iDreamPost
iDreamPost
తిరుపతి కి చెందిన ఇద్దరు నేతల తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. వరద బాధితుల విషయంలో వారి చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చర్యలను అభినందిస్తున్నాయి. ఇటీవల రాయలచెరువు కు లీకులు రావడంతో వెంటనే స్పందించిన తీరు అందరికీ ఆదర్శంగా కొనియాడుతున్నారు. ఓ ప్రజా ప్రతినిధి ఎలా వ్యవహరించాలన్నది ఆయన నిరూపించినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సమస్య వచ్చిన వెంటనే ప్రజల్లో ఆయన చొచ్చుకుపోయిన తీరు ప్రజలకు అండగా నిలిచిన వైనం స్ఫూర్తివంతంగా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఉన్నత విద్యావంతుడైన చెవిరెడ్డి రాజకీయంగా చాలా సందర్భాల్లో క్రియాశీలకంగా ఉంటారు. అదే సమయంలో ప్రజా సమస్యల్లోనూ పట్టుదలను ప్రదర్శిస్తారు. సామాన్యులకు అందుబాటులో ఉంటూ జనం మనిషిగా సాగుతూ ఉంటారు. అందుకే ఆయన అనేక అడ్డంకులను అధిగమించి వరుస విజయాలు దక్కించుకుంటున్నారు. చంద్రబాబు అండ్ కో చేసిన అనేక ప్రయత్నాలను ఎదురించి నారావారిపల్లెకి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ప్రస్తుతం అతి పెద్ద విపత్తులా కనిపిస్తున్న భారీ వర్షాలు, వరదల సమయంలో కూడా చెవిరెడ్డి అంతే పట్టుదలతో క్రియాశీలతను ప్రదర్శించారు. విపత్తుల వేళ ప్రజలకు అండగా ఉండాలనే రీతిలో ఆదర్శనీయ ఎమ్మెల్యేగా మారారు.
తొలిరోజు నుంచి ఆయన అదే ధోరణి. రాయల చెరువు సమస్య చక్కదిద్దడంలో, బాధితులకు పునరావాసం కల్పించడంలో ఆయన ముందుచూపుతో వ్యవహరించారు. సమస్యను అధిగమించారు. జనాలకు ఊరట కల్పించారు. ఉపశమనం కలిగించారు. ఆయనకు తోడుగా తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి కూడా అదే రీతిలో వ్యవహరించడం విశేషం. తాజాగా రాయలచెరువు సందర్శనకు వచ్చిన సీపీఐ నేత నారాయణ కు స్వల్ప గాయం అయిన సమయంలో ఎంపీ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. స్వతహాగా ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి వెంటనే నారాయణకు ప్రాథమిక వైద్యం అందించారు. అంతటితో సరిపెట్టకుండా హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆయన స్వయంగా ఆస్పత్రి వరకూ వెళ్లారు. వైద్య సేవలను పరిశీలించారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నారాయణ పట్ల గురుమూర్తి ప్రదర్శించిన శ్రద్ధ అందరినీ ఆకట్టుకుంది. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి సాటి మనిషికి సాయం చేయడంతో తనకున్న నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వర్తమాన రాజకీయాల్లో ఇలాంటి నేతల తీరు చాలామందికి ఆదర్శమంంటూ సోషల్ మీడియాలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు గురుమూర్తికి అభినందనల వెల్లువ సాగుతోంది. పార్టీలకు అతీతంగా అనేక మంది వారి సేవలను కొనియాడుతుండడం విశేషం. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజా సేవలో వారు ప్రదర్శించిన చొరవ దానికి ప్రధాన కారణం.
Also Read : MLA Chevireddy, Rayala Cheruvu – ఆపదలో ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి