కోర్టులో విచారణ మొదలైంది.. ఒక కేసులో అడవే తల్లిగా భావించే ఆదిమ జాతికి చెందిన కొండయ్యని విచారిస్తున్నారు..
భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను.. అబద్ధం చెప్పను.. అని ప్రమాణం చెయ్యి…
కొండయ్య : అయ్యా! నాకు భగవద్గీత గురించి తెలీదయ్య…
లాయర్: అయితే ఖురాన్ మీద ప్రమాణం చేస్తావ….
కొండయ్య: ఖురాన్ కూడా తెలీదయ్య నాకు…
లాయర్: పోనీ బైబిల్ మీద ప్రమాణం చేస్తావా..
కొండయ్య: అదికూడా తెలీదయ్య నాకు.. అయినా అడవి జాతికి చెందిన నాకు ఆ గ్రంధాల గురించి ఎలా తెలుస్తుందయ్య నాకు..
లాయర్: ఎప్పుడైనా ఈనాడు పేపర్ చదివావ?
కొండయ్య: అయినా ఇప్పుడు “ఈనాడు” గురించి ఇప్పుడు ఎందుకు సారూ ?..
లాయర్: ఈనాడు హిందువుకు గీత, ముస్లింలకు ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ అన్న సంగతి నీకు తెలీదా?..
కొండయ్య: లేదయ్యా ఈనాడు పేపర్ అంత గొప్పదని నాకు తెలీదు. అంటే అందులో అన్ని మతాల గురించి చెప్తారా బాబు.. ప్రవచనాలు, మనిషిలో దేవుళ్ళ గురించిన విషయాలు మనకి చెప్తారా ?
లాయర్: లోకంలో ఎన్నో మతాలున్నాయి, ఎందరో మతస్తులు ఉన్నారు.. వారికి వారి మత గ్రంధం ఎంత ముఖ్యమైందో ఈనాడు కూడా అంతే ముఖ్యమైంది అన్నమాట.. ఒక్క మాటలో చెప్పాలి అంటే పేకాటలో జోకర్ లాంటిది.. అంటే అందరికీ అవసరమే…
కొండయ్య: నాకు ఆ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి బాబు.. ఏదో కూలో నాలో చేసుకునేటోడిని.. పనికి వెళ్లడం తిరిగి రావడం ఇదే నాకు తెలిసిన పని.. ఈ మతాల గురించి నాకు తెలిదయ్య..
లాయర్: అదే నువ్ ఈనాడు చదివి ఉంటే కూలి పనికి వెళ్లేవాడివి కాదు.. నీకు అనువైన ఉద్యోగావకాశాలు గురించి అందులో ప్రకటనలు వస్తాయి. ఏదొక జాబులో ఎప్పుడో కుదురుకునేవాడివి.
కొండయ్య: వేలి ముద్ర గాడిని నాకు జాబు ఎవరిస్తారయ్య.. అప్పుడెప్పుడో జాబు రావాలంటే బాబు రావలన్నారని నాకు జాబు ఇత్తారేమో అని ఓటేసినా.. తీరా చూస్తే చదువుకున్నోళ్లకే జాబులు లేవు, నీకు ఎలా ఇస్తాం అని బాబు అంటే ఉసూరంటూ మళ్ళీ కూలి పనికే పోయినా సారు..
లాయర్: అప్పట్లో అమరావతికోసం మనసు పెట్టడం వల్ల జాబులపై బాబు దృష్టి సారించలేదులే.. లేకుంటే ఇంటికి మూడు ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చి ఉండేవి.. ఆయనే ఈనాడు గొప్పదనం గురించి మనకు తెలిసేలా చేసింది. ఆయనన్న మాటలను బట్టే ఈనాడు పవిత్ర గ్రంథాలతో సమానమన్న విషయం అర్ధం అయ్యింది.
కొండయ్య: ఒకవేళ ఏదైనా ఇంట్లో ఇద్దరు మనుషులే ఉంటే మూడో ఉద్యోగం ఎవరికిత్తారు బాబూ?
లాయర్: నువ్ ఈనాడు చదివితే ఇన్ని ధర్మ సందేహాలు వచ్చేవి కావు.. ఎప్పుడైనా చదివి చూడు.. కొత్త లోకంలో విహరిస్తావ్.. కొంగ్రొత్త విషయాలు తెలుస్తాయి.. నువ్వు ఈ నేరంలో చిక్కుకునే వాడివి కాదు..
కొండయ్య: దానికి దీనికి ఏం సంబంధం సారు..?
లాయర్: ఒక్కసారి ఈనాడు చదవడం మొదలెడితే ఆధ్యాత్మిక చింతనలో కూరుకుపోయి బయటకు రావడానికి కూడా ఇష్టపడవు.. ఈనాడు నే చదువుతూ కూర్చుంటావ్.. ఇంక నేరం చేసే ఆలోచన నీకు ఎలా వస్తుంది..
కొండయ్య:నాకు చదువు రాదు బాబు.. అలాంటప్పుడు నేనెలా చదవగలను..
లాయర్: పిచ్చోడా నాకు మాత్రం చదువొచ్చా.. ఈనాడు చదివి లాయర్ అవ్వలేదా.. ఓసారి మా పేపర్ బాయ్ భగవద్గీత వేయడం మర్చిపోయాడు.. ఆ ఏజెంట్ పై కేసు వేసి గెలవడానికి లాయర్ చదువు చదివాను లాయర్ అయ్యాను.. అలా నా చదువుకు కూడా కారణం నా ఈనాడు భగవద్గీత నే.. నీక్కూడా ఏదొక మార్గం చూపిస్తుంది చదువుకో.. అయినా నీకు చదువు రాదు కదా.. అందుకే ఒకడికి కూలిచ్చి రోజూ పేపర్ చదివించుకో సరేనా..
కొండయ్య: అయ్యా…. కూలి కెళ్ళేటోడిని.. నేనెలా కూలి ఇస్తానయ్యా…
లాయర్: నీ బ్రతుకు మారాలి అంటే ఈనాడు చదవాలి…లేకుంటే అదే స్థితిలో ఉంటావు అని చెప్తూ… కోర్ట్ మొత్తం నిశ్శబ్దంగా ఉందేంటి అని లాయర్ తలెత్తి చూస్తే కొండయ్య తప్ప… జడ్జ్ తో సహా అందరూ స్పృహ తప్పి పడి ఉన్నారు….