గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పూర్తిగా చతికిలపడిన తెలుగుదేశం పార్టీ కు నాలుగో దశ ఎన్నికల్లో చంద్రబాబు సొంతూరు నారవారి పల్లె ఫలితాలు కాస్త జోష్ తెప్పించాయి. తన స్వగ్రామం పరిధిలోని కందుల వారి పల్లి పంచాయతీలో టిడిపి 563 ఓట్ల తేడాతో గెలుచుకుంది. దింతో పాటు 8 వార్డుల లోను టీడీపీ మద్దతు దారులు వార్డ్ సభ్యులు గా గెలిచారు.
జాగ్రత్త పడిన వేళ!
కందుల వారి పంచాయితీలో మొత్తం 10 వార్డులు ఉంటే, వైస్సార్సీపీ కు ముందుగానే రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 8 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన వార్డుల్లో అన్నీ టీడీపీ మద్దతు దారులు గెలవడం తో తమ్ముళ్లు ఊపిరి పీల్చుకున్నారు. మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ఫలితాలు వచ్చిన వెంటనే టిడిపి అధినాయకత్వం అలర్ట్ అయింది. ముఖ్యంగా సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో పడిన దెబ్బ ఆ పార్టీ మనుగడకే ప్రశ్నార్ధకం తెచ్చే పరిస్థితి ఏర్పడింది.
దీంతో నాలుగో దశలో ఎన్నికల్లో ఉన్న చంద్రబాబు సొంతూరు లో పూర్తిస్థాయిలో టిడిపి నాయకులు దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఇక్కడ గెలిచేందుకు డైరెక్ట్ అధినాయకత్వం నుంచి సూచనలు అందాయి. ఎలా ముందుకు వెళ్లాలి గ్రామంలో ఎవరిని కలుపు వెళ్లాలి? వారికీ ఎలాంటి హామీ ఇవ్వాలి అన్న అంశాలను డైరెక్టుగా చంద్రబాబు పర్యవేక్షించడం విశేషం. చంద్రగిరి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి, చిత్తూరు జిల్లా టిడిపి అధ్యక్షుడు పులివర్తి నాని కుప్పం ఫలితాలు అనంతరం తన కార్యకలాపాలన్నీ నారావారిపల్లె పంచాయితీ వేదికగానే నిర్వహించడం ఇక్కడ చెప్పుకోవాలి.
జిల్లా నాయకులు అందరిని
నారావారిపల్లెలో మొత్తం 5 వార్డు ఉంటే ఆ వార్డుల్లో రాష్ట్రస్థాయి టిడిపి నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న నారా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న వారు సైతం పంచాయితీ ఫలితాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసి తమ హామీలు ఇచ్చారు. ఇది పార్టీకి సైతం లైఫ్ అండ్ డెత్ విషయంగా మారడం అందరినీ అలెర్ట్ చేసింది. గతంలో పంచాయతీ ఎన్నికల్లో కనీసం ఇంటి నుంచి బయటకు రాని వారు సైతం ఈసారి మొత్తం నారావారిపల్లె అంతా కలిసి తిరిగి ప్రతి ఇంటినీ పలకరిస్తూ ఓట్లు అడగడం విశేషం.
చంద్రబాబు కుటుంబానికి స్థానికంగా పట్టులేకున్నా,కుప్పంలో ఎదురైనా ఓటమితో సొంత పంచాయితీలో గెలుపు కోసం శ్రమటోర్చి, నాయకులతో ఫోన్లో మాట్లాడారు. స్థానిక నాయకులు కూడా ఇంటింటికి తిరిగి చంద్రబాబు పరువుకాపాడండి అంటూ చేసిన ప్రచారము కూడా ఫలితాన్నిఇచ్చింది.జనరల్ మహిళకు రిజర్వు అయిన కందుల వారి పల్లి పంచాయతీలో టిడిపి మద్దతుదారు బొబ్బ లక్ష్మి 563 ఓట్లతో విజయం సాధించారు. వార్డులకు జరిగిన ఎన్నికల్లోనూ స్వల్ప తేడాతో ఎనిమిది వార్డులు టీడీపీ కైవసం చేసుకోవడం తో టీడీపీ జిల్లా స్థాయి నేతలు కసింత స్థిమిత పడుతున్నారు.