అమరావతి భూ కుంభకోణంలో మాజీ న్యాయాధికారులు, న్యాయమూర్తుల కుటుంభీకులు ఉన్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించి ప్రాథమిక ఆధారాలతో ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బయటపెట్టకూదని, మీడియాలో ప్రసారం కాకూడదని, దర్యాప్తును వెంటనే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో దేశం మొత్తం అమరావతి వైపు చూస్తోంది. ఏసీబీతో సహా సిట్ దర్యాప్తు, మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాల అమలుపై కూడా ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంతో దేశంలోని ప్రముఖులు, ఏపీ ప్రజలు ఇప్పుడు అమరావతిలో జరిగిందంటున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించే చర్చించుకుంటున్నారు.
అయితే టీడీపీలోని ఓ వర్గం మాత్రం చంద్రబాబు గురించి, ఆయన తెలివితేటల గురించి ముచ్చటించుకుంటున్నారు. అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొన్నారని టీడీపీ నేతలు, మాజీ మంత్రులు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రులు రావెల కిషోర్‌బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, తాజా, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, తాజా, మాజీ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, జీవీ ఆంజనేయులు, చంద్రబాబు సన్నిహితులు లింగమనేని రమేష్, మాజీ ఏజీ దొమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రిం కోర్టు న్యాయమూర్తి నూతలపాటి వెంకట రమణ.. ఇలా జాబితా చాలానే ఉంది. వీరిలో ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, దొమ్మాలపాటి శ్రీనివాస్, నూతలపాటి వెంకట రమణ కుటుంబ సభ్యులు తదితరులపై కేసులు కూడా నమోదయ్యాయి.
అయితే వీరందరూ స్వయంగా వారిపేర్లతోనో లేక వారి కుటుంబీకులు, బంధువుల పేర్లతోనో భూములు కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఎక్కడా కూడా నేరుగా తన పేరుతోగానీ, తన తనయుడు నారా లోకేష్ సహా ఇతర కుటుంబ సభ్యుల పేర్లతోగానీ భూములు కొనుగోలు చేయలేదు. కానీ చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్‌కు సన్నిహితులుగా పేరొందిన వారు మాత్రం భూములు కొన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి.
ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు సేఫ్ సైడ్‌లో ఉండగా.. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితులుగా పేరొందిన వారు, ఉన్నతమైన పదవుల్లో ఉన్న వారు మాత్రం బుక్ అయ్యారు. వీరందరూ తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితిని పరోక్షంగా చంద్రబాబు కల్పించారని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితి రావడం వల్ల చంద్రబాబు.. లక్ష్య సాధనలో వీరందరూ పావులుగా మారారనే టాక్ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, సిట్, ఏసీబీ చేస్తున్న దర్యాప్తులను చంద్రబాబు వీరి భుజాలపై తుపాకి పెట్టి ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. రాజకీయ, వివిధ వ్యవస్థల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారి భుజాలపై తుపాకి పెట్టి చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటం ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.