iDreamPost
iDreamPost
ఎదుటి వారి మీద నిందారోపణకైనా, ఆరోపణకైనా ఒక వేలు చూపిస్తే మనవైపు నాలుగు వేళ్ళు చూపిస్తుంటాయని పెద్దలు చెబుతుంటారు. కొంచెం జ్ఞానం తెలిసే వయస్సు వచ్చిన నాటి నుంచి ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళతో పాటు, సమాజంలోని పలువురి నుంచే కాక స్కూల్స్‌లో కూడా పదేపదే గుర్తు చేస్తుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని మాత్రం పట్టించుకుంటున్న దాఖలాల్లేవు.
అధికారం పోయిన నాటి నుంచి ఆయన అనుసరిస్తున్న వైఖరిని గమనించిన వారు ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీ రామారావు నుంచి పార్టీని తీసుకున్నాక ఈ విషయాన్ని చంద్రబాబు పూర్తిగా మర్చిపోయినట్లున్నారన్న వాదనలు కూడా ఉన్నాయి.
నిజానికి ఎన్టీరామారావు పార్టీ పెట్టిన నాడు రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాలు ఆయన వెంట నడిచాయి. అప్పుడు రామారావు కులం గురించి ఎవ్వరికీ గుర్తు రాలేదు, పట్టించుకోలేదు. దాంతో అనూహ్యంగా చరిత్ర సృష్టించే
స్థాయిలో సీట్లు గెల్చుకోగలిగారు.
నారా వారి హాయాం ప్రారంభమయ్యాక టీడీపీని ఒక కులానికి సంబంధించిన పార్టీ స్థాయికి కుంచించి వేసారన్నది రాజకీయ వర్గాలు బాహాటంగానే చేస్తున్న విమర్శ. అంతే కాకుండా ఒక ప్రాంతానికి కూడా పరిమితం చేసేసారని తాజాగా ఇప్పుడు చేస్తున్న ఆరోపణ. రాజధాని విషయంలో 29 గ్రామాలకే తెలుగుదేశం పార్టీ పరిమితమైపోగా, చంద్రబాబు సొంత సామాజికవర్గం వారికోసం మాత్రమే గళమెత్తుతుండడంతో ఆ కులానికి మాత్రమే ఆయన నాయకుడిగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్నట్లుగా పరిశీలకులు చెప్పుకొస్తున్నారు.
అయితే వీటన్నిటినీ పట్టించుకోకుండా సీయం వైఎస్ జగన్ వైపు చంద్రబాబు వేలెత్తి చూపడం ఇప్పుడు ఆయన వైఖరిని తప్పుబడుతున్నారు. చంద్రబాబు సామాజికవర్గానికి సీయం జగన్ వ్యతిరేకం అన్నరీతిలో చంద్రబాబు ఆయన బృందంలోని మీడియా ఏకధాటిగా నోరు పారేసుకుంటున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబు వైపు నాలుగు వేళ్లు చూపిస్తున్న సంగతిని చంద్రబాబు, ఆయన బృందం మర్చిపోతున్నారు.
రాజకీయ అనుభవజ్ఞులు వేసిన లెక్కల ప్రకారం చంద్రబాబు హయాంకు ముందు, ఆ తరువాత ఆయన సొంత సామాజికవర్గానికి చెందిన నేతలు ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యారన్న లెక్కలు ఇటీవలే బైటకు వచ్చాయి. వాటి ప్రకారం చంద్రబాబు హయాం ప్రారంభమయ్యాక ఆయన సొంత సామాజికవర్గం నేతలు ఎమ్మెల్యేలుగా గెలవడం గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. అయితే అలా ఓటమి పాలైన నేతలంతా ఆయా నియోజకవర్గాల్లో స్థానికులతో సత్సంబంధాలు ఉన్నావారే కావడం గమనార్హం.
దీనిని బట్టి తన సొంత సామాజికవర్గానికి చంద్రబాబు చేస్తున్న నష్టాన్ని గుర్తుంచుకోవాలని వారు హితవు పలుకుతున్నారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా సీయం వైపు వేలెత్తి చూపడం తగదని చెబుతున్నారు. నిజానికి చంద్రబాబు, ఆయన బృందం ఆరోపిస్తున్నట్లు సీయం జగన్ ఒక సామాజికవర్గానికే వ్యతిరేకం అయితే సదరు సామాజికవర్గానికి తన మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించకూడదు. కానీ అటువంటిదేమీ లేదు. అందరితో సమానంగా వారికి కూడా మంత్రివర్గంలో ప్రాధాన్యమిచ్చారు.
ఈ నేపథ్యంలో ఎదుటి వారివైపు వేలెత్తి చూపిస్తున్న చంద్రబాబు, తనవైపు చూపిస్తున్న నాలుగు వేళ్ళ సంగతి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఇప్పుడు తాను ఏ సామాజికవర్గం కోసం అయితే పోరాడుతున్నానని అనుకుంటున్నారో అదే సామాజికవర్గం వారు ‘ఇక చాలు బాబూ..’ అనే పరిస్థితి వచ్చినా రావొచ్చు.