iDreamPost
android-app
ios-app

చెయ్యేటి వరద#1

చెయ్యేటి వరద#1

విశాఖ కార్తె చిత్తడికి తడిసి, కార్తీక మాసపు చలిలో మత్తుగా జోగుతున్న చెయ్యేటి నదీ ప్రాంతపు పల్లెల్లో తెల్లవారుజామున నాలుగున్నర ప్రాంతంలో ప్రళయకల ఘంటికలా ఉయ్యంటూ మోగింది పెద్ద సైరన్. ఎప్పుడో మూగోబోయినట్టు ఉండే అన్నమయ్య ప్రాజెక్టు వరద తాలూకు అలారం అది. కొత్త తరం వాళ్లు పెద్దగా వినుండరు గానీ పెద్దోళ్లు మాత్రం ఈ ముప్పై నలభయ్యేళ్లలో ఒకట్రెండు సార్లు వినుంటారు.

గొడ్డుబోయిన గేదెలా తెల్లటి ఇసుకతో ఎండమావుల్లా కనిపించే మన చెయ్యేటికి వరదేందిలేబ్బా అని లేచి రెండడుగులు వేసి ఏట్లోకి చూస్తే అంతమొబ్బులోనూ నీళ్లు బాగానే కనపడుతున్నాయి. నిత్యం కరువు రక్కసి దెబ్బకు విలవిల్లాడే సీమ వాసులకు నీళ్లెప్పుడూ వరమే. బోర్లకు నీళ్లెక్కుతాయిలేబ్బా అనుకుంటూ వచ్చి మంచంమింద మత్తుగా పొర్లుతుంటే అయిదు గంటల ప్రాంతంలో ఒక కారు రెండు బైకులు వచ్చి ఆగాయి హడావిడిగా.

వచ్చీ రాగానే “వరద దెబ్బకు అన్నమయ్య కట్ట తెగేతట్టు ఉంది.. కానీండి కానీండి” అంటూ ఆదరా బాదరాగా అరుస్తున్నారు వీఆర్వో వాళ్లు. చెయ్యేటికేంది వరదేంది అనుకుంటుండగానే రెండు ట్రాక్టర్లు వచ్చాయి ఎక్కండి ఎక్కండంటూ. అప్పుడు గానీ అర్థం కాలేదు యవ్వారమేందో తేడాగుందని కానీ చిన్న పిల్లల తల్లిదండ్రులు, రెండు మూడు కుటుంబాలు తప్ప ఎవరూ పెద్దగా ఎక్కలేదు.

Also Read:చెయ్యేరు,అన్నమయ్య ప్రాజెక్ట్ ప్రయాణం

చెప్పిన కాడికి చెప్పి తొందరగా వెళ్లిపోండని చెప్పి అధికారులు వాళ్ల దారిన వాళ్లు వెళ్లారు మిగతా వాళ్లని జాగరూకం చెయ్యడానికి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంకో పక్క చూస్తే చెయ్యేరు మెలిమెల్లిగా రాతి కట్టకాన్ని తాకుతూ పారుతోంది. వరద తాలూకు హోరు కూడా మెలిమెల్లిగా పెరుగుతోంది.

ఎంత పెరిగినా ఏనాడు ఇబ్బంది పెట్టని చెయ్యేరు ఈరోజు ఇబ్బంది పెడుతుందా అనే మొండి నమ్మకంతో ఏదైతే అది కానీలే అని ఇష్ట దైవం ఆ శివయ్యనే నమ్ముకుని పులపత్తూరు దగ్గర కన్నేశ్వర శివాలయం దగ్గర కార్తీక మాసపు అర్చనకై అక్కడికి వెళ్లారు పదకొండుమంది. అందులో పిల్లా జెల్లా ఆడవాళ్లు మొగోళ్లు కూడా ఉన్నారు.

అక్కన్నుంచి అన్నమయ్య ప్రాజెక్టు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయిదున్నరకల్లా ప్రాంతంకల్లా కట్ట లీకేజీ స్టార్ట్ అయ్యి నీళ్ల హోరు పెరిగిపోయింది. ఏరు కూడా వడివడిగా పరిగెడుతోంది. అంతకంతకూ పెరుగుతున్న నీళ్లు అంతమొబ్బులోనూ మింగడానికొచ్చే కొండచిలువ పాములా కనపడుతోంది ఏం చెయ్యాలో దిక్కుతెలీలేదు.

ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్లు ముందుగా రామాపురం, యాకిరేపల్లె, పులపత్తూరును తాకాయి(ఈ మూడు ఊర్లూ సందర్శించడానికి నిన్న వీలుపడలేదు).

చూస్తూ చూస్తుండగానే నీళ్లు గుడిని చుట్టుముట్టాయి. ఏం చెయ్యనూ దిక్కు తెలీలేదు. శివుని కోసం వెలిగిస్తున్న కార్తీక దీపాలను అక్కడే వదిలేసి బతుకు దీపం వెలిగించుకోడానికి అందరూ కళ్యాణమండపం లోపలికి పరిగెత్తారు. చూస్తే ఎనిమిది మందే ఉన్నారు. కొడుకు కనపడట్లేదు. ఎక్కడ ఎక్కడ అని వెతికితే వాడు శివాలయం గోపురం మింద ఉన్నాడు. అయ్యో తొందరగా కళ్యాణమండపంలోకి వచ్చెయ్యి అని కేకలేస్తుండగా పూజారి శివయ్య మింద భారం వేసి గర్భగుడిలోకి వెళ్లి చిలుకు పెట్టాడు.

ప్రాజెక్టు నుండి దూకుతున్న నీళ్ల హోరు చెవులను చిల్లుపడేలా చేస్తుంటే ఆ శబ్ధానికే గుండెలు పగిలేలా ఉన్నాయి. కొడుక్కు జాగ్రత్తలు చెప్పేంతలో నీళ్లు గుడిని చుట్టుముట్టి పూజారిని గర్భగుడిలోనే సమాధి చేసి కళ్యాణ మండపాన్ని ఆక్రమించుకోవడానికి ఉధృతంగా ముందుకురికాయి.

కట్టలు తెంచుకున్న చెయ్యేటి రౌద్రపు రంకెల ముందు మరణ భయం తాలూకు అరుపులు ఎనిమిదింటినీ అక్కడికక్కడే జల సమాధి చేశాయి. ఏం చెయ్యాలో దిక్కు తెలీక ఆ పన్నెండేళ్ల పిల్లోడు గోపురం ఎక్కాడనే గానీ కళ్లముందరే వరదకు ఆహుతిగా మారిన ఎనిమిది మంది కుటుంబ సభ్యుల ఆక్రందనలు సగం జీవాన్ని నీటిలో కలిపేసుకున్నాయి. తన ప్రాణాలు కూడా నిముషం అరనిముషం మహా అయితే అయిదే అయిదు నిముషాల్లో తను కూడా జలార్పణమే అనుకుంటుండగా ఒక గెడ్డి వాము నీళ్లమ్మిటి కొట్టుకురాసాగింది గింగిరాలు తిరుగుతూ.

Also Read:  తెగిన అన్నమయ్య డ్యామ్ ,భయం గుప్పెట్లో సోమశిల ప్రాజెక్ట్

మరణం తథ్యమనుకున్నప్పుడు ఇక్కడే ఉండి నీళ్లలో కొట్టుకుపోవడం కంటే ఆ గెడ్డి వామి ఎక్కుదాం తర్వాత ఏదైతే అది జరగనీ అనుకుంటుండగా గెడ్డి వామి వచ్చి గోపురానికి కొట్టుకునింది. ఇంకా ఎక్కడో మనసు పొరల్లో మిణుకు మిణుకుమనే బతుకు ఆశలతో ఆ పన్నెండేళ్ల పిల్లోడు దానిమిందికెక్కాడు. శివునికి నంది వాహనమైనట్టు ఆ పిల్లవాడికి ఆ గెడ్డి వామే వాహనమైంది.

ఎక్కడమైతే ఎక్కాడు గానీ ఆ వరద ఉధృతిలో గింగిరాలు తిరుగుతూ ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ సుడిగుండాల మధ్యన రక్కసి భయంకర అలల ఉధృతిలో చావు బతుకుల మధ్య పోరాడుతూ దాదాపూ గంటన్నర ప్రయాణం తర్వాత ఒక ఒడ్డున చెరువు కట్టలోకి వచ్చి పడ్డం, అక్కడున్న వాళ్లు వచ్చి బయటికి లాగడంతో ప్రాణం మిగిలింది.

ఊహించని ఉపద్రవంలా చుట్టుముట్టిన చెయ్యేటి వరదలో ఎగువ మందపల్లె గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని పదిమంది కార్తీక మాసాన శివార్చనకై కన్నేశ్వం వెళ్లి అక్కడికక్కడే తొమ్మిదిమంది జలసమాధి కాబడితే ఈ పన్నెండేళ్ల పిల్లోడు ఒక్కడు మిగిలాడు మృత్యుంజయుడిగా.

వరద బాధితులకు మీరు ఏదైనా సహాయం చెయ్యాలనుకుంటే రేపు మొన్నాడు అనుకోకుండా వెంటనే పూనుకోండి .ఎందుకంటే కనీస ప్రాథమిక అవసరాలు అందక తక్షణ సహాయం కోసం ఏడు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. మనమిచ్చే దుప్పటి, బట్టలు, గ్లాసు, ప్లేటు కూడా ఎంతో విలువైనవి ఈ కష్టకాలంలో.

సహాయం చెయ్యాలనుకుంటే రాజంపేట మండలం పరిధిలోని ఈ క్రింది గ్రామాలకు వెళ్లగలరు. మరిన్ని వివరాలు కావాలంటే నిరభ్యంతరంగా సంప్రదించండి.

పులపత్తూరు
ఎగువ మందపల్లె
దిగువ మందపల్లె
గుండ్లూరు
సీతారామపురం
తొగుటూరు పేట
రామాపురం
గోపరాజు పల్లె

(మిగతా వరద భీబత్సం తర్వాతి పోస్టులో..)