Idream media
Idream media
మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఓ పక్క ఉద్యమం చేస్తుంటే.. జనాల్లో స్పందన మరో విధంగా ఉంటోంది. ఇటీవల కాలంలో మూడు రాజధానులు ముద్దు అంటూ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి మూడు రాజధానులు ఉండాల్సిందే అంటూ నినదిస్తున్నారు. చంద్రబాబు కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఆయన అమరావతి ఉద్యమం పేరుతో జూమ్ వేదికగా ప్రసంగాలు ఇస్తున్నప్పటి నుంచి ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పెరుగు తుండడం గమనార్హం.
అమరావతి పరిసర ప్రాంతానికే చెందిన ఓ కానిస్టేబుల్ చంద్రబాబు చర్యలకు నిరసనగా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు ఇక అమరావతి ఉద్యమం ముగిస్తెనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టిడిపిలో కూడా ఈ చర్చ మొదలైనట్లు తెలుస్తోంది.
జగన్ కి పెరుగుతున్న మద్దతు.. ఇదే నిదర్శనం
పాలనా రాజధానిగా విశాఖ ను కొనసాగించాలని స్థానికంగా డిమాండ్ పెరుగుతోంది. ప్రజలు ప్రత్యక్ష ఆందోళనలు చేస్తున్నారు. కర్నూలు లో సైతం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. న్యాయ రాజధానిగా కర్నూలు నిర్ణయానికి మద్దతు గా స్థానికులు ఆందోళన చేశారు. మూడు రాజధానుల వ్యవస్థతో ప్రాంతీయ సమానాభివృద్ధి సాధించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి పెరుగుతున్న మద్దతుకు మరో ఉదాహరణ కానిస్టేబుల్ రాజీనామా.
అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణకు ఉద్దేశించిన మూడు రాజధానులకు మద్దతు తెలుపుతూ పోలీస్ కానిస్టేబుల్ బసవరావ్ రాజీనామా చేశారు. అమరావతి పేరుతో ఆనాటి సీఎం చంద్రబాబు భూములను బలవంతంగా లాక్కొన్నందుకు నిరసనగా.. పదేళ్ల సర్వీసును వదులుకున్నారు. మంగళగిరి మండలం కురగల్లుకు చెందిన బసవరావ్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని హుమయున్ నగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పునారాలోచించుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది.