iDreamPost
iDreamPost
పది రోజుల క్రితం ఓ జూమ్ మీటింగ్ లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఓ హత్యకు ప్రతీకారంగా మరో హత్య చేసుకునే ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన తనయుడు నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనలో వేటాడుతా, వడ్డీతో చెల్లిస్తా అంటూ వ్యాఖ్యానించారు. అంటే ఫ్యాక్షన్ మళ్లీ ప్రోత్సహించేలా పనిగట్టుకుని ఈ తండ్రీకొడుకులు ప్రయత్నిస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. వాస్తవానికి గడిచిన దశాబ్దంన్నరగా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ చల్లారుతున్నట్టు కనిపించింది. అప్పట్లో వైఎస్సార్ హయంలో వివిధ పార్టీలలో ఉన్న ఫ్యాక్షన్ నేతలందరినీ సామరస్యంగా ఉండేందుకు ప్రోత్సహించడంతో పరిస్థితి మారింది. అంతా సర్ధుమణిగా చెదురుమదురు ఘటనలు మినహా పెద్ద సంఘటనలు జరగడం లేదు.
కానీ తాజాగా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల హత్యలు మళ్లీ విషయాన్ని రాజేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ శవ రాజకీయాలతో చిచ్చు రాజుకుంటుందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి సీమలో టీడీపీ పునాదులు కూడా కుప్పకూలిపోయాయి. దానిని ఎలా కాపాడుకోవాలన్నది ఆపార్టీకి అంతుబట్టడం లేదు. దాంతో ఫ్యాక్షన్ పురిగొల్పి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా పెసరవాయి ఘటనలో వ్యక్తిగత కక్షలతో ఆ ఇద్దరి హత్య జరిగిందన్నది స్థానికులందరికీ తెలుసు. నిజానికి మరణించిన వారు కూడా నిన్న మొన్నటి వరకూ వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. గతంలో ఎన్నడూ టీడీపీ వెంట తిరిగిన దాఖలాలే లేవు. ఏడాది క్రితమే స్థానిక ఆధిప్యత రాజకీయాల్లో మరణించిన వారి వర్గం టీడీపీ పంచన చేరింది. దానికే వారంతా సుదీర్ఘకాలంగా తమ వెంట ఉన్నట్టు, రాజకీయ కారణాలతోనే ఫ్యాక్షన్ తరహా హత్యలు జరిగాయంటే చంద్రబాబు లేఖ రాయడం, చినబాబు తనకు మాలిన రీతిలో నోటికి పనిచెప్పడం విస్మయకరంగా మారింది. అయితే స్థానికులకు వాస్తవం తెలిసినా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తాము, తమ వర్గపు మీడియా ద్వారా చేసే ప్రచారం నమ్ముతారనే విశ్వాసంతో వారీ ప్రయత్నానికి పూనుకున్నట్టు కనిపిస్తోంది.
పెసరవాయి ఘటన మరుగున పడకముందే అనంతపురం జిల్లాలో అగ్గిరాజుకుంది. యల్లనూరు మండలం అరవేడులో జంట హత్యలు జరిగాయి. తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులిద్దరు హత్య చేయబడ్డారు. జిల్లా నారాయణప్ప, జిల్లా రాజగోపాల్ ని వాసాపురం గ్రామ సమీపంలో నగేష్ అనే నిందితుడు, అనుచరులతో కలిసి హత్యకు తెగబడ్డారని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ హత్యతో రగిలిపోయిన స్థానికులు గ్రామంలోని నగేష్ ఇంటిని తగులబెట్టారు. దాంతో పోలీసులు ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చేందుకు పెద్ద మొత్తంలో రంగంలో దిగాల్సి వచ్చింది. అయితే ఇలా వరుస ఘటనల వ్యవహారంలో టీడీపీ నేతల తెగింపు మాటల తాలూకా ప్రభావం కనిపిస్తోంది. రాష్ట్రంలో విద్వేషాలు రగిల్చే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
కోస్తాలో మత విద్వేషాల కోసం చివరకు దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన స్కెచ్ ఫలించలేదు. దానిని రాజకీయ చేయాలనే లక్ష్యం నెరవేరలేదు. దాంతో ఇప్పుడు సీమలో కక్షలు, కార్పణ్యాలు రగిల్చే ప్రయత్నానికి ఒడిగట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన రాజకీయ ప్రయోజనా లకోసం ఏం చేయడానికైనా వెనుకాడని నైజం ఉన్న నేతలు కావడంతో ఇలాంటి సందేహాలకు ఆస్కారం కలుగుతోంది. శాంతిభద్రతల సమస్యను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారా అనే భావన మొదలవుతోంది. అయితే ఇప్పటికే యంత్రాంగం కఠిన చర్యలకు పూనుకుంటోంది. ప్రశాంతంగా మారుతున్న రాయలసీమలో పరిస్థితి చేజారకుండా చూసే లక్ష్యంతో సాగుతోంది. రాజకీయ అవసరాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం ఫలితమివ్వదని ప్రతిపక్ష నేతలు తెలుసుకుంటే మంచిదేమో.