iDreamPost
iDreamPost
ఈ రోజు నుంచి థియేటర్లు తెరుచుకోబోతున్న నేపథ్యంలో జనం వెండితెరపై వినోదాన్ని అందుకునేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఉన్న ట్రెండ్స్ ని బట్టి చూస్తే టెనెట్ సినిమాకు పెద్ద మల్టీ ప్లెక్సుల్లో ఇవాళ దాదాపు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. సగం కెపాసిటీనే కాబట్టి ఇది సాధ్యమయ్యింది కానీ ఒకరకంగా చూస్తే ఈ మాత్రం ధైర్యం చేసి పబ్లిక్ టికెట్లు బుక్ చేసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఎఎంబి సూపర్ ప్లెక్స్ లో ఫస్ట్ డేనే సుమారు పదిహేను పైగా షోలు కలెక్షన్లతో నిండిపోనున్నాయి. వీకెండ్ కాబట్టి ఈ మూడు రోజులు ఇలాంటి పరిస్థితినే చూడొచ్చు. ఆ తర్వాత ఉంది అసలు ట్విస్ట్.
డిసెంబర్ 25న రాబోయే సోలో బ్రతుకే సో బెటరూ దాకా ఎదురు చూపులు తప్పవు. మళ్ళీ 2021 సంక్రాంతి దాకా గ్యాప్ వచ్చేస్తుంది. ఆ సీజన్ కి అయిదారు సినిమాలు ఫిక్స్ అయినప్పటికీ మెల్లగా ఒక్కొకటి డ్రాప్ అవుతున్నాయని ఇన్ సైడ్ టాక్. కరోనా కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ వైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదు. పుష్ప షూటింగ్ లో కొందరికి సోకి ఒకరు మరణించారన్న వార్త ఇప్పటికే కలవరం కలిగిస్తోంది. ఈ లెక్కన జనవరిలో ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇవ్వడం దాదాపు అసాధ్యమే. అలాంటప్పుడు పెద్ద హీరోల చిత్రాలకు పెట్టుబడులు వెనక్కు రావడం కష్టం.
అందుకే అప్పుడు ఎవరు వస్తారు ఎవరు డ్రాప్ అవుతారని చెప్పడం కష్టమే. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు రవితేజ క్రాక్ ఒక్కటే ఎలాంటి సిచువేషన్ ఉన్నా పండక్కు రావాలని డిసైడ్ అయ్యిందట. రెడ్ మరోసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునే ఆలోచనలో పడ్డట్టు వినికిడి. లవ్ స్టోరీ, వకీల్ సాబ్ లు ఏకంగా వేసవి వైపే చూస్తున్నాయి. ఉప్పెన టీమ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అరణ్య రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంది. రెంటికి చెడ్డ రేవడిలా 30 రోజుల్లో ప్రేమించడం ఎలాకు ఓటిటి డీల్స్ కూడా తగ్గిపోయాయి. సో రానున్న సంక్రాంతి బహుశా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత డల్ సీజన్ గా నిలిచే ఛాన్స్ ఉంది.