iDreamPost
iDreamPost
2019 ఎన్నికల ముందు చక్రం తిప్పుదామని ప్రయత్నించిన నారా చంద్రబాబు నాయుడికి ఆ ఎన్నికల ఫలితాలు చూసాక చక్రం తిరగలేదని, తననే తిప్పేసిందన్నది బోధపడింది. తాను చేసిన పొరపాట్లు గుర్తించి, సరిదిద్దుకునే ప్రయత్నం మొదలెట్టారు. వాటి లిస్టు చాంతాడంత ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు కాపాడగలిగే మోదీని నమ్ముకోవడం ద్వారా తాత్కాలికంగానైనా పార్టీని, కేడర్‌ను నిలబెట్టుకోవచ్చని, ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అడిగినా, అడగకపోయినా, ఏం చేసినా, చెయ్యకపోయినా బీజేపీని, మోదీని పొగుడుతూ తన ఆశను పరోక్షంగా వెల్లడించారు. తన పార్టీకి అప్పటి వరకు పునాదులుగా నిలిచిన నాయకుల్ని బీజేపీలోకి పంపించి తన ఇష్టతను తెలియజేసుకున్నారు. ప్చ్.. కానీ చంద్రన్న ప్రయత్నాలను బీజేపీ అధినాయకత్వం ‘రాష్ట్ర అధ్యక్షుడి మార్పు’తో నిర్ద్వందంగా తోసిపుచ్చేసింది.
అసలు ఎన్ని పొడగడ్తలు మొత్తుకున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇది కాదు పనని రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఫిర్యాదు (పేరుకు మాత్రం సలహా లెండి) రూపంలో సిద్ధం చేసి కేంద్రానికి పితూరీలు చెప్పేందుకు కూడా చేసిన ప్రయత్నం పెద్దగా ఫలితమివ్వలేదు. ఇదంతా ఒకెత్తయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ టీడీపీ లైన్ అప్ భావజాలాన్నే విన్పిస్తున్న కన్నా లక్ష్మీనారాయనను ఆ స్థానం నుంచి తప్పించడం ఇప్పుడు మరోసారి బీజేపీ–టీడీల మధ్య దూరాన్ని స్పష్టం చేసింది. దీనికి తోడు చంద్రబాబుకు అండ్ టీమ్‌కు ఫక్తు వ్యతిరేకి అన్న ముద్ర వేసుకున్న సోము వీర్రాజును ఆ పీఠంపై కూర్చోబెట్టింది. తద్వారా 2014 ఎన్నికల ముందు చంద్రన్న వేసిన ‘చక్రం’ వేషాలన్నీ తమ వద్ద గుర్తున్నాయన్నది చెప్పకనే చెప్పేసింది.
అదలా ఉండగా టీడీపీకి వత్తాసు పలికే విధంగా మాట్లాడుతున్న నాయకులకు షోకాజ్‌లు కూడా ఇస్తూ బీజేపీ జెండాలు కప్పుకున్న టీడీపీ ముఖాలకు నర్మగర్భ హెచ్చరికలు చేసింది. ఏతా వాతా ఈ మొత్తం ఎపిసోడ్‌ను గమనిస్తే తేలేదేంటంటే కేంద్రానికి టచ్‌లో ఉంటూ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్‌సీపీని దెబ్బకొడదామన్న ప్రయత్నాల్లో చంద్రబాబు ఉంటే.. చంద్రబాబును దెబ్బకొట్టే ప్రయత్నంలో బీజేపీ ఉందన్నది బహిరంగమైపోయింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అంచనా వేసుకున్న బీజేపీ ఇప్పటికప్పుడు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నట్లుగా భావించొచ్చు. ఇది ‘మూలిగ నక్కమీద తాడిపండు పడడం’ లాంటిదే.
ఒక పక్క సంక్షేమ ఎజెండాతో ప్రజల ముందు సగర్వంగా నిలిచిన వైఎస్సార్‌సీపీ ఎదుర్కొలేక టీడీపీ బృందం నానా పాట్లు పడుతోంది. ఏం చేయాలి? ఏం చేస్తే జనాన్ని ఆకట్టుకోగలుగుతాం? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఎలా? అన్నది అంతు తేలని పరిస్థితుల్లో నమ్మకం పెట్టుకున్న బీజేపీ కూడా ఇలా హేండ్ ఇచ్చేయడంతో.. ఇప్పుడు చంద్రబాబు ఏ స్టాండ్‌కు మారతారో వేచిచూడాలి.