iDreamPost
iDreamPost
పోలవరం ప్రాజెక్టుపై తెలుగుదేశం నాయకులకు ఎందుకో హఠాత్తుగా ప్రేమ పుట్టుకొస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, నీటిపారుదలశాఖ మాజీమంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశంలో సోమవారం పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండు చేశారు. పనిలో పనిగా ఈ ప్రాజెక్టుపై మరో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. దీని కోసం రూ. వేయి కోట్లు ఖర్చు చేయనున్నారని చంద్రబాబు చెప్పగా, రూ.912.84 కోట్లు వెచ్చించనున్నారని ఉమా జోస్యం చెప్పేశారు. ప్రభుత్వం పొలవరంపై మరో ఎత్తిపోతలు నిర్మిస్తామని ఇంతవరకు ఎటువంటి విధాన ప్రకటన చేయక పోయినా వీరు ఎందుకిలా ఇన్ని కోట్లతో నిర్మిస్తారని వీధికెక్కుతున్నారో అర్థం కావడం లేదు.
సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదట..
రాష్ట్రంలో సాగునీటి రంగంపై సీఎం జగన్మోహనరెడ్డికి సరైన ప్రణాళిక లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం పనులను నీరుగార్చి, మరో ఎత్తిపోతల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. త్వరలో సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తానని ప్రకటించారు ..
ఎవరు ప్రజలను మోసగించారు?
తన హయాంలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులకు తల ఊపి జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యత తాను తీసుకుని కమీషన్లు బొక్కేసి దాని నిర్మాణాన్ని చంద్రబాబు అటకెక్కించారు. పైగా పట్టిసీమ పేరుతొ రూ. 1600 కోట్లతో ఎత్తిపోతల పథకం నిర్మించి పోలవరం జాప్యానికి దారులు వేశారు. పట్టిసీమే కాకుండా ఎడమ కాలువ పై పురుషోత్తమపట్నం ఎత్తిపోతలు చేపట్టి.. పోలవరాన్ని పూర్తిగా అటకెక్కించిన చంద్రబాబు.. ఇప్పుడు వైసిపి పై అభియోగాలు మోపుతున్నారు.
Also Read : TDP State Committe -టీడీపీ ఏపీ కమిటీ : రండి బాబూ రండి.. ఎంత మందికైనా పదవండి!
ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోయినా ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలి అనే దురుద్దేశంతో దాని సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారు. అందుకు అయిన ఖర్చును కూడా ఆర్టీసీకి చెల్లించక పోవడంతో అసలే నష్టాల్లో ఉన్న ఆ సంస్థ మరింత కునారిల్లిపోయింది. తన పార్టీ నేత రాయపాటి సాంబశివరావుకు పోలవరం నిర్మాణ కాంట్రాక్టు అప్పగించి అడ్డంగా దోచుకున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని రకాలుగా పోలవరం పేరిట ప్రజలను మోసగించి, వాళ్ల ఛీత్కారానికి గురైన చంద్రబాబునాయుడు ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారు.
బహుళార్థ సాధక ప్రాజెక్టు అని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా?
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే బహుళార్థసాధక ప్రాజెక్టు పోలవరాన్ని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుత విద్యుత్తు కష్టకాలంలో 960 మోగావాట్లు ఉత్పత్తి అయ్యేదని పేర్కొన్నారు. సంవత్సరానికి 2 వేల కోట్లు ఆదాయాన్నిచ్చే పవర్ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఈ సంగతులన్నీ నీటిపారుదలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉమకు తెలియవా? ప్రాజెక్ట్ నిర్మాణ గడువును పలుసార్లు పొడిగించి దాని నిర్మాణ వ్యయం విపరీతంగా పెంచెయడంలో ఈయన పాత్ర లేదా? అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నించడమే నేరం అన్నట్టు నోరేసుకొని దాడి చేసినప్పుడు, రాసుకోండి 2018 డిసెంబర్ కు పోలవరం పూర్తి చేసి తీరతామని ప్రగల్భాలు పలికినప్పుడు ఈ ప్రాజెక్టు బహుళార్థ సాధకమని గుర్తు లేదా? పైగా ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండు చేయడం విడ్డూరం కాక మరేమిటి? జనం ఏమీ గమనించడం లేదనుకొని అధికారం ఉండగా అడ్డగోలుగా వ్యవహరించి, ఇప్పుడు ఇలా మాట్లాడితే నిజాలు మరుగున పడవు.
Also Read : Former Minister Kuthuhalamma – చంద్రబాబుకు షాక్ .. సొంత జిల్లాలో టీడీపీకి మాజీమంత్రి రాజీనామా