Idream media
Idream media
అమరావతి కోసం ప్రజలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చిన విఫలయత్నం చేసిన చంద్రబాబు.. తాజాగా మరో పిలుపునిచ్చారు. వ్యవసాయ పంపుసెట్లకు ఏర్పాటు చేసే మీటర్లను రైతులే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పైగా ఏకైక రాజధానిగా తమ ప్రాంతమే ఉండాలని పోరాడుతున్న అమరావతి రైతులు, మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలని సలహా ఇచ్చారు. సలహాలతో కూడిన పిలుపులు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తగాకపోయినా.. వ్యవసాయం, విద్యుత్ అంశాలపై చంద్రబాబు మాట్లాడడమే ప్రస్తుతం ఆసక్తికర పరిణామం. చంద్రబాబు మాటలను ఏ విధంగా నమ్మి రైతులు మీటర్ల ఏర్పాటును అడ్డుకుంటారు..?
నారా చంద్రబాబు నాయుడు వరుసగా 9 ఏళ్లు, మళ్లీ 5 ఏళ్లు వెరసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదున్నరేళ్లు మాత్రమే సీఎంగా పని చేశారు. చంద్రబాబుతో పోల్చితే.. వైఎస్సార్ బాబులో మూడో వంతు సమయమే సీఎంగా ఉన్నారు. మరి వీరిద్దరిలో ప్రజలకు ఎవరు మేలు చేశారు..? ముఖ్యంగా రైతులకు ఎవరు మంచి చేశారు..? అని ప్రశ్నిస్తే.. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చెప్పే మాట ఏమిటో యావత్ తెలుగు ప్రజలకు తెలుసు.
ఎన్టీఆర్, వైఎస్సార్ మాదిరిగా ప్రజలకు మంచి చేసే పథకాలు, వారి జీవితాలను మార్చే కార్యక్రమాలను చెప్పమంటే.. ఎన్టీఆర్ రెండు రూపాయల బియ్యం, రైతులకు 50 రూపాయలకే హార్స్‌పవర్ చెబుతారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్, 108 అంటే.. వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరి చంద్రబాబు ఏమి చేశాడంటే.. చంద్రబాబు వీరాభిమాని కూడా తడుముకోవాల్సిందే.
వ్యవసాయం, రైతులనే తీసుకుంటే.. ఎన్టీఆర్ 50 రూపాయలకే హార్స్ పవర్ ఇస్తే.. ఆ తర్వాత సీఎంగా వచ్చిన చంద్రబాబు ఈ పథకం ఎత్తివేశారు. కరువులోనూ కరెంట్ బిల్లుల పేరిట రైతులను హింసించారు. విద్యుత్ బిల్లులు తగ్గించాలని కోరిన రైతులను కాల్చి చంపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్సార్ ఉచిత విద్యుత్ ఇచ్చారు. పావలా వడ్డీకే రుణాలు అందిచారు. పంటకు మద్ధతు ధర ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేశారు. సబ్సిడీపై యంత్రాలు ఇచ్చారు. తుఫానులు, వరదల వల్ల పంట నష్టపోతే తానున్నానంటూ ఆదుకున్నారు. ఈ విషయాలు తెలుగు రాష్ట్రాలలో ఏ రైతును కదిలించినా చెబుతారు.
2014లో అధికారంలోకి వచ్చేందుకు రైతులకు షరతులు లేకుండా పంట రుణాలు, బంగారు రుణాలు 87,672 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఏమి చేశారో రైతులందరికీ తెలుసు. అప్పటి వరకూ బ్యాంకులకు దర్జాగా వెళ్లిన రైతులను.. చంద్రబాబు ఆ వైపు కూడా వెళ్లకుండా చేశారు. ఇప్పటికీ బ్యాంకుల్లో రైతుల రుణాలు అలానే ఉన్నాయి. ఏనాడు రైతులకు మేలు చేయకుండా, ఇచ్చిన హామీ అమలు చేయకుండా దగా చేసి, వారిని అన్ని విధాలుగా నష్టపరచిన తన మాటను విని ప్రభుత్వం తన ఖర్చుతో బిగించే మీటర్లను రైతులు ఏ విధంగా అడ్డుకుంటారు..? తన మాటను నమ్మి రైతులు ఎలా ముందుకు వెళతారని బాబు నమ్ముతున్నారనేదే అంతుచిక్కని ప్రశ్న.
తన తండ్రి ఆశయాల కొనసాగింపే లక్ష్యమని ప్రకటించి.. ఆ మేరకు పాలన సాగిస్తున్న సీఎం జగన్.. రైతులకు ఏడాదిలోనే ఎంతో మేలు చేశారు. పగలే 9 గంటల ఉచిత విద్యుత్ పలు ప్రాంతాల్లో ఇస్తున్నారు. రాష్ట్రం అంతా ఇచ్చేందుకు అవసరమైన ఫీడర్లు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే రైతులకు తయారీ ధరకే ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందిస్తున్నారు. పంటల బీమా ఉచితంగా చేయిస్తున్నారు. ఎరువులు, విత్తనాల కొరత అనే మాటే వినపడకుండా చేస్తున్నారు. పెట్టుబడి కోసం ఏడాదికి 13,500 రూపాయలు అందిస్తున్నారు. రైతుల మేలు కోసం ఇంత చేస్తున్న జగన్.. వారికి నష్టం చేసేలా.. తన తండ్రి ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను అడ్డుకునేందుకు యత్నాలు చేస్తారా..? రైతులు, వ్యవసాయం అంశాలపై బాబు చేసే ఏ రాజకీయమైన వృథా ప్రయాశ అవుతుందే తప్పా.. ఫలితం ఉండదనేది కరుడుగట్టిన టీడీపీ అభిమాని కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.