iDreamPost
iDreamPost
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అల్టిమేట్ పవర్. వారు మెచ్చి ఇస్తే అధికారం, లేకపోతే ప్రతిపక్షం. ఎంత ఉద్దండులైనా ప్రజాక్షేత్రంలో జరిగే పోరాటంలో ఓటికుండలుగానే ఒక్కోసారి మిగిలిపోవాల్సి వస్తుంది. ఎక్కడైనా చక్రం తిప్పగలిగే నారా చంద్రబాబునాయుడి పరిస్థితి ఇప్పుడలాగే ఉందన్నది రాజకీయ వర్గాల నుంచి విన్పిస్తున్న మాట.
2014లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు, ఆయన బృందం చేసిన ఘన కార్యాలను గుర్తించి 2019లో ప్రజలు ప్రతిపక్షం హోదాకు మార్చేసారు. అయితే ఆ తరువాత కూడా ఆయన వ్యవహారశైలిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో సొంత పార్టీ నాయకులే తమదారి తాము చూసుకుంటున్నారు. గెల్చిన 23 మందిలోనూ ఇప్పటికే నలుగురు తమ దారి తాము చూసుకున్నారు. ఇందుకు వారు చెబుతున్న కారణాలు కూడా ప్రజామోదం పొందేవే కావడం గమనార్హం.
దీంతో ఉన్న వాళ్ళను కాపాడుకోవడం, వెళ్ళిపోయే వాళ్ళను ఆపడం ఎలాగో అర్ధం కాని విచిత్ర పరిస్థితిలో చంద్రబాబు ఇప్పుడున్నారన్నది వారి సొంత పార్టీ నాయకుల నుంచే విన్పిస్తోంది. ఇక మిగిలింది 19 మంది, వీరిలో ఖచ్చితగా ఎంత మంది శాశ్వతం అంటే మాత్రం ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి కూడా నికార్సైన సమాధానం రావడం కష్టం. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అర్హతకు మెచ్చి ఇచ్చిన ప్రతిపక్షం హోదాను కూడా ఇప్పుడు చంద్రబాబు పార్టీ కోల్పోతుందా? అన్న సందేహాలు సర్వత్రా చుట్టుముడుతున్నాయి.
ఎదుటి పార్టీ తమ వారిని కావాలనే లాక్కుంటోందని విమర్శలకు దిగుదామనుకున్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందేంటో? అని ప్రశ్నిస్తారన్న సందేహం కూడా వారిని పట్టిపీడిస్తోంది. చంద్రబాబు, ఆయన బృందం ఎటువంటి కారణాలు చెప్పుకుంటున్నప్పటికీ, పార్టీ నుంచి వీడిపోతున్నవారు చెప్పేదాన్ని గమనిస్తే ఒక్కటి మాత్రం స్పష్టమవుతోంది. దిశానిర్దేశం లేని విధానాలు, కోటరీకే పెద్దపీఠ వేయడం, ప్రజలను పట్టించుకోకపోవడం అనే మూడు లోపాలను ప్రధానంగా వారు ఎత్తిచూపుతున్నారు.
ఎన్నిరకాలైన విమర్శలు చేసినప్పటికీ అంతిమంగా ఈ మూడింటి కారణాన్నే వివరిస్తున్నారు. వారు చెబుతున్న వాటిని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే వారిని కన్విన్స్ చేయాల్సిన చంద్రబాబు పార్టీ నుంచి మాత్రం ఎటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు. అంటే ఒక రకంగా అధికార వైఎస్సార్‌సీపీకి మద్దతుగా వెళుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు అండ్ బృందం ఒప్పేసుకుంటోందన్న వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో మరికొంత మంది తమదారి తాము చూసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటున్నట్లుగా వినికిడి. టీడీపీతో పోలిస్తే మరింత మెరుగైన ప్రత్యామ్నాయాలు ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ వారికి కన్పిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజలిచ్చిన ప్రతిపక్షం హోదాను కూడా కాపాడుకోవడం చంద్రబాబుకు కష్టమైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు పరిశీలకులు.