో కలిసిపోయి ఈ క్షణం ప్రాణం నిలబడితే అదే చాలు అనిపించి ఎవరి దారిన వారు బయటికి పరిగెత్తసాగారు. కాళ్లున్న వాళ్లు పరిగెడుతున్నారు, ధైర్యం ఉన్న వాళ్లు మిద్దెలు ఎక్కి ఆశగా దేవుని వైపు చూస్తున్నారు.
నాలుగైదేళ్లుగా కాటికి కాళ్లు చాపుకుని కుటుంబ సభ్యుల ఈసడింపులు భరించుకుంటూ మంచానపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ముసిలామకు మోక్షం ప్రసాదించి, అటునుంచి అటుగా వెళ్లి మిద్దెక్కితే బతకొచ్చు అని అనుకుని తీరా ఆ నీటి ఉధృతికి భయపడి ఊరి బయటికి పరిగెట్టబోయిన కుటుంబం మొత్తాన్ని ఇద్దరు చిన్న పిల్లలను తల్లిదండ్రులతో సహా గల్లంతు చేసింది.
మీ ఇంట్లో వాళ్లు మనకేం పెట్టారు ఏం పెట్టారు అని కూతురి దగ్గర ఒకటేమాయిన పోరుతుంటే అల్లునికి ఇద్దామని బంగారు బ్యాంకులో తాకట్టు పెట్టి తెచ్చిన సొమ్ము బీరువాలో ఉంది అని దాన్ని తెద్దామని ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకుని బయటికి వచ్చే లోపు ఉన్నెట్టుండి నీళ్లు చుట్టుముట్టడంతో ఏం చెయ్యాలో దిక్కుతెలీక వాకిలేసుకుని తనింట్లోనే జలార్పణం అయిన ఆ తల్లి చేతిలోని నోట్లు ఇప్పుడు ఏ బురదలో కూరుకుపోయున్నాయో ఏమో ఆ కర్కష చెయ్యేరుకే తెలియాలి.
Read Also: Cheyyeeru Floods2 – చెయ్యేటి వరద – 2
బయట ప్రపంచంలో బతకలేక పల్లెకొచ్చి పాలు అమ్ముకునైనా బతుకుదామని వెతికి వెతికి తెచ్చిన ఇరవై మంచి పారం బర్రెగొడ్ల తలుగులను కూడా విప్పడానికి సమయంలేక వాటెను తలుగులకే బలిపెట్టిన ఒక యువ రైతుకు తన నిస్సహాయతో వచ్చిన కన్నీళ్లు చెయ్యేటి వరదలో నీటి బిందువుగా కలిసిపోయాయి వరద ఘోషను మరింత రెచ్చగొట్టడానికా అన్నట్టు.
గొర్లు, మేకలు, కోళ్లు, కుక్కలు వేటినీ వదలకుండా ముందుకు సాగిపోయి తన పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం తెచ్చిపెట్టుకున్న తొంభై నాటు ఆవుల దొడ్డిని చుట్టుముట్టేసింది. ఆవులు, ఎద్దులు ఈదులాడి బయటపడాలని కొంచెం ప్రయత్నించాయి గానీ లేగ దూడలు, పాలు తాగే సంటి దూడలు తలికిందులై నీళ్ల మింద మునుగుతూ లేస్తూ బలం సరిపోక కాళ్లు తిరగబడి ఇక మా వల్ల కాదనుకుంటూ బతుకు ఆశలు వదిలేసుకున్నాయి.