iDreamPost
android-app
ios-app

ఏపీ ఉద్యోగులను సజ్జల బెదిరించారట!

  • Published Feb 08, 2022 | 6:45 AM Updated Updated Feb 08, 2022 | 6:45 AM
ఏపీ ఉద్యోగులను సజ్జల బెదిరించారట!

వంకలేని అమ్మ డొంక పట్టుకు ఏడ్చింది అన్నట్టు ఉంది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి తీరు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రోజురోజుకు ప్రజాదరణ పొందడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఆయన నిరాధార ఆరోపణలు చేస్తూ, వాటిని తన పెంపుడు మీడియా ద్వారా ప్రచారం కల్పిస్తూ మురిసిపోతుంటారు. అంధ్రప్రదేశ్‌లో పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం, ఉద్యోగులు మధ్య జరిగిన చర్చలు ఫలించి, సమ్మె నిర్ణయాన్ని ఉద్యోగులు విరమించుకోవడాన్ని చంద్రబాబు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే అర్థం పర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు.

తాజాగా చర్చల సందర్భంగా ఏపీ ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించడాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంటే ఆల్‌రెడీ సజ్జల ఉద్యోగులను బెదిరించేశారని జనం అనుకోవాలని ఆయన ఉద్దేశం. ఇదే అర్థం వచ్చేలా ఆదివారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా వ్యాఖ్యానించారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందని ఆయన ఆరోపించేశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు చంద్రబాబు ఏకంగా సజ్జల ఉద్యోగులను బెదిరించేశారని అనేశారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టు ఏం మాట్లాడినా అచ్చోసే వదిలేసే పత్రికలు, ఒకటికి పదింతలు చేసి చూపే ఎలక్ట్రానిక్‌ మీడియా చేతిలో ఉండడంతో అర్థం పర్థం లేని విమర్శలు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని వైఎస్సార్‌ సీపీ నేతలు అంటున్నారు.

Also Read : హమ్మా..ఈనాడు త‌న‌ఖా భాగోతం వెనుక అస‌లు క‌థ తెలుసా

అది సాధ్యమేనా బాబూ?

పీఆర్సీకి సంబంధించి తమ డిమాండ్ల సాధనకు విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వాన్ని, సీఎంను, సంప్రదింపుల కమిటీలోని సభ్యులను నోటికొచ్చినట్టు దూషించిన ఉద్యోగులను ఎవరైనా బెదిరించడం సాధ్యమేనా అని అధికారపార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 20 మంది నాయకులు చర్చలకు వెళితే వారిని ప్రభుత్వం బెదిరించింది అంటున్నారు కదా? అది చంద్రబాబుకు ఎవరు చెప్పారు.? ఏమని బెదిరించిందట? నిజంగా బెదిరిస్తే మరి ఉద్యోగుల డిమాండ్లలో ఒక్క ఫిట్‌మెంట్‌ తప్ప మిగిలిన అన్నింటిని ప్రభుత్వం ఎందుకు అనుమతిస్తుంది? కొత్తగా వారి డిమాండ్లను ఆమోదించడం వల్ల ప్రభుత్వానికి రూ.1,330 రికరింగ్‌ భారం పడింది. అంటే ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం ప్రభుత్వంపై భారం పెరుగుతుంది. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ ప్రకారం సంవత్సరానికి రూ.10,247 కోట్ల భారం పడగా, చర్చల ద్వారా కొత్త డిమాండ్లను ఆమోదించడం వల్ల రూ.11,577 కోట్లకు భారం పెరిగింది. ఇది రికరింగ్‌ కనుక ఏటా పెరుగుతుంది.

కరోనా సంక్షోభ సమయంలో ఇంత ఆర్థిక భారం మోయడానికి సిద్ధపడిన ప్రభుత్వం ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తుంది? బెదిరించిన మాటే నిజమైతే ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలైనా ఆ మాట చెప్పేవి కదా? అని వైఎస్సార్‌ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏదోవిధంగా ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే ఉద్దేశం తప్ప చంద్రబాబు చేసిన విమర్శలో నిజంలేదని అర్థమవుతోందని అంటున్నారు. టీడీపీ హయాంలో 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని చెబుతున్న చంద్రబాబు అది ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఇచ్చిందని గుర్తుంచుకోవాలని, అప్పుడు ఇంత ఆర్థిక ఇబ్బందులు లేవని అధికార పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రాకు ఉద్యోగులు ఎక్కువ.. ఆదాయం తక్కువ రావడంతో భారం పెరిగిందని వివరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇవన్నీ తెలిసినా ప్రభుత్వంపై బురద జల్లడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు తప్పుపడుతున్నారు.

Also Read : ఉత్తర కుమారుడిని తలపిస్తున్న అయ్యన్న సవాళ్లు