వెనకటికొక మహా సాద్వీమణి మొగుడ్ని నాలుగు గోడల మధ్య కొట్టేసి, వీధిలోకొచ్చి ఏడ్చేదట.. చూసే వాళ్ళకు అయ్యో పాపం ఎలా హింసిస్తున్నాడో చూడండి అంటూ సింపతీ కొట్టేయడానికి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడి పరిస్థితి దాదాపుగా ఇలానే ఉందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అధికారంలో ఉండగా చేసిన అనేకానేక ఘన కార్యాలు, వాటి ప్రభావాలను ప్రజలు నేరుగానే చూసారు. అందుకే తగిన తీర్పు ఇచ్చిన ప్రతిపక్షం వైపు కుర్చీవేసారు.
అయితే జనానికి అర్ధం కాని రీతిలో జరిగిన మరికొన్ని ఘన కార్యాలపై ఇప్పుడు అధికారంలోకొచ్చిన ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ క్రమంలో అమరావతి భూములు, ఫైబర్‌గ్రిడ్ తదితర వాటిల్లో అనేక ‘రంధ్రాలు’ బైటకొస్తున్నాయి. తమ రంధ్రాలు బైటకు రాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కోర్టుకు వెళ్ళి దర్యాప్తు జరక్కుండా స్టేలు కూడా తెచ్చుకున్నారు. ఇదేంటిది నిజాయితీ నిరూపించుకోవాలంటే దర్యాప్తు జరగనివ్వాలి కదా? అన్న డౌటు జనానికి వచ్చినప్పటికీ, జనంతో మాకేం సంబంధం లేదు మమ్మల్ని మేము కాపాడుకోవాలంతే! అన్న రీతిలోనే వీరి వ్యవహారాలు సాగుతున్నాయని జనం అభిప్రాయంగా ఉంది.
కాగా ఇప్పుడు పైనచెప్పుకున్న సాధ్వీమణి మాదిరిగా చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ 16 నెలల పాలనపై కూడా సీబీఐ దర్యాప్తే కాకుండా, ఏసీబీ, ఏబీసీడీ, ఈఎఫ్‌ఐజేకెఎల్.. ఇంకా ఇంగ్లీషు వర్ణమాలలో ఉన్న అన్ని అక్షరాలకు సంబంధించిన దర్యాప్తులన్నీ చేయించేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తన పాలనపై కూడా చేయాలని మాత్రం ఆ డిమాండులో గట్టిగా డిమాండు చేయడం లేదు.
ఇక్కడ జనానికొస్తున్న ఒక డౌటు ఏంటంటే.. తన పార్టీ నేతలచేత వేయించిన స్టేలను వెనక్కి తీసుకుని, అప్పటి తన పాలనపై, ఇప్పుడున్న వారి పాలనపై విచారణ చేయాలని డిమాండ్ చేయాలి కదా? అన్నదే. ఇలా చేస్తే చిత్తశుద్ధి అంటారు. కానీ ఇలా డిమాండ్ చేయకుండా మెట్ట వాదానికి తెరలేపడమే ఇప్పుడు ఆక్షేపణలకు కారణమవుతోంది. తన హయాంలో అవినీతి జరిగిందా? లేదా? అన్నది సూటిగా చెప్పకుండా, వేరే వాళ్ళ పాలన మీద విచారణ చేయాలని డిమాండ్ చేయడం ఏ విధమైన అనుభవం క్రిందికొస్తుందో చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులే చెప్పాలని అధికార వైఎస్సార్‌సీపీ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటన్న పరిణామాల నేపథ్యంలో అందరి వేళ్ళూ చంద్రబాబువైపే చూపిస్తున్నాయన్నది స్పష్టమవుతోంది. అయితే ఏదైనా ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు జనం దృష్టిని మరల్చడం అన్న విద్యలో పోస్టు గ్రాడ్యుయేట్ అయిన చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే ఇప్పుడు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. తనకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే రాష్ట్ర ప్రజల మొత్తానిదే ఆ ఇబ్బంది అన్న రీతిలో ప్రచారం చేయడంలో దిట్టయిన చంద్రబాబు వ్యవహారం ఏ కొలిక్కి చేరుతుందో కాలమే తేల్చాలి.