చంద్రబాబు కుప్పం కోటకు బీటలు వారుతున్నాయి. 1989 నుంచి వరుస విజయాలతో తన సొంత జిల్లా చిత్తూరులోని కుప్పం నియోజకవర్గంలో నెగ్గుకొస్తున్న బాబు పరిస్థితి రానురాను దిగజారుతోంది. తాజాగా కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కనిపించకుండా పోయింది.
నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో మొత్తం 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే, అధికార వైసీపీ ఏకంగా 74 స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. టీడీపీ కేవలం 14 చోట్ల, ఒక పంచాయతీలో స్వతంత్రుడు గెలుపొందారు. ఇదేమి సాదాసీదా గెలుపు కాదు. గతంలో టీడీపీ కీ కంచుకోటగా ఉన్న గ్రామాల్లో సైతం ఇప్పుడు వైసీపీ మద్దతుదారుల హవా కనిపించడం చంద్రబాబు అండ్ కో కు మింగుడు పడటం లేదు. ఏం జరుగుతుందో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు.
గత ఎన్నికల్లోనే చావు తప్పి
2019 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంనుంచి చంద్రబాబు మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఎన్నికల కౌంటింగ్ లో మొదటి రెండు రౌండ్లు చంద్రబాబు సుమారు 1600 మెజారిటీతో వెనుక బడ్డారు. తర్వాత పుంజుకుని కేవలం 30 వేల మెజారిటీతో గెలిచారు. చంద్రబాబు కుప్పం నుంచి తొలిసారి 1989 ఎన్నికల్లో పోటీచేశారు. ఆ ఎన్నికల్లో 6900 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. అప్పటి నుంచి క్రమం గా పట్టు పెంచుకుంటూ 1994 నుంచి 2014 ఎన్నికల వరకు సగటున యాభై వేలకు పైగా మెజారిటీతో గెలిచారు.
Also Read: రెచ్చగొట్టిన చింతమనేని.. మరోసారి అరెస్ట్!
2004 నుంచి ఏ ఎన్నికల్లో కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయలేదు. చంద్రబాబు తరుపున కుటుంబ సభ్యుల్లో లేక పార్టీ నాయకులో నామినేషన్ వేసేవారు. ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టిపెట్టేవారు కాదు, కొన్ని ఎన్నికల్లో నామమాత్రం కూడా ప్రచారం చేయలేదు. కుప్పం మీద చంద్రబాబుకు ఆ స్థాయి నమ్మకం ఉండేది.
2019 ఎన్నికల్లో చంద్రబాబు సాధించిన ముప్పై వేల మెజారిటీ నియోజకవర్గం మీద ఆయనకు పట్టుతప్పుతుందన్న సంకేతాలు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి క్యాన్సర్ బారిన పడి, ఎన్నికల ప్రచారానికి దూరంగా ఎక్కువ కాలం హాస్పటల్లో ఉన్నారు. ఓటు కూడా వేయలేకపోయారు. చంద్రమౌళి క్యాన్సర్ నుంచి కోలుకోలేక పోయారు. గత ఏప్రిల్ లో మరణించారు –చంద్రబాబుకు చమటలు పట్టించిన చంద్రమౌళి కన్నుమూత
చంద్రమౌళి ఆరోగ్యంగా ఉండి ,ఎన్నికల ప్రచారం చేసుకోకలిగితే చంద్రబాబు మెజారిటీ ఇంకా తగ్గివుండేదని పరిశీలకుల అంచనా. చంద్రబాబు కౌంటింగ్ లో మొదటి రెండు రౌండ్లలో వెనుకబడినప్పుడే నైతికంగా ఓడిపోయారని వైసీపీ నేతలు వాఖ్యానించారు.
కీలక మండలాల్లో దూరం అవుతున్న తెలుగు తమ్ముళ్లు
కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడి పల్లె మండలాల్లో టీడీపీ పట్టు అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శాంతిపురం మండలం లో టిడిపి హవా కు తిరుగుండదు. ఈ మండలంలోనే చంద్రబాబు అనుచరులు ఎక్కువ. చంద్రబాబు పీఏ గా వ్యవహరించిన మనోహర్, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు వంటి నేతలు ఉండే శాంతిపురంలో టీడీపీ పూర్తిగా చతికల పడింది. ఇక్కడ 22 పంచాయతీల్లో వైసీపీ విజయకేతానం ఎగురవేయడం, టీడీపీ క్రింది స్థాయి కార్యకర్తలు క్రమంగా వైసీపీ లోకి రావడం చూస్తే కీలక మండలం చేజారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి గుడిపల్లి మండలంలోనూ కనిపించింది. పంచాయితీల్లో పాగా వేసి, గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు వైసిపికి ఇది మంచి అవకాశం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబు కుప్పం సొంత నియోజకవర్గంలో ఓడించేందుకు ఒక ఆయుధం గా ఈ ఫలితాలు ఉపయోగపడతాయి అనడంలో సందేహం లేదు.
పెద్దిరెడ్డి దృష్టి సారించడంతో…
2014, 2019లో కుప్పం నుంచి చంద్రబాబు మీద పోటీ చేసిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి 2019 ఏప్రిల్ లో మృతి చెందారు. దీంతో నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు చంద్రమౌళి కొడుకు భరత్ కు ఇచ్చారు. సీనియర్ నేత,మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వంలో భరత్ కుప్పంలో వైసీపీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు.
Also Read: బాబుకు ఇది “రాజీ” లేని “డ్రామా”గా మారింది!
కుప్పం నియోజకవర్గంలో మండలాల వారీగా పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఇది గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాన్ని ఇచ్చింది. మొత్తం నాలుగు మండలాలను చూసుకునే బాధ్యత కాకుండా కేవలం మండలాల వారీగానే నాయకులు దృష్టి పెట్టడంతో గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్తను కలుపుకుని వెళ్లే సౌలభ్యం దొరికింది. దీంతో పాటు గ్రామాల్లో పట్టు ఉన్న నాయకులను వైసీపీలో చేర్చుకోవడం, వారిని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టడం వంటి విషయాలను సైతం పెద్దిరెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఫలితంగా కుప్పం కోట వైసీపీ వశం అయ్యింది.
ఆయనేమన్న పోటుగాడా అంటూ తన స్థాయిని మరిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించటం చంద్రబాబుకు సమస్యలు తెచ్చిపెట్టింది. పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో మొత్తం పంచాయితీలను ఏకగ్రీవం చేసుకొని కుప్పం మీద దృష్టి పెట్టి 89 పంచాయితీలలో 74 పంచాయితీలు అంటే దాపు 83% గెలిపించుకున్నారు…
ఏమీ చేయలేదన్న నిస్పృహ
కుప్పం నియోజకవర్గం భౌగోళిక స్వరూపం విచిత్రంగా ఉంటుంది. ఇటు తమిళనాడుతో అటు కర్ణాటక సరిహద్దు పంచుకునే ఏకైక నియోజకవర్గం రాష్ట్రంలో ఇదే. దాదాపు కుప్పం నియోజకవర్గంలోని ప్రజలంతా కూలి పనుల కోసం రాష్ట్రం దాటి తమిళనాడు కర్ణాటక ప్రాంతాలకు వెళ్తారు. అక్షరాస్యత రేటు చాలా తక్కువ.
Also Read: ఉక్కు సంకల్ప ఉద్యమకారులను గెలిచిన జగన్
మూడు దశాబ్దాలపాటు కుప్పం ఎమ్మెల్యే గా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్న నిస్పృహ స్థానికుల్లో అలుముకుంది.కుప్పం నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో ఉన్న ద్రావిడ విశ్వవిద్యాలయం ఉన్నతికి చంద్రబాబు ఎప్పుడు దృష్టిసారించింది లేదు. కుప్పం నియోజకవర్గంలో ఆహారశుద్ధి పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పిస్తామన్న ఆయన మాటలు సాకారం కాలేదు. పీఈసీ హాస్పిటల్ అంతా కార్పోరేట్ చదువులకు ఆవాసం అయిందే తప్ప, అక్కడ పేదలకు వైద్యం సున్నా. ఇక నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి అయితే అత్యంత దారుణం. కొన్ని గ్రామాలకు ఎప్పటికీ రోడ్లు లేవు –బాబుకు ఓట్ల “కప్పం” కట్టే కుప్పం
నియోజకవర్గంలో అధికంగా పండించే వేరుశనగ పంటకు సాగు నీరు రాక , ప్రతిసారీ దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు. హంద్రీ-నీవా నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీరు ఇస్తామని , చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతిసారి చెప్పడం తప్పించి పనులు పూర్తిచేసింది లేదు,నీరు ఇచ్చింది లేదు. ఇలా ప్రతీ విషయంలోనూ కుప్పం నియోజకవర్గం వెనుకబాటు కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు మీద కోపం, ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అమలవడం పట్ల ఇక్కడి ప్రజలు వైసిపి పట్ల మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తే గెలుపు కోసం శ్రమించాలి,కచ్చితంగా స్వయంగా ప్రచారం చెయ్యవలసిన పరిస్థితి.