Idream media
Idream media
మోసపోకుండా ఉండటం ఒక ఆర్ట్. ఇప్పుడు ప్రతివాడు మనకు అవసరం లేని దాన్ని అంటగట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనతో ఏదో ఒకటి కొనిపిస్తాడు. ఏదో రకంగా అమ్ముతాడు. ఏమరుపాటుగా ఉంటే దెబ్బ వేసేస్తాడు.
డెంటిస్ట్ దగ్గరికి వెళితే ఫస్ట్ రూట్‌కెనాల్ , తర్వాత క్యాప్ మన స్థాయిని చూసి బిల్. వైద్యాన్నిబట్టి కాదు. ఈ మధ్య ఒక పేరు గాంచిన డెంటల్ హాస్పిటల్‌కి వెళితే రూ.14 వేలు బిల్లు అవుతుందని చెప్పాడు. అవసరం లేదన్నాను. బేరానికి దిగాడు. రూ.4వేలు డిస్కౌంట్ ఇస్తానని చెప్పాడు. ఆస్పత్రుల్లో బేరం ఆడాలని అప్పటి వరకు తెలియదు.
ఈ మధ్య గ్యాస్ స్టౌ రిపేర్ వాన్ని పిలిపించాం. స్టౌని ఊడబీకి పార్ట్‌లన్నీ మార్చాలని చెప్పాడు. మార్చమన్నాను. రూ.2,900 బిల్లు చేశాడు. వాడి మార్చినవన్నీసెకండ్స్. రూ.4 వేలు పెడితే కొత్త స్టౌ వచ్చేది.
ప్లంబర్‌ని పిలిస్తే బాగున్న కుళాయిలు కూడా ఊడబీకి రూ.2వేలు బిల్లు చేశాడు. వీళ్లతో సమస్య ఏంటంటే చెక్ చేయడంలో భాగంగా అన్నీ విప్పేస్తారు. ఆ తర్వాత చచ్చినట్టు డబ్బులు ఇవ్వాల్సిందే.
బార్బర్ షాప్‌కు వెళితే, ముఖం మీద ట్యాన్ ఉంది. మసాజ్ చేయించుకోండి అంటాడు. టెంప్ట్ అయితే రూ.1000 వదులుతుంది. ముందే అడక్కపోతే ముఖానికి పట్టి వేసి, పొగ పెడతాడు. తర్వాత డబ్బులు అడుగుతాడు.
మన జేబులో డబ్బుల్ని ఏదో రకంగా ఖర్చు పెట్టించకపోతే అవతలి వాడికి మనశ్శాంతి ఉండటం లేదు. థియేటర్‌కి వెళితే అక్కడ ఒకడు పెన్ను పేపర్‌తో తగులుకుంటాడు. పేరు, ఫోన్ నంబర్ రాసుకుని లక్కీ డిప్‌లో మీ కూపన్ వేస్తామంటాడు.
4 రోజుల తర్వాత ఫోన్ , అదేంటో మనలాంటి దరిద్రులకు కూడా గిప్ట్‌లు వస్తాయి. ఆశ పడితే సినిమానే. మనల్ని వేధించి డబ్బులు ఏదో స్కీంకి కట్టించుకుంటారు.
వినియోగదారులకి ఏ మేరకి హక్కులున్నాయో గానీ, వాడిని దోచుకోవడం చాలా మందికి హక్కు. ఈ మధ్య Dమార్ట్‌లో ఎలక్ట్రికల్ కుక్కర్ కొంటే , దానికి ఐదేళ్ల వారెంటీ ఇచ్చారు. ఆన్ చేసిన ఐదు నిమిషాలకే పనిచేయలేదు. వారెంటీ కార్డు ఉన్నా , బాధ్యత తీసుకోరు. కంపెనీ సర్వీస్ సెంటర్లో ఇవ్వాలని దబాయిస్తారు. చివరికి తీసుకొని ఒన్ వీక్ తర్వాత రమ్మన్నారు. కొనే వరకు రాజులా చూస్తారు. కొన్న తర్వాత భిక్షగాడి ట్రీట్‌మెంట్. ఒకప్పుడు తిరుపతిలోనే గుండు కొట్టేవారు. ఇప్పుడు ఏమారితే, ఎప్పుడూ గుండే.