iDreamPost
android-app
ios-app

చింత‌మ‌నేని ఆద‌ర్శమా?..బాబు తీరులో మార్పున‌కు నిద‌ర్శ‌న‌మా?

  • Published Nov 19, 2019 | 3:04 AM Updated Updated Nov 19, 2019 | 3:04 AM
చింత‌మ‌నేని ఆద‌ర్శమా?..బాబు తీరులో మార్పున‌కు నిద‌ర్శ‌న‌మా?

త‌న రాజ‌కీయ ప్ర్థస్థానంలోనే గ‌తంలో ఎన్న‌డూ లేనంత సందిగ్ధంలో చంద్ర‌బాబు ఉన్నారు. రాజ‌కీయంగా ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత తెలుగుదేశం పార్టీ అయోమ‌యంగా మారింది. అధికారం కోల్పోవడంతో వ‌చ్చిన స‌మ‌స్య‌లే కాకుండా నాయ‌క‌త్వం మీద విశ్వాసం కోల్పోతున్న క్యాడ‌ర్ తో సైకిల్ స‌వారీ చిక్కుల్లో ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలిలో స్ప‌ష్ట‌మైన మార్పు వ‌స్తోంది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఆయ‌న దేనికైనా సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు రూఢీ అవుతోంది.

ఎన్నిక‌ల ముందు బీజేపీని తిట్టిన తిట్లు తిట్ట‌కుండా చంద్ర‌బాబు తిట్టారు. మోడీని వ్య‌క్తిగ‌తంగానూ టార్టెట్ చేశారు. హంగ్ పార్ల‌మెంట్ అంచ‌నాల‌తో ఆయ‌న అదుపు లేకుండా చెల‌రేగిపోయారు. కానీ తీరా ఆశించిన ఫ‌లితాలు రాక‌పోగా అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప‌రిస్థితి దాపురించింది. ఈ స్థితిలో చంద్ర‌బాబు మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర కావాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌న‌కు ఆప్తుడైన నితిన్ గ‌డ్క‌రీ ద్వారా రాయ‌బారాలు న‌డిపి నాగ‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాల‌యం చేరుకోగ‌లిగారు. కానీ పీఎంవో లో అడుగుపెట్టే అవ‌కాశం ఇప్ప‌టి వ‌ర‌కూ ద‌క్కించుకోలేక‌పోయారు. క‌నీసం అమిత్ షాని క‌ల‌వ‌డానికి కూడా చంద్ర‌బాబుకి సానుకూల సంకేతాలు రావ‌డం లేద‌ని ప్ర‌చారం సాగుతోంది. తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన వారినే ఆరు నెల‌లు నిండ‌కుండా ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లించ‌డం లేదు.

అదే స‌మ‌యంలో చిన‌జీయ‌ర్ స్వామి విష‌యంలోనూ చంద్ర‌బాబు తీరులో అనూహ్య మార్పు క‌నిపించింది. సుమారు ద‌శాబ్దంన్న‌ర‌కు పైగా ఎడ‌మొఖం, పెడ‌మొఖంగా సాగిన వీరిద్ద‌రూ ఇటీవ‌ల క‌లిశారు. చిన‌జీయ‌ర్ కాళ్ల‌కు మొక్కిన చంద్ర‌బాబు మ‌ళ్లీ తాను ద‌గ్గ‌ర‌వుతున్నాన‌నే సంకేతాలు ఇచ్చారు. ఇప్ప‌టికే తెలంగాణాలో కేసీఆర్ తో స‌న్నిహితంగా మెలుగుతున్న చిన‌జీయ‌ర్ ఏపీలో చంద్ర‌బాబుకి ఆశీర్వాదం ఇవ్వ‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. తిరుప‌తిలో వేయి కాళ్ల మండ‌పం నాటి ప‌రిణామాల‌తో పంతం బ‌ట్టిన చిన‌జీయర్ ని చ‌ల్ల‌బ‌ర్చ‌డానికి చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు రాజ‌కీయంగా బాబు మారుతున్న తీరుకి తార్కాణంగా చెప్ప‌వ‌చ్చు. మారాల్సిన ప‌రిస్థితికి అద్దంప‌డుతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ విష‌యంలో కూడా చంద్ర‌బాబు వైఖ‌రి అదే రీతిలో ఉంది. అధికారంలో ఉండ‌గా చంద్ర‌బాబు క‌నీసం మీడియా లీకుల వ‌ర‌క‌యినా చింత‌మ‌నేనిపై సీరియ‌స్ అయ్యేవారు. అంతేగాకుండా మంత్రివ‌ర్గంలోకి త‌న‌ను తీసుకోక‌పోవ‌డంతో చిర్రుబుర్రులాడి, సొంతంగా పార్టీ పెడ‌తాన‌ని హెచ్చ‌రించే వ‌ర‌కూ వెళ్లిన ఈ వివాదాస్ప‌ద నేత‌ను ప్ర‌భుత్వ విప్ తో స‌రిపెట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు భిన్నంగా స్పందిస్తున్నారు. చింత‌మ‌నేని దూకుడు వ్య‌వ‌హారాల‌తో దెందులూరుతో పాటుగా ప‌గో జిల్లాకే ప‌రిమితం కాకుండా, ఏపీ అంత‌టా చంద్ర‌బాబుకి డ్యామేజ్ క‌లిగింద‌న్న‌ది టీడీపీ నేత‌ల మ‌నోభావం. అయినా ఇప్పుడు చింత‌మ‌నేనిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు చెప్పడం విశేషంగా మారింది. కేసుల విష‌యంలో చింత‌మ‌నేనికి తొలుత పార్టీ అండ‌గా లేద‌నే అభిప్రాయం ఆయ‌న అనుచ‌రుల్లో వ్య‌క్త‌మ‌య్యింది. వ‌ల్ల‌భ‌నేని వంశీ వ్య‌వ‌హారం త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న టీడీపీ అధిష్టానం త‌రుపున నేరుగా లోకేశ్ జైలుకి వెళ్లి వ‌చ్చారు. ఇప్పుడు విడుద‌ల‌యిన వెంటనే చంద్ర‌బాబు ఇంటికి వెళ్లి ఆద‌ర్శ‌ప్రాయుడిగా చెప్ప‌డం గ‌మ‌నిస్తే చంద్ర‌బాబు ప‌రిస్థితి అర్థ‌మ‌వుతోంది. రాజ‌కీయంగా గ‌డ్డు స్థితి ఎదుర్కొంటున్న స‌మ‌యంలో చింత‌మ‌నేని స‌హా ఎలాంటి వారిన‌యినా క‌లుపుకుని పోవాల‌నే ల‌క్ష్యంతో చంద్ర‌బాబు ఉన్న‌ట్టు ఈ ప‌రిణామాలు తేట‌తెల్లం చేస్తున్నాయి