iDreamPost
android-app
ios-app

ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చిన చంద్రబాబు

ప్రభుత్వానికి 48 గంటల సమయం ఇచ్చిన చంద్రబాబు

పేరుకేమో 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. కానీ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు.. గత ఎన్నికల్లో  ప్రజలు 23 సీట్లతో బుద్ధి చెప్పినా ఆయన వ్యాఖ్యలు మారలేదు.. రాజధాని విషయంలో ప్రజల్లో లేని వ్యతిరేకతను మార్చుకుని తనకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అందులో భాగంగా అర్ధ రహితమైన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వానికి రాజీనామాల సవాల్ విసిరారు.తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమని అధికార పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాజీనామాలు చేసి ప్రజల్లో తేల్చుకుందాం అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక సీట్లను గెలుచుకున్న పార్టీకి ఏం అవసరం ఉందంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రశ్నించాలి లేదా సవాల్ విసరాలి కానీ మీరు సిద్ధమా మేము సిద్ధం అంటూ మాటల గారడీ చేసినంత మాత్రాన ప్రజల్లో ప్రాభవం కోల్పోవడం మినహా ఏమి ఉండదని సొంత పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే గవర్నర్ రాజముద్ర వేసిన నేపథ్యంలో మూడు రాజధానులను అడ్డుకోవడం అసాధ్యమే. కానీ ఇంకా రాజధాని సాకుగా చూపిస్తూ రాజకీయం చేయాలని అనుకోవడం ప్రజల్లో చులకన అవడం మినహా దాని వల్ల పార్టీకి ఒనగూరే లాభం ఏమీ ఉండదన్న విషయం చంద్రబాబుకు ఇంకా అర్థం కాకపోవడం గమనించాల్సిన విషయం.  అసలు అసెంబ్లీ రద్దు చేసి ఇప్పటికిప్పుడు ప్రజల్లోకి వెల్దామని సవాల్ విసిరిన చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేసిన వ్యాఖ్యలని రాష్ట్ర ప్రజలకు అర్ధం చేసుకోలేని పిచ్చివాళ్ళు కాదు.

ఇప్పటికే విశాఖ ప్రాంతంతో పాటు రాయలసీమ రాజధాని ప్రాంతం టీడీపీ ఎమ్మెల్యేలు రాజధాని విషయంలో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతుంటే మా ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం మీ ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమా..అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్దాం అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరిన చంద్రబాబు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇవ్వడం విశేషం..ఈ 48 గంటలు గడచిన తర్వాత ఈ విషయం గురించి మళ్ళీ మీడియా ముందుకు వస్తానని చెప్పడం కొసమెరుపు. ఈ 48 గంటలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతారో అంటూ పలువురు వ్యంగ్య వ్యాఖ్యానాలు చేస్తున్నారు.