iDreamPost
android-app
ios-app

పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అంటే ఎలా బాబులూ?

పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అంటే ఎలా బాబులూ?

యాయవారం బ్రాహ్మణులు తమకి బియ్యం భిక్ష వేసిన గృహిణులని మంత్రాలతో ఆశీర్వదిస్తారు. కొత్తగా అందులోకి ప్రవేశించిన ఒక పిల్లవాడు ఆశీర్వాద మంత్రం గుర్తు పట్టుకోలేక తనకు బాగా వచ్చిన పిడుగుపాటు మంత్రమైన అర్జునా ఫల్గుణా మంత్రాన్నే బియ్యం భిక్షగా వేసిన వారిని ఆశీర్వదిస్తూ చెప్పేవాడట. పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అనే సామెత అలా పుట్టింది.

రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్ బాబు ఇద్దరూ పిడుక్కీ, బియ్యానికే కాదు, దేనికైనా ఒకే మంత్రం జపిస్తున్నారు. అదే కుల మంత్రం. ఈఎస్ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్టు చేస్తే బీసీ నాయకుడిని అరెస్టు చేస్తారా అని ట్విట్టర్లో గర్జించి, ఇద్దరూ తమ అకౌంట్లలో ప్రొఫైల్, హెడర్ పిక్చర్లు రెండు అచ్చెన్నాయుడువి పెట్టి “వియ్ ఆర్ విత్ అచ్చెన్నాయుడు” అని తమ సపోర్టు తెలిపారే కానీ, అచ్చెన్నాయుడు నిర్దోషి, ఈ విషయాన్ని కోర్టులో నిరూపిస్తాం అని గట్టిగా చెప్పలేకపోయారు.

ఆ తరువాత మత్తు డాక్టర్ సుధాకర్ మీడియా కెమెరాల సాక్షిగా మందు తాగిన మైకంలో వీరంగం సాగించి అరెస్టైతే, దళిత డాక్టరుని అరెస్టు చేస్తారా అని # we support Dr.Sudhaakar అని ట్విట్టర్ సాక్షిగా పోరాటం సాగించారు. ఆ తరువాత ఆ డాక్టర్ తప్పు చేశానని ఒప్పుకున్నాక అది మూలన పడిపోయింది.

ఒక మాజీమంత్రి మీడియా కెమెరాల సాక్షిగా ఒక మహిళా అధికారి మీద అసభ్యంగా మాట్లాడితే, నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేసినందుకు, ఈసారి బలహీన వర్గాల కార్డు వాడే వీలులేక, సీనియర్ సిటిజన్స్ కోటా వాడి, సీనియర్ నాయకుడి మీద కేసు పెడతారా అని కోర్టులో స్టే తెచ్చుకున్నారు.

ఒక యువతి తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్ళి చేసే ప్రయత్నం చేశారని యనమల రామకృష్ణుడు మీద కేసు పెడితే, దాన్ని ప్రభుత్వం మీదకు తోసి, మరొక బీసి నాయకుడి మీద ప్రభుత్వం దౌర్జన్యం అని రచ్చ చేసే ప్రయత్నం చేశారు.

ఇప్పుడు ఒక మంత్రి అనుచరుడిని హత్య చేసిన హంతకుడు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం ఒక మాజీ మంత్రిని అరెస్టు చేస్తే, సదరు మంత్రి నిర్దోషి అయితే కోర్టులో నిరూపించుకునే ప్రయత్నం మానేసి, ట్విట్టర్లో ఒక చిత్రం తయారు చేసి, ప్రభుత్వం వేధిస్తున్న మరొక బీసి నాయకుడు అని ఇద్దరు బాబులు ట్విట్టర్ పోరాటం చేస్తున్నారు.

అచ్చెన్నాయుడు తర్వాత ఇన్ని కేసులు వచ్చినా చంద్రబాబు, లోకేష్ బాబు ఇద్దరు తమ ప్రొఫైల్స్ లో అచ్చెన్నాయుడు ఫోటోలే కొనసాగిస్తూ, వియ్ ఆర్ విత్ అచ్చెం అని చాటి చెప్తూ, ఇతర నాయకులకి ఏరోజుకారోజు ట్వీట్లతో మద్దతు తెలియజేస్తున్నారు. ఎక్కడ అచ్చెన్నాయుడు అప్రూవర్ గా మారి, తమను ఇరికిస్తాడో అని తండ్రీకొడుకులు భయపడుతున్నారు అని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమేమో అని దీన్ని చూస్తే ఎవరికైనా అనుమానం కలగకమానదు!!